
రాజ్‌ఖోవా నిష్ర్కమణ
అరుణాచల్ ప్రదేశ్‌లో పదినెలలక్రితం ఇష్టారాజ్యంగా రెచ్చిపోయిన గవర్నర్ జ్యోతి రాజ్‌ఖోవా ఎట్టకేలకు పదవీభ్రష్టుడయ్యారు. పదవినుంచి పోపొమ్మని కబురంపినా ససేమిరా అంటూ మొండికేసిన రాజ్‌ఖోవాను చివరకు తొలగించక తప్పలేదు. రాష్ట్రంనుంచి వెళ్తూ వెళ్తూ కిందపడ్డా తనదే పైచేయన్నట్టు మాట్లాడి అందరినీ ఆయన దిగ్భ్రాంతిపరిచారు. నిజానికి ఆయన్ను మర్యాదగా సాగనంపుదామని ఎన్‌డీఏ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేసినట్టుంది. అందుకే ‘ఆరోగ్య కారణాలు’ చూపి తప్పుకోమని ఈనెల 3న వర్తమానం ఇచ్చింది. కానీ ఆయనకది నచ్చలేదు.
రాష్ట్రపతి సంతకంతో, రాజముద్రతో తనను నియమించారు గనుక తీసేటపుడు కూడా ఆ ‘మర్యాద’ పాటించాలని పట్టుబట్టారు. రాజ్యాంగంలోని 156వ అధికరణ అలాగే చెబుతున్నదని వాదించారు. గవర్నర్ పీఠంపై ఉన్నప్పుడు ఇదే రాజ్‌ఖోవా రాజ్యాంగం చెప్పినవన్నీ ఉల్లంఘించారు. తాను చెప్పిందే రాజ్యాంగమన్నట్టు చెలరేగి...అందులో చెప్పనివి కూడా ఎడాపెడా అమలు చేయడం మొదలుపెట్టారు. తన వరకూ వచ్చేసరికి ఆయన రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా రాజ్‌ఖోవా ఏంచేశారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి. నిరుడు డిసెంబర్‌లో ఆయన ఒక్క కలం పోటుతో రాజకీయ డ్రామాకు తెరలేపారు. ఆ మరుసటి నెలనుంచి జరగాల్సిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలను నెలముందే జరపమని, అందులో ముందుగా స్పీకర్‌ను తొలగించే తీర్మానాన్ని చర్చించి, ఓటింగ్ నిర్వహించాలని హుకుం జారీచేశారు. ఆ సమావేశానికి డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహించాలని కూడా ఆదేశాలిచ్చారు. అసెంబ్లీ హాల్‌లో సమావేశం కుదరకపోయేసరికి ఒక హోటల్‌లో దాన్ని కానిచ్చారు. ముఖ్యమంత్రి నబం టుకీని తొలగించి మరొకరిని ఆ స్థానంలో కూర్చోబెట్టారు.
గౌహతి హైకోర్టు జోక్యం చేసుకుని దీన్నంతటినీ నిలిపేసినా గవర్నర్‌గానీ, కేంద్రంగానీ లెక్కజేయలేదు. హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. పదవి కోల్పోయిన నబమ్ టుకీ ప్రభుత్వాన్ని రెండు నెలలక్రితం పునరుద్ధరిస్తూ సుప్రీంకోర్టు తీర్పు నివ్వడంతో ఆ డ్రామాకు తెరపడింది. రాజ్‌ఖోవా తెలివితక్కువ నిర్ణయాలతో ఎన్‌డీఏ ప్రభుత్వం అప్రదిష్టపాలైంది. ఆయన సీఎం చేసిన కలిఖో పుల్ పదవి పోయాక ఆత్మహత్య చేసుకున్నారు. అసమ్మతి ఎమ్మెల్యేల విషయంలో సరిగా వ్యవహరించలేదన్న ఆరోపణవల్ల స్పీకర్ తన పదవి కోల్పోయారు. లాభపడింది ఒక్క కాంగ్రెసే. అంతక్రితం రాష్ట్రంలో అసమ్మతిని ఏమాత్రం పట్టించుకోని ఆ పార్టీ అధిష్టానం తెలివి తెచ్చుకుని టుకీ స్థానంలో పెమా ఖండూకు పగ్గాలు అప్ప జెప్పింది.
అసలు అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైరైన రాజ్‌ఖోవాలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏం చూసి గవర్నర్ పదవి ఇవ్వాలనుకున్నదో, అందుకు గీటురాయేమిటో ఎవరికీ తెలియదు. ఆయన అలా చిత్తానుసారం ప్రవర్తిస్తుంటే, అందువల్ల తాను అప్రదిష్టపాలవుతుంటే ఎందుకని ఊరుకున్నదో అంతకన్నా తెలియదు. 2014 ఎన్నికల్లో ‘సహకార ఫెడరలిజం’ను హోరెత్తించి అధికారంలో కొచ్చిన ఎన్‌డీఏ అరుణాచల్‌లో ఇంత జరుగుతుంటే గవర్నర్ సొంత నిర్ణయమే తప్ప తన ప్రమేయం లేదని చేతులు దులుపుకోవడానికి చూసింది. గవర్నర్ నివేదిక ఆధారంగా ఏం చేయాలో అది చేయడమే తన బాధ్యతన్నట్టు మాట్లాడింది. ఇప్పుడు రాజ్‌ఖోవా అందుకు విరుద్ధమైన కథ వినిపిస్తున్నారు. కోర్టులో వాదించి నట్టు ‘నేను నివేదిక పంపిన మాట వాస్తవమే అయినా...అందులో రాష్ట్రపతి పాలన పెట్టమని సిఫార్సు చేయలేద’ని అంటున్నారు. నిజమే కావొచ్చు.
రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందని మాత్రమే ఆయన నివేదిక ఇచ్చారు. నిజానికి ఆ సంక్షోభం రాజ్‌ఖోవా సృష్టేనని మీడియా కోడై కూసింది. కేంద్రానికి అది అర్ధం కాలేదంటే ఎవరూ నమ్మలేరు. అరుణాచల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర కేబినెట్ సమావేశమై సిఫార్సు చేసింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెంటనే సంతకం చేయకుండా కొన్ని వివరణలడిగితే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సందేహాలు తీర్చివచ్చారు. ఒకపక్క రాష్ట్రపతి పాలన పెట్టే ప్రయ త్నాలు నిలువరించాలని దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉన్నా ప్రణబ్‌తో సంతకం చేయించారు. ఇంత జరిగాక రాజ్‌ఖోవా ఏం చెప్పినా ఇప్పుడు విని ఊరుకోవడం తప్ప కేంద్రం తనను తాను సమర్ధించుకోలేని స్థితిలో పడింది.
రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించి ప్రభుత్వాలను కూలదోయడం రాజ్‌ఖోవా తోనే మొదలుకాలేదు. ఇంతక్రితమూ అలాంటివి జరిగాయి. కాంగ్రెస్ కేంద్రంలో అధికారం చలాయిస్తుండగా ఈ మాదిరి పనులు చాలా చేసింది. గవర్నర్లను తన కీలుబొమ్మలుగా వాడుకుని అనేకచోట్ల సంక్షోభాలు సృష్టించింది. అయితే రాజ్ ఖోవా అలాంటి గవర్నర్లను తలదన్నారు. అన్ని రాజ్యాంగ నిబంధనలకూ తిలోద కాలిచ్చారు. ఎడాపెడా ఇష్టానుసారం ఉత్తర్వులు జారీచేసి అందరినీ దిగ్భ్రమ పరిచారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు రాజ్‌ఖోవా చర్యలను నిశితంగా విమర్శించింది. రాష్ట్రంలో ఆయన కేంద్రం నియమించిన ప్రతినిధి మాత్రమేనని, కేబినెట్ సలహా మేరకు మాత్రమే ఆయన అధికారాలను వినియోగించుకోగలరు తప్ప సొంతంగా చేయడానికి లేదని స్పష్టం చేసింది. అయినా ఆ తీర్పులో సర్వోన్నత న్యాయస్థానం తనను తప్పుబట్టలేదని రాజ్‌ఖోవా చెబుతున్నారు.
అరుణాచల్‌లో అంతా తిరగబడింది గనుక ఇప్పుడు ఎవరికి వారు తాము బాధ్యులం కాదని చెప్పుకోవచ్చుగానీ ఆ చర్యల పర్యవసానంగా అల్లుకున్న సాలెగూటిలో చిక్కుకుని సీఎం పదవికి ఆశపడి, కొద్దిరోజులకే పదవి కోల్పోయి పుల్ నిరాశా నిస్పృహలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజ్‌ఖోవా గవర్నర్ పదవిలో ఉన్నవారికీ, దాన్ని ఆశిస్తున్నవారికీ ఒక గుణపాఠం. ఎలా ఉండకూడదో, హద్దులెరిగి ప్రవర్తిం చకపోతే ఏమవుతుందో ఆయన్ను చూసి నేర్చుకోవాలి. అలాగే తాము చెప్పినట్టల్లా చేస్తారన్న ఒక్క కారణమే చూడకుండా... చట్టాలన్నా, రాజ్యాంగమన్నా కాస్తయినా గౌరవం ఉన్నదా లేదా అన్న సంగతిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రా నికి తెలిసిరావాలి.