
తొడగొట్టిన తులసిరెడ్డి!
చేయెత్తి జైకొట్టుతెలుగోడా... అని ఓ తెలుగు కవి అంటే మన నేతాశ్రీలు ఏకంగా తొడగొడుతున్నారు. హుందాగా నడుచుకోవాల్సిన నాయకులు కనీస మర్యాద మార్చిపోతున్నారు. సంయమనం కోల్పోయి చవకబారు చేష్టలకు దిగుతున్నారు. బహిరంగంగా చిల్లర వ్యవహారాలకు దిగుతూ ప్రజల దృష్టిలో చులకనవుతున్నారు. వాగ్యుద్దాలు, విమర్శనాస్త్రాలతో ఇప్పటికే చట్టసభల గౌరవాన్ని మంటగలిపిన పాలకులు వీధి విన్యాసాలతో హుందాతనాన్ని విస్మరిస్తున్నారు.
తొడ గొట్టడం, మీసం మెలేయడంలో మన నాయకగణం సినిమా హీరోలను మించిపోతున్నారు. సినిమా స్టార్లు తెరపై ఈ విన్యాసాలు చేస్తుంటే నాయకులు నేరుగా ప్రజల ముందే వీటిని అవలీలగా ప్రదర్శిస్తున్నారు. సినిమా తారల కంటే తామేమి తీసిపోమని రుజువు చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ తులసిరెడ్డి సొంత జిల్లాలోనే తొడగొట్టి, మీసం మెలేసి సవాల్ విసిరి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో పుట్టపర్తి సర్కిల్లో బుధవారం రాత్రి సమైక్య జేఏసీ ఏర్పాటు చేసిన సమావేశానికి తులసిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సమైక్యవాదులు ఆయనను చుట్టుముట్టారు. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ పదవికి చేసిన రాజీనామాను ఆమోదింపచేసుకుని ఉద్యమంలోకి రావాలని నినదించారు. తాను సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నానని చెప్పేందుకు ఆయన ప్రయత్నించారు. ఇంతలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపైకి చెప్పులు విసిరారు.
ఈ గందరగోళ పరిస్థితిలో అక్కడినుంచి వెళ్లిపోయేందుకు తులసిరెడ్డి సెక్యూరిటీ ఆయనను కారులోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. అయితే ఆగ్రహంతో ఊగిపోయిన తులసిరెడ్డి కారుపైకి ఎక్కి తొడగొట్టి మీసం తిప్పుతూ సవాల్ విసురుతున్నట్టుగా చేతులు ఊపారు. దీంతో అక్కడున్న జనం అవాక్కయ్యారు. ఆందోళనకారులు భావోద్రేకంతో చేసిన పనికి బాధ్యత గల ప్రజాప్రతినిధిగా తులసిరెడ్డి స్పందించిన తీరు పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తులసిరెడ్డి హుందాగా వ్యవహరించాల్సిందని అభిప్రాయపడ్డారు. గతంలో చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో జనం ముందు తొడగొట్టారు. అయితే వీరంతా సినిమావాళ్లు కావడం ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు.