ఒమన్ లో మహిళ మృతి
ఒమన్ లో మహిళ మృతి
Published Sat, Dec 3 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM
తాడేపల్లిగూడెం : పొట్టచేత పట్టుకుని ఒమన్ దేశానికి ఉపాధి కోసం వెళ్లిన ఓ మహిళ అక్కడ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. భారత దౌత్య కార్యాలయంలో సంప్రదింపులు జరిపి తాడేపల్లిగూడెంలోని కైండ్‌నెస్ సంస్థ ఆమె మృతదేహాన్ని స్వదేశానికి రప్పించింది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఆచంట మండలం పెనుమంచిలికి చెందిన కోయ జ్యోతి (46) జీవనోపాధికోసం ఒమన్ దేశం వెళ్లారు. ఆమె ఇటీవల మరణించడంతో మృతదేహాన్ని జిల్లాకు రప్పించాల్సిందిగా ఆమె కుమార్తె వర్ధనపు ఈశ్వరి కైండ్‌నెస్ సంస్థ ప్రవాసాంధ్రుల సేవాకేంద్రం అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావును సంప్రదించింది. భారతరాయబార కార్యాలయంతో గట్టిం మాట్లాడి.. ఒమన్ నుంచి హైదరాబాద్‌కు జ్యోతి మృతదేహాన్ని రప్పించారు. అక్కడి నుంచి అంబులెన్సులో భౌతికకాయాన్ని ఆమె స్వగ్రామానికి ఉచితంగా చేర్చారు. శుక్రవారం మృతదేహం స్వగ్రామం చేరింది. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు మాణిక్యాలరావుకు కృతజ్ఞతలు తెలిపారు.
మరికొన్ని వినతులు : అలాగే జిల్లాలోని నర్సాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన కొల్లాబత్తుల ఏసురత్నం రెండేళ్ల క్రితం సౌదీఅరేబియా వెళ్లారు. గతనెల 24న గుండెపోటు రావడంతో అక్కడే చనిపోయారు. ఆయన పార్దీవదేహాన్ని తీసుకురావాలని కోరుతూ శుక్రవారం ఆయన కుమారుడు రాజశేఖర్ మాణిక్యాలరావుకు వినతిపత్రం సమర్పించారు. అలాగే మొగల్తూరు మండలం సిరిపాలెం గ్రామానికి చెందిన భూసి శిరోమణి మూడేళ్ల క్రితం కువైట్ వెళ్లింది. అనుకోని పరిస్థితులలో అక్కడ మరణించింది. ఆమె మృతదేహాన్ని ఇండియాకు రప్పించాలని ఆమె బంధువులు శుక్రవారం వినతిపత్రాలు సమర్పించారు. భారత రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడి సాయం చేస్తానని మాణిక్యాలరావు చెప్పారు.
Advertisement