‘మెదడన్నది మనకున్నది/అది సరిగా పనిచేస్తే/విశ్వరహఃపేటికా/విపాటన జరగక తప్పదు’ అన్న మహాకవి శ్రీశ్రీ కవితా పంక్తులు నిజమయ్యాయి. విశ్వ విఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వందేళ్లనాడు ప్రతిపాదించిన గురుత్వాకర్షణ తరంగాల జాడను తొలిసారి శాస్త్రవేత్తలు గుర్తించగలిగారు. 130 కోట్ల ఏళ్ల క్రితం రెండు కృష్ణ బిలాలు ఢీకొట్టుకొనడం పర్యవసానంగా ఏర్పడిన గురుత్వాకర్షణ తరంగాల ఉనికిని కనుగొన్నట్టు గురువారం శాస్త్రవేత్తలు చేసిన ప్రకటన విజ్ఞానశాస్త్ర రంగ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. ఈ విశ్వం ఆవిర్భావంపై మన అవగాహనకున్న విస్తృతిని మరిన్ని రెట్లు పెంచగల ఆవిష్కరణ ఇది.
రెండు అతి పెద్ద కృష్ణబిలాలు ఒకదానినొకటి కవ్వించుకుంటూ... నువ్వా నేనా అన్నట్టు తలపడుతూ ఒకానొక క్షణంలో పెను వేగంతో ఢీకొట్టుకుని ఒకే బిలంగా మారిన ప్పుడు ఏర్పడ్డ శబ్దం ఈ అనంత విశ్వంలో అలలు అలలుగా ప్రయాణించి గత ఏడాది సెప్టెంబర్ 14న రాత్రి 11.21 నిమిషాలకు భూమ్మీదకు చేరుకున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికాలోని రెండు వేర్వేరుచోట్ల భూగర్భంలో ఏర్పాటు చేసిన ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ(ఎల్‌ఐజీవో) -లిగో డిటెక్టర్లు ఈ గురుత్వాకర్షణ తరంగాలను ఒడిసిపట్టగలిగాయని వారు అంటున్నారు. ఆ తరంగాల స్వరూప స్వభావాలను వేయిమందికి పైగా శాస్త్రవేత్తలు అనేక కోణాల్లో మదింపువేసి అయిదు నెలల అనంతరం వాటిని ఐన్‌స్టీన్ ప్రస్తావించిన గురుత్వాకర్షణ తరంగాలేనని నిర్ధారించారు.
తాను ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతంలో భాగంగా ఐన్‌స్టీన్ ఈ గురుత్వాకర్షణ తరంగాలను 1916లో ఊహించాడు. ఆ మహానుభావుడు తన మేథాశక్తితో కాగితంపైన అయితే పెట్టగలిగాడుగానీ దానిపై ఆయనకే అనంతరకాలంలో ఎన్నో సందేహాలు పుట్టుకొచ్చాయి. తన సిద్ధాంతం విజ్ఞాన శాస్త్రంలో నిలదొక్కు కోగలదా... దాని నిరూపణకుండే సాధ్యాసాధ్యాలేమిటని ఆయన మథనపడ్డాడు. ఒక దశలో తన ఊహ నిజంకాకపోవచ్చునని కూడా చెప్పాడు. కానీ ఆయన మస్తిష్కంలో ఆవిర్భవించిన సిద్ధాంతం నూటికి నూరుపాళ్లూ నిజమని నూరేళ్ల అనంతరం ఇప్పుడు తిరుగులేకుండా నిర్ధారణ అయింది. ఊహకు రెక్కలొచ్చి వందేళ్లయితే... దానిపై ప్రయోగాలకూ, వైఫల్యాలకూ అర్ధ శతాబ్దం చరిత్ర ఉంది. దాదాపు ఇరవై అయిదేళ్లనాడు తొలిసారి ఈ గురుత్వాకర్షణ తరంగాల ఉనికిని పట్టుకునేందుకు అవసరమైన పరికరాలను శాస్త్రవేత్తలు రూపొందించగలిగారు.
ఆ పరికరాలు ఒక పరమాణు కేంద్రక వ్యాసంలో వెయ్యోవంతు ప్రాంతంలో జరిగే విరూపతను కూడా ఇట్టే పసిగట్టగలిగేంత సున్నితమైనవీ, సునిశితమైనవీ. నాలుగు కిలోమీటర్ల నిడివిలో ఉన్న ఏ పరమాణు కేంద్రక వ్యాసంలోనైనా జరిగే అలజడిని కూడా చటుక్కున అందుకోగలగడమే ఆ పరికరాల విశిష్టత. అవి అందజేసే డేటాను విశ్లేషించి చెప్పడానికి రెండు సూపర్ కంప్యూటర్లను అమర్చారు. ఆ ఫలితాలను భిన్నకోణాల్లో విశ్లేషించడానికి అమెరికా, బ్రిటన్, జర్మనీ, జపాన్ తదితర దేశాలకు చెందిన వేయిమంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు నిరంతరం శ్రమించారు. అందులో మన దేశానికి చెందినవారు కూడా ఉన్నారు.
కళ్లెదుటనున్న వాస్తవాలను అధ్యయనం చేసి, మధించినప్పుడు అదొక ఊహగా పురుడు పోసుకుంటే...దానిపై సాగించే ప్రయోగాల పర్యవసానంగా అదొక ఆవిష్కరణగా రూపుదిద్దుకుంటుంది. అది నిర్ధారణగా మారడానికి మరింత అధ్యయనం, విశ్లేషణ అవసరమవుతాయి. ఇన్ని దశలు పూర్తయి 130 కోట్ల ఏళ్లనాటి గురుత్వాకర్షణ తరంగ ధ్వని మన చెవులను సోకడం ఆధునిక శాస్త్ర విజ్ఞానం సాధించిన అపూర్వ విజయం. అందువల్లే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలంతా దీన్ని మరిన్ని ఆవిష్కరణలకు దారితీయగల విశిష్ట సందర్భంగా కొనియాడుతున్నారు.
ఈ విశ్వంలో అసంఖ్యాకంగా ఉండే పాలపుంతల వెనకున్న గుట్టును తెలుసుకునే క్రమంలో శాస్త్రవేత్తలు నక్షత్రాలనుంచి వెలువడే పరారుణ, అతి నీలలోహిత, ఎక్స్‌రే, గామా కిరణాలనూ, రేడియో తరంగాలనూ తెలుసుకోగలిగారు. ఆ క్రమంలో గురుత్వాకర్షణ తరంగాలను కనుగొనడం ఒక మేలి మలుపని చెప్పాలి. గురుత్వాకర్షణ తరంగాల ఆధారంగా భవిష్యత్తులో నిర్మితమయ్యే ఖగోళ శాస్త్రం నక్షత్రాల పుట్టుకను మాత్రమే కాదు...వాటి మరణ రహస్యాన్ని కూడా ఛేదిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ నక్షత్రాలు పరస్పరం ఢీకొట్టుకుని నాశనమయ్యాయా లేక ఏదైనా కృష్ణబిలం వాటిని కబళించిందా అన్న సంగతిని నిర్ధారణగా చెప్పడానికి ఆస్కారం ఏర్పడుతుందంటున్నారు.
గురుత్వాకర్షణ తరంగాలకు నిజానికి 200 ఏళ్ల చరిత్ర ఉంది. బ్రిటన్‌కు చెందిన విఖ్యాత శాస్త్రవేత్త మైఖేల్ ఫారడే ఈ విశాల విశ్వంలో సూర్యుడు తన చుట్టూ ఈ భూమిని ఎలా తిప్పుకోగలుగుతున్నాడని...ఆ రెండింటినీ పట్టి ఉంచుతున్న శక్తి ఏమిటని ఆలోచించాడు. ఏదో ఆకర్షణ శక్తి ప్రసరిస్తుండటంవల్లనే ఇది సాధ్యమవుతున్నదని భావించాడు. ఆయన ఊహ ఆధారంగా ఆ దేశానికే చెందిన గణిత శాస్త్రవేత్త జేమ్స్ మాక్స్‌వెల్ దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాడు. ఆ ఆకర్షణ శక్తి రేడియో తరంగాల రూపంలో ఉండొచ్చునని సంభావించాడు. కనుకనే గురుత్వాకర్షణ తరంగాలను ప్రతిపాదించేటపుడు ఐన్‌స్టీన్ ఈ ఇద్దర్నీ తన హీరోలుగా భావించి కొలిచాడు.
ఈ సందర్భంలో మన దేశం గురించి చెప్పుకోవాలి. ఇప్పుడు గురుత్వాకర్షణ తరంగాలను కనుగొన్న లిగో తరహాలోనే ఇక్కడ కూడా డిటెక్టర్ కేంద్రాన్ని నెలకొల్పాలని అయిదేళ్లక్రితం మన శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకవసరమైన పరికరాలనూ, ఇతర వ్యవస్థలనూ అందజేస్తామని అమెరికా జాతీయ సైన్స్ ఫౌండేషన్ తెలిపింది. రూ. 1,260 కోట్లు వ్యయం కాగల ఆ ప్రతిపాదనపై సర్కారునుంచి జవాబు లేదు. ఇప్పుడు ఆ ప్రాజెక్టును నిర్మించే అవకాశం తనకివ్వమని ఆస్ట్రేలియా కోరుతోంది. ఈ దశలోనైనా మేల్కొంటే వినూత్న ఆవిష్కరణలో మన భాగస్వామ్యాన్ని కూడా సగర్వంగా నమోదు చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. మన యువతలో విజ్ఞాన శాస్త్ర తృష్ణను ఇంతకింతా పెంచడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కొత్తగా ఆవిర్భవించబోయే గురుత్వాకర్షణ తరంగ ఆధారిత ఖగోళ శాస్త్రంలో నిష్ణాతులు రూపుదిద్దుకునే వీలుంటుంది. ఆలోచిస్తారా?!
విశ్వానికి కొత్త కిటికీ
Published Sat, Feb 13 2016 1:09 AM | Last Updated on Sun, Sep 3 2017 5:31 PM
Advertisement
Advertisement