dead body reached
-
హైదరాబాద్‌కు రవీందర్ మృతదేహం
శాయంపేట(భూపాలపల్లి) : పొట్టకూటి కోసం మలేషియాకు వెళ్లి మృత్యువాత పడిన గట్టు రవీందర్(42) మృతదేహం స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, మలేషియాలోని తెలుగు ఎన్నారైల సంఘం అధ్యక్షుడు చిరుత చిట్టిబాబు ప్రత్యేక చొరవతో శుక్రవారం రాత్రి 11.30కు హైదరాబాద్‌లోని విమానాశ్రయానికి చేరుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. శాయంపేటకు చెందిన గట్టు రవీందర్(42) అక్కడ ఐస్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై ఊపిరాడక ఈ నెల 13 ఉదయం మృతిచెందిన విషయం తెలిసిందే. గీతకార్మికుడైన రవీందర్ కుటుంబ పోషణ నిమిత్తం 2013 సెప్టెంబర్‌లో మలేషియాకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. 5 రోజులుగా రవీందర్ మృతదేహం కోసం కుటుంబసభ్యులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో స్పీకర్ మధుసూదనాచారి సాయంతో చిట్టిబాబు ఐస్ కంపెనీ యజమానులతో మాట్లాడి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. శనివారం తెల్లవారుజామున మృతదేహం శాయంపేటకు చేరుకోనున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. -
చైతన్యకుమార్ మృతదేహం నేడు రాక
చిలకలపూడి(మచిలీపట్నం): అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మియామిలో గత నెల 31వ తేదీ అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన మచిలీపట్నానికి చెందిన యువకుడు బొమ్మల చైతన్యకుమార్ మృతదేహాన్ని కలెక్టర్ బి.లక్ష్మీకాంతం చొరవతో మృతదేహం శుక్రవారం మచిలీపట్నం చేరనుంది. మరణవార్త విన్న వెంటనే కలెక్టర్ రాష్ట్ర సాధారణ పరిపాలనా (ప్రోటోకాల్ ) విభాగానికి త్వరితగతిన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేయాలని లేఖ రాశారు. ఈ లేఖను ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెన్షియల్ కమిషనర్ అర్జా శ్రీకాంత్‌కు మెయిల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పంపారు. దీంతో పాటుగా కలెక్టర్ లేఖకు స్పందించిన తెలుగు అసోసియేషన్, తానా ప్రతినిధులు మృతదేహాన్ని మచిలీపట్నం చేర్చడానికి కావాల్సిన వనరులను సమకూర్చి ప్రయత్నాలను ప్రారంభించారు. అమెరికా నుంచి కృష్ణా జిల్లాకు మృతదేహం రావాలంటే సాధారణంగా 20 రోజుల సమయం పడుతుంది. అయితే కలెక్టర్ రాసిన లేఖకు స్పందించిన తెలుగు స్వచ్ఛంద సంస్థలు కేవలం ఎనిమిది రోజుల్లోనే అన్నీ అంశాలను పూర్తి చేసి గురువారం రాత్రికి హైదరాబాద్‌కు పంపుతున్నట్లు కలెక్టర్, ఏపీ భవన్ కమిషనర్ అర్జా శ్రీకాంత్‌లకు మెయిల్, మెసేజ్ ద్వారా వివరించారు. వీరు ఇరువురు మచిలీపట్నంలోని చైతన్యకుమార్ కుటుంబ సభ్యులకు ఈ సమాచారాన్ని అందించారు. హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి మృతదేహ శుక్రవారం ఉదయానికి చేరనుంది. -
ఒమన్ లో మహిళ మృతి
తాడేపల్లిగూడెం : పొట్టచేత పట్టుకుని ఒమన్ దేశానికి ఉపాధి కోసం వెళ్లిన ఓ మహిళ అక్కడ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. భారత దౌత్య కార్యాలయంలో సంప్రదింపులు జరిపి తాడేపల్లిగూడెంలోని కైండ్‌నెస్ సంస్థ ఆమె మృతదేహాన్ని స్వదేశానికి రప్పించింది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఆచంట మండలం పెనుమంచిలికి చెందిన కోయ జ్యోతి (46) జీవనోపాధికోసం ఒమన్ దేశం వెళ్లారు. ఆమె ఇటీవల మరణించడంతో మృతదేహాన్ని జిల్లాకు రప్పించాల్సిందిగా ఆమె కుమార్తె వర్ధనపు ఈశ్వరి కైండ్‌నెస్ సంస్థ ప్రవాసాంధ్రుల సేవాకేంద్రం అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావును సంప్రదించింది. భారతరాయబార కార్యాలయంతో గట్టిం మాట్లాడి.. ఒమన్ నుంచి హైదరాబాద్‌కు జ్యోతి మృతదేహాన్ని రప్పించారు. అక్కడి నుంచి అంబులెన్సులో భౌతికకాయాన్ని ఆమె స్వగ్రామానికి ఉచితంగా చేర్చారు. శుక్రవారం మృతదేహం స్వగ్రామం చేరింది. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు మాణిక్యాలరావుకు కృతజ్ఞతలు తెలిపారు. మరికొన్ని వినతులు : అలాగే జిల్లాలోని నర్సాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన కొల్లాబత్తుల ఏసురత్నం రెండేళ్ల క్రితం సౌదీఅరేబియా వెళ్లారు. గతనెల 24న గుండెపోటు రావడంతో అక్కడే చనిపోయారు. ఆయన పార్దీవదేహాన్ని తీసుకురావాలని కోరుతూ శుక్రవారం ఆయన కుమారుడు రాజశేఖర్ మాణిక్యాలరావుకు వినతిపత్రం సమర్పించారు. అలాగే మొగల్తూరు మండలం సిరిపాలెం గ్రామానికి చెందిన భూసి శిరోమణి మూడేళ్ల క్రితం కువైట్ వెళ్లింది. అనుకోని పరిస్థితులలో అక్కడ మరణించింది. ఆమె మృతదేహాన్ని ఇండియాకు రప్పించాలని ఆమె బంధువులు శుక్రవారం వినతిపత్రాలు సమర్పించారు. భారత రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడి సాయం చేస్తానని మాణిక్యాలరావు చెప్పారు.