అక్రమ నిర్మాణాలకు అడ్డా
అక్రమ నిర్మాణాలకు అడ్డా
Published Sun, Feb 19 2017 11:47 PM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM
జీ+2కు అనుమతులు.. అంతకుమించి నిర్మాణాలు..
సెట్‌బ్యాక్స్ లేకుండానే అపార్ట్‌మెంట్ల నిర్మాణం
కాతేరులో యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన
బిల్డర్‌కు లైసెన్స్ లేకపోయినా ప్లాన్‌కు పంచాయతీ అనుమతి
పట్టించుకోని వివిధ విభాగాల అధికారులు
సాక్షి, రాజమహేంద్రవరం : అక్రమ నిర్మాణాలకు కాతేరు అడ్డాగా నిలుస్తోంది. పాలక మండలి లేకపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవవడంతో పంచాయతీ పరిధిలో అనుమతులు లేకుండానే బహుళ అంతస్తుల భవనాలను యథేచ్ఛగా నిర్మిస్తున్నారు. సిబ్బంది చేతివాటంతో గ్రామంలో అనధికార కట్టడాలు విచ్చలవిడిగా పెరిగిపోవడంతోపాటు పంచాయతీకి లక్షల రూపాయల నష్టం వాటిల్లుతోంది. గత మూడేళ్లుగా కాతేరు పంచాయతీలో వందల సంఖ్యలో భవన నిర్మాణాలు చేపట్టారు. ఇందులో అపార్టుమెంట్లు, వ్యక్తిగత ఇళ్లు కూడా ఉన్నాయి. వీటిలో కొన్నింటికి పంచాయతీ అనుమతి ఉండగా మరికొన్నింటికి అటువంటిదేమీ లేదు. పంచాయతీ స్థాయిలో జీ+2 వరకూ భవనాల నిర్మాణానికి మాత్రమే అనుమతి లభిస్తుంది. కానీ కాతేరు పంచాయతీలో జీ+3 అంతకుమించి సొంత ఇళ్లు, జీ+5 వరకూ అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. వీటిలో కొన్నింటికి డీటీసీపీ అనుమతులుండగా మరికొన్ని అపార్ట్‌మెంట్లకు అటువంటివేవీ లేవు.
అనుమతి కొంత.. కట్టేది కొండంత..
భవన నిర్మాణానికి పంచాయతీ అనుమతి తప్పనిసరి. స్థలం యాజమాన్య హక్కు పత్రాలు, లైసెన్స్ ఉన్న సర్వేయర్ వద్ద భవన నిర్మాణ ప్లాన్, సంబంధిత ఫీజులు చెల్లిస్లూ దరఖాస్తు చేసుకుంటే పాలక మండలి తీర్మానంతో పంచాయతీ కార్యదర్శి అనుమతిచ్చారు. అపార్ట్‌మెంట్ నిర్మాణానికి పైన పేర్కొన్న పత్రాలతోపాటు బిల్డర్ లైసెన్స్ నకలు కూడా దరఖాస్తుతో జత చేయాలి. భవనం నిర్మిస్తున్న యజమాని లేదా బిల్డర్ నుంచి నిబంధనలకు, దరఖాస్తులో పేర్కొన్న కొలతలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టబోమన్న ప్రమాణ పత్రం కూడా తీసుకుంటారు. కానీ కాతేరు పంచాయతీలో ఇలాంటివేవీ పట్టించుకోకుండానే దరఖాస్తు చేసిన వెంటనే అనుమతులు ఇచ్చేశారు.
కొంతమంది జీ+2కు అనుమతులు తీసుకుని జీ+3 భవనాలు నిర్మించారు. కాతేరు పంచాయతీ మల్లయ్యపేటలో ప్రధాన రహదారికి 50 అడుగుల దూరంలో గోదావరి నది వైపు మూడంతస్తుల అపార్ట్‌మెంట్ నిర్మిస్తున్నారు. పంచాయతీ పరిధిలో రెండంతస్తుల వరకూ మాత్రమే నిర్మాణాలు చేపట్టాలి. నాలుగంతస్తుల నిర్మాణాలకు జిల్లా పట్టణ ప్రణాళిక విభాగం, ఐదు అంతకు పైన అంతస్తులకు గుంటూరులోని డీటీసీపీ కార్యాలయం అనుమతులు మంజూరు చేస్తాయి. కానీ మల్లయ్యపేటలో నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల అపార్ట్‌మెంట్‌కు జిల్లా పట్టణ ప్రణాళిక విభాగం నుంచి ఎలాంటి అనుమతులూ లేవు. పంచాయతీ నుంచే రెండతస్తుల(జీ+2)కు అనుమతులు తీసుకుని మూడంతస్తులు (జీ+3) నిర్మిస్తున్నారు. ఇప్పటివరకూ ఏడు ఫ్లాట్లు విక్రయించారు. ముందువైపు మూడడుగులు, చుట్టుపక్కల రెండడుగుల మేర సెట్‌బ్యాక్స్ వదిలారు. పంచాయతీల్లో అపార్ట్‌మెంట్లు ఇలాగే నిర్మిస్తారని, జీ+2కు అనుమతి తీసుకుని జీ+3 కట్టామని, అధికారులు వచ్చినప్పుడు చూద్దామని బిల్డర్ చెబుతున్నారు. దీనినిబట్టి కాతేరు పంచాయతీలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
నిబంధనలు గాలికి..
అపార్ట్‌మెంట్ల నిర్మాణంలో నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదు. నాలుగు వైపులా ఖాళీ స్థలం (సెట్‌బ్యాక్) రెండడుగులకు మించి లేదు. అగ్నిప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల జాడే లేదు. భవనం చుట్టూ గ్రీన్‌జోన్(మొక్కల పెంపకం)కు స్థలం కూడా లేకుండా ప్రహరీని ఆనుకునేవిధంగా అపార్ట్‌మెంట్ నిర్మిస్తున్నారు. బిల్డర్‌గా ఏ ప్రభుత్వ విభాగం నుంచీ లైసెన్స్ లేకపోయినా పంచాయతీ కార్యదర్శి అనుమతి ఇచ్చేశారు. సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విభాగం నుంచి అమ్మకం లైసెన్స్ ఉందా? లేదా? అన్న విషయాలు పరిశీలించకుండానే అనుమతులు ఇచ్చేశారు. కాతేరు గ్రామంలోని మరికొన్ని అపార్ట్‌మెంట్లు కూడా ఇలాగే ఉన్నాయి.
పర్యవేక్షణ లేకపోవడమే అసలు సమస్య
రెండంతస్తులకు అనుమతి తీసుకుని మూడు, నాలుగు అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నా పట్టించుకునే అధికారే కాతేరులో కరువయ్యారు. అనుమతి ఇచ్చిన మేరకు భవన నిర్మాణం జరుగుతుందో లేదోనన్న విషయాన్ని కార్యదర్శి తరచూ పర్యవేక్షించాలి. కానీ గతంలో పని చేసిన కార్యదర్శులు ఇలాంటివేమీ పట్టించుకోలేదు. దీంతో భవన నిర్మాణదారులు అడ్డగోలుగా కట్టేస్తున్నారు. కార్యదర్శి పట్టించుకోకపోయినా మండల, డివిజన్ స్థాయి అధికారులు తరచూ తనిఖీలు చేస్తూండాలి. సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ తదితర విభాగాల అధికారులు తనిఖీలు చేయాలి. కానీ ఇక్కడ అలాంటివేమీ లేకపోవడంతో భవన నిర్మాణదారులు చెలరేగిపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం జరుగుతున్నా పట్టించుకోని అధికారులు.. తీరా భవన నిర్మాణం పూర్తయ్యాక రంగంలోకి దిగుతున్నారు. భవన నిర్మాణదారులవద్ద లక్షల రూపాయలు దండుకుని కిమ్మనకుండా ఉంటున్నారన్న ఆరోపణలున్నాయి.
Advertisement
Advertisement