అక్షరాస్యతలో వీర్నపల్లి నంబర్ 1
అదో మారుమూల గిరిజన గ్రామం.. నిన్నామొన్నటివరకు ఆ ఊరిపేరు మండలానికే పరిమితమైంది. అదే గ్రామం నేడు దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకుంటోంది.
ఎల్లారెడ్డిపేట : అదో మారుమూల గిరిజన గ్రామం.. నిన్నామొన్నటివరకు ఆ ఊరిపేరు మండలానికే పరిమితమైంది. అదే గ్రామం నేడు సంపూర్ణ అక్షరాస్యత సాధించి దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకుంటోంది. అదే కరీంనగర్ జిల్లాలోని వీర్నపల్లి.
ఎల్లారెడ్డిపేటలోని వీర్నపల్లిని ఎంపీ వినోద్‌కుమార్ దత్తత తీసుకున్న విషయం తెల్సిందే. అప్పటినుంచి ఇక్కడి గిరిజనులు పలుగుపారతోపాటు పలకాబలపం పట్టారు. కూలీనాలీ చేసుకునే గిరిజనులు సైతం అక్షరాలు దిద్దడం.. అదికూడా వందశాతం అక్షరాస్యులు కావడం రాష్ట్రంలోనే ఒక స్ఫూర్తిగా నిలిచింది. మారుమూల గ్రామంలో వందశాతం అక్షరాస్యత సాధించారని తెలుసుకున్న ముంబయి ఎస్‌ఎన్‌డీటీ మహిళా యూనివర్సిటీ ప్రొఫెసర్ జైకుట్టి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ల బృందం జిల్లా అధికారులతో కలిసి సోమవారం వీర్నపల్లిలో పర్యటించి అక్షరాస్యతపై పరిశీలించింది. వందశాతం అక్షరాస్యత సాధించిన రంగారెడ్డి జిల్లా మోహినాబాద్, దుండిగల్, నల్లగొండ జిల్లా దామెరచెర్ల, సబ్దుల్లాపురం, పుట్టపాక సరసన వీర్నపల్లిని ఎంపిక చేసింది.
జాతీయ అవార్డుకు సిఫారసు
వందశాతం అక్షరాస్యత సాధించిన వీర్నపల్లిని జాతీయ అవార్డుకు సిఫార సు చేయనున్నట్లు ముంబయి ప్రొఫెసర్ల బృందం సూచనప్రాయంగా తెలిపింది. వందశాతం అక్షరాస్యతకు చేసిన కృషి, వయోజనులు అక్షరాలు నేర్చుకున్న విధానం, పత్రికల్లో వచ్చిన కథనాలు, విద్యకేంద్రాల నిర్వాహణ, ఉపాధి కూలీలకు అడవిలో చెప్పిన చదువుతీరు రికార్డులను కలెక్టర్‌కు సమర్పించాలని బృందం సభ్యులు సూచించారు. ఈమేరకు ఎంసీవో మాడ్గుల రాజంయాదవ్ మంగళవారం కలెక్టర్‌కు సమర్పించారు. అక్షరాస్యత సాధించిన ఆరు గ్రామాల్లో వీర్నపల్లి ముందువరసలో ఉందని ముంబయి ప్రొఫెసర్ల బృందం తెలిపినట్లు ఎంపీడీవో చిరంజీవి, ఎంసీవో మాడ్గుల రాజంయాదవ్ తెలిపారు.