నీటి గుట్టు.. తెలిస్తే ఒట్టు!
నీటి గుట్టు.. తెలిస్తే ఒట్టు!
Published Wed, Aug 17 2016 12:44 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
నిప్పులవాగు నీరు అక్రమ తరలింపు
– నెల్లూరుకు 6వేల క్యూసెక్కులు
– ఐదు రోజులుగా సాగుతున్న వ్యవహారం
– బయటకు పొక్కకుండా జాగ్రత్తపడిన అధికారులు
– ఓ మంత్రి ఒత్తిడే కారణం
– నోరు మెదపని జిల్లా టీడీపీ నేతలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు:
నిప్పుల వాగులో నిజం దాచేసే ప్రయత్నం జరుగుతోంది. కళ్లుగప్పి.. లెక్కల్లోకి రాకుండా నెల్లూరు జిల్లాకు నీరు తరలిపోతోంది. గత ఐదు రోజులుగా 5వేల క్యూసెక్కుల నీరు ఆ ప్రాంతానికి విడుదల చేయడం.. ఈ దోపిడీ ఎక్కడ బయటకు పొక్కుతుందోనని మంగళవారం నుంచి 3వేల క్యూసెక్కులకు తగ్గించడం గమనార్హం. మొత్తం వ్యవహారం వెనుక అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలెవ్వరూ ఈ దోపిడీపై కనీసం పల్లెత్తు మాట అనేందుకు సాహసించని పరిస్థితి నెలకొంది. లెక్కల్లో చూపకుండా.. వరద జలాలను కాకుండా నికర జలాలను నెల్లూరుకు తరలిస్తున్న వ్యవహారంపై అందరూ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. లేదంటే.. జిల్లా రైతుల నోట్లో మట్టికొట్టే ప్రభుత్వ ప్రయత్నం యథేచ్ఛగా సాగే ప్రమాదం పొంచి ఉంది.
పాత కాంట్రాక్టు రద్దు కాకుండానే..
వాస్తవానికి బానకచర్ల క్రస్ట్‌గేట్ల నుంచి నిప్పులవాగు నీటిని తరలించేందుకు గతంలోనే ఏర్పాట్లు ఉన్నాయి. అయితే, అధికార తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ నిప్పులవాగును మరింత విస్తరించే ప్రయత్నం జరిగింది. ఇందులో భాగంగా పనులను చేపట్టాల్సిన పాత కాంట్రాక్టర్‌ను తొలగించి.. కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించారు. పాత కాంట్రాక్టు సంస్థను తొలగించకుండానే పనులను కొత్త వారికి అప్పగించారు. హడావుడిగా పనులను అప్పగించడంలోనూ నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి హస్తం ఉంది. త్వరగా పనులు పూర్తి చేసి నీటిని తరలించుకుపోయేందుకే ఈ మొత్తం తతంగం నడించినట్లు తెలుస్తోంది. చివరకు ఆ సంస్థ చేసిన పనుల మేరకు అయిన వ్యయాన్ని ఇచ్చి.. పక్కకు తప్పుకునేలా ఒప్పించి పాత కాంట్రాక్టును రద్దు చేశారు. అనంతరం కొత్త కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. మరోవైపు నిప్పులవాగు విస్తరణ పనులకు అవసరమైన భూమిని ఇచ్చేందుకు స్థానిక రైతులు కూడా ముందుకు రాలేదు. రెండుకార్ల పంటలు పండే భూములను ఇవ్వమని తెగేసి చెప్పారు. అయినప్పటికీ వారి నుంచి బలవంతంగా భూములను ప్రభుత్వం లాగేసుకుని పనులను పూర్తి చేసింది. అయితే, కేవలం వరద జలాలను మాత్రమే తరలించేందుకు ఈ ప్రాజెక్టును ఉపయోగించుకోవాలనేది నిబంధన.
నికర జలాలకే ఎసరు
నిప్పులవాగు ద్వారా శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను నెల్లూరు జిల్లాకు తరలించాలనేది ఉద్దేశం. ఈ నిప్పులవాగు ద్వారా నెల్లూరు జిల్లాలోని పెన్నా నదికి అనుసంధానం చేస్తారు. వాస్తవానికి నిప్పులవాగు ద్వారా కేవలం వరద జలాలను మాత్రమే తరలించాల్సి ఉంటుంది. అయితే, ఇందుకు భిన్నంగా నికర జలాలలో నుంచి నిప్పులవాగు ద్వారా నీటిని తరలిస్తున్నారు. శ్రీశైలం డ్యాంలో నీటి మట్టం ప్రస్తుతం కేవలం 875 అడుగులు మాత్రమే ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ఇప్పుడున్నది 164 టీఎంసీలు మాత్రమే. అంటే ఇంకా 51 టీఎంసీల నీరు చేరితేగానీ శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులకు చేరదన్నమాట. మరోవైపు ఇన్‌ఫ్లో కూడా తగ్గిపోతోంది. 2 లక్షల క్యూసెక్కుల నుంచి ప్రస్తుతం మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి 24 వేల క్యూసెక్కులకు పడిపోయింది. ఈ పరిస్థితుల్లో శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం చేరుకోవాలంటే మరింత సమయం పడుతుంది. ఈ విధంగా పూర్తిస్థాయి నీటి మట్టం వచ్చిన తర్వాత మాత్రమే వరద జలాలను నిప్పులవాగు ద్వారా తరలించాల్సి ఉంటుంది. ఇందుకు భిన్నంగా నికర జలాలను తరలించే కుట్ర జరుగుతోంది.
లెక్కల్లో చూపని వైనం
వాస్తవానికి నీటి లెక్క పక్కాగా ఉండాలి. వచ్చే ప్రతి బొట్టుకు... పోయే ప్రతి బొట్టుకు నిర్దిష్టమైన లెక్క ఉండాలి. అయితే, నిప్పులవాగుకు నీటి విడుదల విషయంలో మాత్రం ప్రభుత్వం ఒక లెక్క అంటూ పాటించడం లేదు. నిప్పులవాగు నుంచి 6వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్టు ఎక్కడా లెక్కల్లో చూపడం లేదు. దొంగతనంగా నీటిని తరలిస్తున్నందుకే ఈ నీటిని కాస్తా లెక్కల్లో చూపడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి నీటిని అక్రమంగా తోడుకువెళుతూ.. జిల్లా రైతుల నోట్లో మట్టికొడుతున్న వైనంపై అందరూ గళం విప్పాల్సిన అవసరం ఉంది.
Advertisement
Advertisement