బాలుడు దారుణ హత్య | Young boy Murder | Sakshi
Sakshi News home page

బాలుడు దారుణ హత్య

Published Thu, Oct 20 2016 10:37 PM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM

బాలుడు దారుణ హత్య

బాలుడు దారుణ హత్య

 – ప్రభుత్వ బాలుర గృహంలో ఘటన
– సహచర బాలుడే నిందితుడు
– కొట్టొచ్చినట్లు కనబడుతున్న సిబ్బంది నిర్లక్ష్యం
– పోలీసుల విచారణ, కేసు నమోదు

కడప అర్బన్‌: తెలిసీ, తెలియని వయసులో నేరాలకు పాల్పడి ప్రభుత్వ బాలుర గృహంలో పర్యవేక్షణ పరిధిలోకి వచ్చిన ఓ బాలుడిని, అదే గృహంలో తనతో పాటు వున్న మరో బాలుడు టవల్‌ను గొంతుకు బిగించి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటనపై ఒన్‌టౌన్‌ సీఐ కె. రమేష్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రొద్దుటూరు పట్టణం ఇస్లాంపురం వీధికి చెందిన నూర్‌బాషా, గౌసియాల రెండవ కుమారుడు షేక్‌ ముస్తఫా (16) నాలుగు నెలల క్రితం తన మేనమామ మస్తాన్‌ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. ఆ కేసులో పోలీసులు అతన్ని జిల్లా కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు కడప నగరంలోని ప్రభుత్వ బాలుర గృహానికి తరలించారు. గత నెలలో ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన మహబూబ్‌ బాషా, గౌతమ్‌ అనే ఇరువురు బాలురు మోటార్‌ సైకిళ్ల చోరీ కేసులో పోలీసుల ఆధ్వర్యంలో కోర్టుకు హాజరై ఇదే గృహంలో చేరారు. ఈ ముగ్గురితో పాటు నేరాలకు పాల్పడి పర్యవేక్షణ పరిధిలోకి వచ్చిన మరి కొందరిని అదే గృహంలో ప్రత్యేక పరిశీలనా విభాగంలో ఉంచి గృహం సిబ్బంది 24 గంటలు పరిశీలిస్తారు. ఈ క్రమంలోనే మహబూబ్‌ బాషా, గౌతమ్‌కు మధ్య గొడవ జరిగింది. ఈ గొడవను ముస్తఫా అడ్డుకున్నాడు. ఈ సంఘటన గత రెండు రోజులుగా జరుగుతూ ఉంది. దీంతో మహబూబ్‌ బాషాకు, ముస్తఫాకు మధ్య తీవ్ర స్థాయిలో మనస్పర్థలు ఏర్పడ్డాయి. బుధవారం రాత్రి సమయంలో ముస్తఫా బాత్‌రూముకు వెళ్లాడు. అది గమనించిన మహబూబ్‌బాషా అక్కడికి వెళ్లి ముస్తఫాతో గొడవపడి తన దగ్గరున్న టవల్‌తో అతని గొంతుచుట్టూ బిగించి దారుణంగా హత్య చేశాడు. తర్వాత టవల్‌ బయటకు విసిరేశాడు. తర్వాత ఏమీ తెలియనట్లు గదిలోకి వచ్చి మిగతా వారితోపాటు పడుకున్నాడు. రాత్రి 1.30 గంటల సమయంలో సూపర్‌వైజర్లు విధుల్లో భాగంగా ప్రత్యేక పరిశీలన గృహంలో ఉన్న వారి గురించి వాకబు చేశారు. అక్కడ ముస్తఫా కనిపించకపోవడంతో ఆవరణమంతా పరిశీలించారు. బాత్‌రూముకు వెళ్లాడని తెలుసుకుని అక్కడికి వెళ్లి చూడగా ముస్తఫా అచేతనంగా పడి ఉన్నాడు. వెంటనే రిమ్స్‌కు వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు. అప్పటికే ముస్తఫా మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ప్రభుత్వ బాలుర గృహ అధికారుల నిర్లక్ష్యం
ప్రభుత్వ బాలుర గృహంలో ఉన్న బాలలను కంటికి రెప్పగా కాపాడుకోవాల్సిన బాధ్యత గృహ అధికారులపై ఉంది. 24 గంటలు ప్రత్యేక పరిశీలన గృహంలో విధులు నిర్వర్తించాల్సి ఉంది. బుధవారం రాత్రి సూపర్‌వైజర్లు జయరామరాజు, పురుషోత్తమరాజులు విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో ప్రత్యేక గృహంలోని బాలుడు బాత్‌రూముకు వెళ్లినా, ఇతర అవసరాలకు వెళ్లినా పరిశీలనగా వెళ్లాల్సిన అవసరం ఉంది. అవేమీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే సంఘటన జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బెయిల్‌ వచ్చినా జామీను పెట్టుకోవడంలో ఆలస్యం
ముస్తఫా ప్రత్యేక పర్యవేక్షణ పరిధిలో ప్రభుత్వ బాలుర గృహంలో చేరిన రెండు వారాలకే జిల్లా కోర్టులో మెజిస్ట్రేట్‌  బెయిలు మంజూరు చేశారు. అయితే ముస్తఫా తండ్రి నూర్‌బాషా ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి ఉండడం, బెయిలుకు కనీసం జామీన్లు తెచ్చుకోవాలంటే రూ. 10 వేలు అవసరమని, ఆ డబ్బు కోసం ప్రయత్నిస్తూ కాలం వెళ్లదీశాడు. పేదరికంతో తన బిడ్డను పోగొట్టుకున్నానని నూర్‌బాషా ఆవేదన వ్యక్తం చేశాడు. తమ కుమారుడు ముస్తఫా బాలుర గృహానికి వచ్చినప్పటి నుంచి ప్రతివారం వచ్చి చూసి వెళ్లేవారమని, గత సోమవారం కూడా వచ్చి వెళ్లామని, రెండు రోజుల్లోనే తమ బిడ్డ దూరమయ్యాడని కన్నీటి పర్యంతమయ్యాడు.
 

Advertisement

పోల్

Advertisement