మూడోరోజూ ఆర్డీటీ జట్ల విజయకేతనం
మూడోరోజూ ఆర్డీటీ జట్ల విజయకేతనం
Published Mon, Mar 6 2017 11:33 PM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇన్విటేషన్ క్రికెట్ కప్‌లో భాగంగా అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ జట్టు మూడోరోజు విజయ పరంపర కొనసాగించింది. సోమవారం స్థానిక అనంత క్రీడా మైదానంలో జరిగిన పోటీలు ఏకగ్రీవంగా సాగాయి. అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ, జైన్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్లు తలపడగా అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ జట్టు తన జోరు కొనసాగించింది. అండర్–12, 14 విభాగాల్లో స్పోర్ట్స్ అకాడమీ జట్లు విజయం సాధించాయి. విన్సెంట్ క్రీడా మైదానంలో జరిగిన అండర్–14 విభాగంలో జైన్ ఇంటర్నేషనల్ స్కూల్, అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన జైన్ స్కూల్ జట్టు 118 పరుగులు సాధించి, ఆలౌటయ్యింది. జట్టులో అభిరాం 30 పరుగులు సాధించాడు. అనంతపురం బౌలర్లలో ఆఫ్‌స్పిన్నర్ లోహిత్ 3, స్వరూప్ 3, అనూష, ప్రణయ్, మహేష్‌లు చెరో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన స్పోర్ట్స్ అకాడమీ జట్టు మొదట్లో తడపడి 3 వికెట్లు కోల్పోయింది. అబ్బాయిల మ్యాచ్‌లో ఆడుతున్న అమ్మాయిలు తమ సత్తా చాటారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆమ్మాయిలు పల్లవి, అనూషలు 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో జట్టు 7 వికెట్లతో విజయాన్ని నెలకొల్పింది. జట్టులో అనూష 36, పల్లవి 38 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. అండర్–12 విభాగంలో ప్రధాన క్రీడా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 138 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. జట్టులో ముకేష్ చక్కటి బ్యాటింగ్‌తో 54 పరుగులతో అజేయంగా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జైన్ స్కూల్ జట్టు 12 ఓవర్లలో 44 పరుగులకే కుప్పకూలింది. అనంతపురం బౌలర్లలో కరీంబాబా హ్యట్రిక్ సాధించడంతో పాటు 5 వికెట్లు పడగొట్టాడు. సుమంత్ 2, మణిదీప్ 2, సునీల్ 1 వికెట్ సాధించారు. దీంతో అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ జట్టు 94 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. నేడు పోటీలు కొనసాగుతాయని ఆర్డీటీ క్రికెట్ హెడ్ కోచ్ షాబుద్దీన్ తెలిపారు.
Advertisement
Advertisement