Diteld Project Report
-
ఎన్నాళ్లీ.. నరకయాతన!
స్ట్రాం వాటర్ డ్రెయిన్ టెండర్లకు మోక్షమెప్పుడో? ఏడాదిన్నర క్రితమే కేంద్ర నిధుల మంజూరు ఇంకా టెండర్ల దశ దాటని వైనం మున్సిపల్ మంత్రే అడ్డుపడుతున్నారని ఆరోపణలు వరదనీటి సమస్యతో నగరవాసుల ఇక్కట్లు విజయవాడ సెంట్రల్ : నగరంలో స్ట్రాం వాటర్ డ్రెయిన్ల నిర్మాణం ఓ ప్రహసనంలా మారింది. కేంద్ర ప్రభుత్వం 2014-15 బడ్జెట్ నుంచి స్ట్రాం వాటర్ డ్రెయిన్ల నిర్మాణానికి రూ.461.04 కోట్లు కేటాయించింది. ఈ మేరకు ఇంజినీరింగ్ అధికారులు డిటేల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)లకు అనుగుణంగా పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. గతేడాది మేలో తొలి విడతగా సుమారు రూ.140 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ మొత్తాన్ని రాజధాని నిర్మాణం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రిజర్వులో పెట్టింది. నగర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని, విజయవాడ రాజధానిలో అంతర్భాగమే కాబట్టి నిధుల్ని మంజూరు చేయాలని ఎంపీ కేశినేని నాని, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్‌కు లేఖ రాశారు. అయితే స్ట్రాం వాటర్ డ్రెయిన్ల నిధులు పక్కదారి పట్టిస్తే కుదరదని చంద్రబాబుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెగేసి చెప్పారు. దీంతో నిధుల విడుదలకు సీఎం అంగీకరించారు. మంత్రి, మేయర్ కీచులాట! ప్రజల అవసరాలకు అనుగుణంగా నగరాన్ని ఆరు జోన్లుగా విభజించి డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాలని నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు డిటేల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) రూపొందించారు. వంద కిలోమీటర్ల మేర పెద్ద డ్రెయిన్లు, 38 కిలోమీటర్ల మేర చిన్న డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాలని గుర్తించారు. గుంటుతిప్ప, ప్రసాదంపాడు, పుల్లేరు డ్రెయిన్ల వద్ద రోడ్ల విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నారు. ఇంతా చేశాక పనులను పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కు అప్పగించటం విశేషం. మున్సిపల్ మంత్రి పి.నారాయణ అందులో అత్యుత్సాహం చూపారనే వాదనలు ఉన్నాయి. దీనిపై మేయర్ కోనేరు శ్రీధర్ నగరానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీ వద్ద పంచాయితీ పెట్టారు. దీంతో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ టెండర్లు పిలుస్తోందని, నగరపాలక సంస్థ పర్యవేక్షణలో పనులు చేసుకోవచ్చని సీఎం చంద్ర బాబు మౌఖిక ఆదేశాలిచ్చారు. ఇది జరిగి ఐదు నెలలు గడిచినా టెండర్ల ప్రస్తావనే లేకుండా పోయింది. తనమాట చెల్లుబాటు కానీయలేదన్న ఉద్దేశంతో మున్సిపల్ మంత్రే టెండర్ల ప్రక్రియకు అడ్డుపడుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మూడేళ్లలోపు పూర్తవటం కల్లే.. కేంద్రం నిధులతో చేపట్టే స్ట్రాం వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనుల్ని మూడేళ్లలోపు పూర్తి చేయాలనే నిబంధన ఉంది. లేదంటే నిధులు మురిగిపోతాయి. నిధుల వినియోగానికి సంబంధించి ఆరు నెలలకోసారి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపాల్సి ఉంటుంది. నిధుల వినియోగంలో తేడా ఉంటే కంట్రోలర్ ఆఫ్ ఆడిట్ జనరల్ (కాగ్) తప్పుపట్టే అవకాశం ఉంది. ఇన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్ట్రాంవాటర్ డ్రెయిన్ల నిర్మాణంపై శీతకన్ను వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో మూడు నెలల తరువాత పనులు ప్రారంభమైనా షెడ్యూల్ ప్రకారం పూర్తయ్యే అవకాశం లేదు. వానొస్తే వరదే... వానొచ్చిందంటే నగరంలో కొన్ని ప్రాంతాలకు వరదొస్తోంది. గంటల కొద్దీ నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనచోదకులు, పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులో పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చిన నగర మేయర్ కోనేరు శ్రీధర్ వర్షపు నీటిలో చిక్కుకున్నారు. నగరంలోని 13 డివిజన్ల పరిధిలో 161 ఎకరాల్లో కొండలు విస్తరించి ఉన్నాయి. వర్షం వచ్చిన సమయంలో కొండ ప్రాంతాల నుంచి వచ్చే నీటిదాటికి రోడ్లు అతలాకుతలం అవుతున్నాయి. డ్రెయిన్ల గుండానే వర్షపునీరు ప్రవహించాల్సి వస్తోంది. వన్‌టౌన్, సర్కిల్ 3లోని పలు ప్రాంతాల్లో ఈ సమస్యలతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. -
స్ట్రాం వాటర్ డ్రెయిన్లకు రూ.461 కోట్లు
నిధులు విడుదల చేసిన కేంద్రం నెల రోజుల్లో వచ్చే చాన్స్ విజయవాడ సెంట్రల్ : నగరానికి నిధుల వరదొచ్చింది. స్ట్రాం వాటర్ డ్రెయినేజీ నిర్మాణం కోసం రూ.461.04 కోట్ల మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. నెలరోజుల వ్యవధిలో ఈ నిధులు నగరపాలక సంస్థకు చేరతాయని పాలకుల అంచనా. సాధ్యమైనంత త్వరలోనే పనులు చేపట్టాలని భావిస్తున్నారు. నగరాన్ని ఆరు జోన్లుగా విభజించి డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులు డిటేల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)ను రూపొందించారు. వంద కిలోమీటర్ల మేర పెద్ద డ్రెయిన్లు, 38 కిలోమీటర్ల మేర చిన్న డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాలని గుర్తించారు. గుంటుతిప్ప, ప్రసాదంపాడు, పుల్లేరు డ్రెయిన్ల వద్ద రోడ్లు విస్తరణకు ప్రతిపాదనలు రూపొందించారు. డ్రెయిన్ల నిర్మాణం పూర్తయితే నగరానికి వరద ముంపు తిప్పలు తప్పినట్టే. జలమయం నగరంలో చిన్నపాటి వర్షానికే లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతు న్నాయి. నీరు రోడ్లపై నిలిచి ప్రమాదాలు జరుగుతున్నాయి. నగరంలోని 13 డివిజన్ల పరిధిలో 161 ఎకరాల్లో కొండలు విస్తరించి ఉన్నాయి. వీటిపై 40వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. వర్షం వచ్చినపుడు కొండ ప్రాంతాల నుంచి వచ్చే నీటి ధాటికి రోడ్లు అతలాకుతలమవుతున్నాయి. మురుగునీటి డ్రెయిన్ల మీదుగానే వర్షపు నీరు ప్రవహించాల్సి వస్తోంది. డ్రెయిన్ల సామర్థ్యం చాలక సమస్యలు వస్తున్నాయి. మేయర్ కృషి ఫలించింది జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో భాగంగా రూ.49.13 కోట్లతో స్ట్రాం వాటర్ డ్రెయిన్లు నిర్మించాలని నిర్ణయించారు. 34 కిలోమీటర్ల మేర డ్రెయిన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిధుల కొరత ఎదురవడంతో ఆ పనుల్ని పక్కన పెట్టేశారు. ఈ క్రమంలో మేయర్ కోనేరు శ్రీధర్ స్ట్రాం వాటర్ డ్రెయిన్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టిసారించారు. రూ.424 కోట్లతో డీపీఆర్‌లు సిద్ధం చేయించారు. ఢిల్లీలోని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ కార్యాలయంలో పలువురు అధికారులను, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడును కలిశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమస్యను వివరించారు. పట్టణాభివృద్ధి శాఖ అధికారుల సూచన మేరకు.. రూ.462 కోట్లకు డీపీఆర్‌ను రివైజ్ చేశారు. విజయవాడ కష్టాలను వివరించిన మేయర్ వెంటనే ఆదుకోవాల్సిందిగా కోరారు. స్పందిం చిన వెంకయ్యనాయుడు డీపీఆర్‌ను పరిశీలిస్తామని స్పష్టం చేశారు. అప్పటి నుంచి కేంద్రం నుంచి కచ్చితంగా నిధులు వస్తాయన్న భరోసాతో మేయర్ ఉన్నారు. ఆశించినట్టే రూ.461.04 కోట్లు నిధులను కేంద్రం మంజూరు చేసింది. ఇక హ్యాపీడేసే.. : మేయర్ స్ట్రాం వాటర్ డ్రెయిన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.461.04 కోట్లు మంజూరు చేయడం సంతోషంగా ఉందని మేయర్ కోనేరు శ్రీధర్ అన్నారు. బుధవారం తన చాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. తాగునీటి సమస్య పరిష్కానికి రూ.1.16 కోట్లతో పాతబోర్లు రిపేరు చేస్తున్నామని, రాజీవ్‌నగర్‌లో రూ.64 లక్షలతో పైప్‌లైన్ నిర్మాణ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. రూ.8కోట్ల వ్యయంతో 6,400 మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రోడ్లు గ్రాంట్ రూ.10.30 కోట్లు, నాన్‌ప్లాన్ గ్రాంట్ రూ.8.74 కోట్లు, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి రూ.8.61 కోట్లు వచ్చాయన్నారు. రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి సంబంధించి రూ.10 కోట్లతో 160 పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచామన్నారు. వచ్చే నెలలో పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. రాజీవ్ ఆవాస యోజన (రే) పథకానికి సంబంధించి కేంద్రం నుంచి రూ.17 కోట్లు విడుదలయ్యాయని, కార్పొరేషన్ వాటాగా రూ.5 కోట్లు భరించాల్సి ఉందన్నారు. పన్ను వసూలులో రాష్ట్రంలో విజయవాడ కార్పొరేషన్ ప్రథమ స్థానంలో నిలి చినట్లు మేయర్ తెలిపారు. వారం రోజుల్లో మిగిలిన బకాయిలు వసూలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తాను మేయర్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు రూ.68 కోట్లు ఆస్తిపన్ను డిమాండ్ ఉందన్నారు. ప్రస్తుతం రూ.82 కోట్లకు పెరిగినట్లు పేర్కొన్నారు. సమగ్ర సర్వే పూర్తయితే ఈ మొత్తం రూ.130 కోట్లకు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. పన్నులు పెంచకుండానే ఆదాయాన్ని రాబడుతున్నామన్నారు.