Gravity waves
-
గురుత్వ ప్రయోగాల వెనుక మనోళ్లు!
న్యూఢిల్లీ: గురుత్వ తరంగాలను గుర్తించినందుకుగాను ఖగోళ భౌతిక శాస్త్రంలో ముగ్గురు అమెరికన్లకు నోబెల్ వరించింది. అయితే ఈ ఘనత సాధిం చడంలో భారతీయ శాస్త్రవేత్తల కృషి కూడా ఎంతో ఉంది. గురుత్వ తరంగాలను గుర్తించేం దుకు చేసిన ప్రయోగాలకు నోబెల్ లభించడంతో కల నెరవేరినట్లయిందని బెంగళూరులోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ సైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్ బాలా అయ్యర్ పేర్కొన్నారు. గురుత్వ తరంగాలను గుర్తించేందుకు అధునాతనమైన ప్రయోగాలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ‘ఇండిగో’ ప్రోగ్రాంలో బాలా అయ్యర్ సాంకేతికంగా సాయమందించారు. గురుత్వ తరంగాలను గుర్తించడం ద్వారా కొత్త తరం శాస్త్రవేత్తలు ఖగోళ పరిశోధనలపై దృష్టి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ ప్రయోగాల్లో పాలుపంచుకున్న, ఐఐఎస్ఈఆర్– కోల్‌కతాకు చెందిన రాజేశ్ నాయక్ పేర్కొన్నారు. ఈ ప్రయోగాల్లో పుణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రోనమీ, ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన సంజీవ్ దురంధర్ కూడా పాలుపంచుకున్నారు. -
విశ్వ తరంగాలు.. గురుత్వ తరంగాలు..
నిశ్చలంగా ఉన్న నీటిపైకి ఓ రబ్బరు బంతి విసిరితే ఏమవుతుంది? పడిన చోట బంతి చుట్టూ అలలు ఏర్పడి కొంత దూరం విస్తరిస్తాయి! ఇది మనందరికీ అనుభవమే. ఇప్పుడు నీటి స్థానంలో విశ్వం మొత్తం వ్యాపించి ఉండే అంతరిక్ష కాలాలను (స్పేస్ టైమ్) ఊహించుకోండి. భూమి, నక్షత్రాలు, ఇతర ఖగోళ వస్తువులు రబ్బరు బంతులు అనుకుందాం. వీటి కదలికల వల్ల కూడా స్పేస్‌టైమ్‌లో అలల్లాంటివి ఏర్పడతాయని.. వీటిని గురుత్వ తరంగాలు అంటారని ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ వందేళ్ల కిందటే ప్రతిపాదించారు. ఖగోళ వస్తువు బరువు ఎక్కువయ్యే కొద్దీ ఈ తరంగాల పరిమాణమూ పెరుగుతుంది. ఈ గురుత్వ తరంగాలను ప్రత్యక్షంగా గమనించేందుకు ప్రయోగాలు జరిపి విజయం సాధించినందుకు రైనర్ వీస్, కిప్ థోర్న్, బారీ బారిష్ అనే ముగ్గురు అమెరికన్ శాస్త్రవేత్తలకు ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డు దక్కింది. ఈ గురుత్వ తరంగాలు అంటే ఏంటి.. అసలు ఇవి ఎలా ఏర్పడతాయి.. వాటి పుట్టుపూర్వోత్తరాలపై ప్రత్యేక కథనం – సాక్షి నాలెడ్జ్ సెంటర్ అంత ప్రాముఖ్యం ఎందుకు? గురుత్వ తరంగాలను నేరుగా గుర్తించగలిగితే ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సుదూర నక్షత్రాలు, పాలపుంతలు, కృష్ణ బిలాల తాలూకు వివరాలను ఆయా ఖగోళ వస్తువులు సృష్టించే గురుత్వ తరంగాల సైజును బట్టి నిర్ధారించవచ్చు. లిగో ద్వారా గుర్తించిన గురుత్వ తరంగాలు విశ్వం ఏర్పడ్డ తొలినాళ్లలో ఏర్పడినవి కాబట్టి.. వీటి ఆధారంగా విశ్వం విస్తరిస్తోందా.. ఎంత వేగంతో విస్తరిస్తోంది.. వంటి విషయాలను అర్థం చేసుకోవచ్చు. ఎలా గుర్తించారు? 1974లో తొలిసారి ఈ గురుత్వ తరంగాలను పరోక్షంగా గుర్తించారు. ఒక న్యూట్రాన్ స్టార్ జంట ఓ భారీ ద్రవ్యరాశి చుట్టూ తిరుగుతూ.. క్రమేపీ చిన్నగా మారుతుండటం.. గురుత్వ తరంగాల ద్వారా కోల్పోయే శక్తికి తగ్గట్లు వాటి సైజు తగ్గుతుండటాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. గురుత్వ తరంగాల ఉనికికి ఇది పరోక్ష నిదర్శనమని తెలిపిన ఈ ప్రయోగాలకు 1993లో నోబెల్ అవార్డు దక్కింది. ఆ తర్వాత అమెరికాలో లిగో పేరుతో, ఇటలీలో విర్గో పేరుతో గురుత్వ తరంగాలను గుర్తించేందుకు రెండు ప్రయోగశాలలు ఏర్పాటుచేశారు. సుదూర ప్రయాణంలో గురుత్వ తరంగాల్లో వచ్చే సూక్ష్మమైన మార్పులను గుర్తిస్తుంది. ఒక లేజర్ కిరణాన్ని రెండుగా విడగొట్టి.. రెండు వైపులకు పంపించడం.. ఆ వైపున ఉన్న అద్దాల ద్వారా వీటిని మళ్లీ ఒక చోట(రెండుగా విడగొట్టిన చోటు)కు చేర్చడం ఈ ప్రయోగంలో జరిగే తంతు. రెండు లేజర్ కిరణాలు ఏకమయ్యే చోట ఆ కాంతి తాలూకు తరంగాలను గుర్తిస్తారు. సాధారణ పరిస్థితుల్లో వ్యతిరేక దిశల్లో ప్రయాణించే లేజర్ కిరణాలు ఏకమై ఎలాంటి సంకేతాలను చూపవు. గురుత్వ తరంగాల సమక్షంలో మాత్రం కొంచెం తేడాలు వస్తాయి. ఈ తేడాల ఆధారంగా గురుత్వ తరంగాల ఉనికిని శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా నిర్ధారించారు. వేటితో సంబంధం లేకుండా.. ఈ గురుత్వ తరంగాలు విశ్వంలో ఎక్కడ పుట్టినా ఏ రకమైన పదార్థంతోనూ సంబంధం లేకుండా ప్రవహిస్తుంటాయి. పైగా చాలా సూక్ష్మంగా ఉంటాయి. దీంతో వీటిని గుర్తించడం చాలా కష్టం. వీటిని ప్రత్యక్షంగా గుర్తించలేమని ఐన్‌స్టీన్ లాంటి శాస్త్రవేత్తే వ్యాఖ్యానించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు కృష్ణబిలాల జంటను తీసుకుందాం. స్పేస్‌టైమ్‌లో ఇవి సృష్టించే గురుత్వ తరంగాలు.. భూమ్మీద 10 లక్షల కిలోమీటర్ల దూరాన్ని పరమాణు స్థాయికి తగ్గించేంత చిన్నగా ఉంటాయి. అయితే సుమారు 1,380 కోట్ల ఏళ్ల కింద రెండు భారీ కృష్ణబిలాలు ఢీ కొనడంతో అతిపెద్ద గురుత్వ తరంగాలు ఏర్పడ్డాయి. ఈ తరంగాలు విశ్వంలో అన్నివైపులా ప్రయాణిస్తుండగా 2015లో అమెరికాలో ఏర్పాటు చేసిన లేజర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ (లిగో)లో శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘గురుత్వ’ప్రయోగాలకు నోబెల్ భౌతిక శాస్త్రంలో ముగ్గురు అమెరికన్లను వరించిన అత్యున్నత పురస్కారం స్టాక్‌హోం: గురుత్వ తరంగాల ఉనికిని గుర్తించి నందుకుగాను అమెరికాకు చెందిన ముగ్గురు ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలైన రైనర్ వీస్, కిప్ థోర్న్, బారీ బారిష్‌లను నోబెల్ అవార్డు వరిం చింది. తన సాపేక్ష సిద్ధాంతంలో భాగంగా ఈ గురుత్వ తరంగాల గురించి వందేళ్ల కిందటే ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ ప్రతిపాదిం చారు. ఇవి కృష్ణ బిలాలు ఒకదానికి మరొకటి ఢీకొనడం వంటి పరిణామాలు జరగడం వల్ల ఇవి ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2015లోనే వీటిని తొలిసారిగా గుర్తించినప్పటికీ 2016 ఫిబ్రవరిలో ప్రకటించారు. వీటిని గుర్తించేందుకు యూఎస్‌లోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో లేజర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ (లిగో)ను థోర్న్, వీస్ సంయుక్తంగా అభివృద్ధి చేశారు. ఆ తర్వాత బారిష్ ఈ ప్రాజెక్టుకు తుది రూపునిచ్చారు. దాదాపు 130 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఏర్పడ్డ గురుత్వ తరం గాలను వీరు తొలిసారిగా ప్రత్యక్షంగా గుర్తించ గలిగారు. ‘ఈ తరంగాలు భూమికి చేరేసరికి చాలా బలహీనమైపోతాయి. అయినా వాటిని గుర్తించడం ఖగోళ భౌతిక శాస్త్రంలో ఓ సంచల నం’ అని స్వీడిష్ రాయల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ హెడ్ గోరాన్ హన్సన్ అన్నారు. ఈ అంతు చిక్కని తరంగాలను 2015 నుంచి ఇప్పటి వరకు 4 సార్లు గుర్తించగలిగారు. రెండు సార్లు ‘లిగో’ ను, ఇంకోసారి ఇటలీలో యురోపియన్ గ్రావి టేషనల్ అబ్జర్వేటరీ (విర్గో)ను ఉపయోగిం చారు. కృష్ణ బిలాలు ఎటువంటి కాంతినీ వెదజల్లవు. వీటిని కేవలం గురుత్వ తరంగాల ఆధారంగానే గుర్తించే వీలు కలుగుతుంది. -
మళ్లీ గురుత్వ తరంగాల గుర్తింపు
వాషింగ్టన్: విశ్వంలో జనించి కోట్లాది కాంతి సంవత్సరాలు ప్రయాణించే గురుత్వాకర్షణ తరంగాలను నాలుగోసారి గుర్తించినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. భూమికి దాదాపు 180 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో రెండు కృష్ణ బిలాలు ఢీకొన్న సమయంలో ఈ శక్తిమంతమైన తరంగాలు ఉద్భవించినట్లు తెలిపారు. ఈ తరంగాలను అమెరికాలోని వాషింగ్టన్, లూసియానాల్లోని లేజర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ (లిగో)లు, యూరప్‌లోని ఇటలీలో ఏర్పాటు చేసిన విర్గో అబ్జర్వేటరీ తొలిసారి సంయుక్తంగా గుర్తించినట్లు వెల్లడించారు. ఈ రెండు కృష్ణబిలాలు ఢీకొన్న అనంతరం ఏర్పడ్డ కృష్ణబిలం ద్రవ్యరాశి సూర్యుని ద్రవ్యరాశి కంటే 53 రెట్లు ఎక్కువన్నారు. మూడు సూర్యులకు సమానమైన శక్తి ఈ గురుత్వ తరంగాలుగా రూపాంతరం చెందిందని పేర్కొన్నారు. ప్రయోజనం ఏంటి? గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించడం ద్వారా ఖగోళంలో మనకు అంతుచిక్కని అనేక రహస్యాలను తెలుసుకోవచ్చు. విశ్వం ఆవిర్భావ (బిగ్‌బ్యాంగ్) సమయంలో ఎలాంటి పరిస్థితులున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. కాంతిని విశ్లేషించడం ద్వారా టెలిస్కోపులు విశ్వంలోని సుదూర ప్రాంతాల సమాచారాన్ని అందిస్తాయి. అయితే కాంతి కంటే గురుత్వ తరంగాల ద్వారా అందే సమాచారం చాలా ఎక్కువగా, మరింత కచ్చితత్వంతో ఉంటుంది. గురుత్వ తరంగాల ద్వారా అవి జనించిన గ్రహాలు, నక్షత్రాలు, కృష్ణబిలాల ద్రవ్యరాశిని, అక్కడి పరిస్థితిని తెలుసుకోవచ్చు. తద్వారా విశ్వం గురించి మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు కనుగొన్నారు ఈ తరంగాలను 2015 సెప్టెంబర్‌లో తొలిసారి, అదే ఏడాది డిసెంబర్లో రెండోసారి గుర్తించారు. అనంతరం ఈ ఏడాది జనవరిలో మూడోసారి గురుత్వాకర్షణ తరంగాలను కనుగొన్నారు. తాజాగా ఆగస్ట్ 14న లిగో శాస్త్రవేత్తలు, యూరప్‌కు చెందిన విర్గో పరిశోధకులతో సంయుక్తంగా గురుత్వాకర్షణ తరంగాలను కనుగొన్నారు. భారతీయుల కీలక పాత్ర గురుత్వాకర్షణ తరంగాలను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాల్లో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. లిగో ప్రాజెక్టులో భాగంగా దేశంలోని 13 కేంద్రాల్లో 67 మంది భారత శాస్త్రవేత్తలు పనిచేస్తున్నట్లు లిగో–ఇండియాకు నేతృత్వం వహిస్తున్న సంజీవ్ దురంధర్ తెలిపారు. సీఎంఐ–చెన్నై, ఐసీటీఎస్– బెంగళూరు, ఐఐఎస్ఇఆర్–కోల్‌కతా, ఐఐఎస్ఇఆర్–తిరువ నంతపురం, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్, ఐపీఆర్ గాంధీనగర్, ఐయూసీఏఏ పూణే, ఆర్ఆర్సీఏటీ ఇండోర్, టీఐఎఫ్ఆర్ ముంబై, యూఏఐఆర్ గాంధీనగర్ తదితర చోట్ల ఈ ప్రాజెక్టుకు సంబంధించి పరిశోధనలు జరుగుతున్నట్లు వెల్లడించారు. గురుత్వాకర్షణ తరంగాలు అంటే? కృష్ణ బిలాలు లేదా నక్షత్రాలు పరస్పరం ఢీకొన్నప్పడు ఈ గురుత్వాకర్షణ తరంగాలు జనిస్తాయి. 1915లో ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం ప్రకారం స్థల, కాలాలను ప్రభావితం చేసే శక్తి గురుత్వ తరంగాలకు ఉంటుంది. కాంతి వేగంతో ప్రయాణించే ఈ తరంగాలు తమ మార్గంలో అడ్డువచ్చే వస్తువులను ముందుకు తోస్తాయి. తద్వారా విశ్వం మరింతగా విస్తరిస్తుంది. ఈ గురుత్వాకర్షణ తరంగాల పరిమాణం అణువు కంటే చాలా చిన్నవిగా ఉండటంతో వీటిని చాలాకాలంగా గుర్తించలేకపోయారు. ఐన్‌స్టీన్ కూడా వీటిని గుర్తించడం అప్పటి సాంకేతికతో సాధ్యం కాదని గతంలో అభిప్రాయపడ్డారు. -
విశ్వానికి కొత్త కిటికీ
‘మెదడన్నది మనకున్నది/అది సరిగా పనిచేస్తే/విశ్వరహఃపేటికా/విపాటన జరగక తప్పదు’ అన్న మహాకవి శ్రీశ్రీ కవితా పంక్తులు నిజమయ్యాయి. విశ్వ విఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వందేళ్లనాడు ప్రతిపాదించిన గురుత్వాకర్షణ తరంగాల జాడను తొలిసారి శాస్త్రవేత్తలు గుర్తించగలిగారు. 130 కోట్ల ఏళ్ల క్రితం రెండు కృష్ణ బిలాలు ఢీకొట్టుకొనడం పర్యవసానంగా ఏర్పడిన గురుత్వాకర్షణ తరంగాల ఉనికిని కనుగొన్నట్టు గురువారం శాస్త్రవేత్తలు చేసిన ప్రకటన విజ్ఞానశాస్త్ర రంగ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. ఈ విశ్వం ఆవిర్భావంపై మన అవగాహనకున్న విస్తృతిని మరిన్ని రెట్లు పెంచగల ఆవిష్కరణ ఇది. రెండు అతి పెద్ద కృష్ణబిలాలు ఒకదానినొకటి కవ్వించుకుంటూ... నువ్వా నేనా అన్నట్టు తలపడుతూ ఒకానొక క్షణంలో పెను వేగంతో ఢీకొట్టుకుని ఒకే బిలంగా మారిన ప్పుడు ఏర్పడ్డ శబ్దం ఈ అనంత విశ్వంలో అలలు అలలుగా ప్రయాణించి గత ఏడాది సెప్టెంబర్ 14న రాత్రి 11.21 నిమిషాలకు భూమ్మీదకు చేరుకున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికాలోని రెండు వేర్వేరుచోట్ల భూగర్భంలో ఏర్పాటు చేసిన ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ(ఎల్ఐజీవో) -లిగో డిటెక్టర్లు ఈ గురుత్వాకర్షణ తరంగాలను ఒడిసిపట్టగలిగాయని వారు అంటున్నారు. ఆ తరంగాల స్వరూప స్వభావాలను వేయిమందికి పైగా శాస్త్రవేత్తలు అనేక కోణాల్లో మదింపువేసి అయిదు నెలల అనంతరం వాటిని ఐన్‌స్టీన్ ప్రస్తావించిన గురుత్వాకర్షణ తరంగాలేనని నిర్ధారించారు. తాను ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతంలో భాగంగా ఐన్‌స్టీన్ ఈ గురుత్వాకర్షణ తరంగాలను 1916లో ఊహించాడు. ఆ మహానుభావుడు తన మేథాశక్తితో కాగితంపైన అయితే పెట్టగలిగాడుగానీ దానిపై ఆయనకే అనంతరకాలంలో ఎన్నో సందేహాలు పుట్టుకొచ్చాయి. తన సిద్ధాంతం విజ్ఞాన శాస్త్రంలో నిలదొక్కు కోగలదా... దాని నిరూపణకుండే సాధ్యాసాధ్యాలేమిటని ఆయన మథనపడ్డాడు. ఒక దశలో తన ఊహ నిజంకాకపోవచ్చునని కూడా చెప్పాడు. కానీ ఆయన మస్తిష్కంలో ఆవిర్భవించిన సిద్ధాంతం నూటికి నూరుపాళ్లూ నిజమని నూరేళ్ల అనంతరం ఇప్పుడు తిరుగులేకుండా నిర్ధారణ అయింది. ఊహకు రెక్కలొచ్చి వందేళ్లయితే... దానిపై ప్రయోగాలకూ, వైఫల్యాలకూ అర్ధ శతాబ్దం చరిత్ర ఉంది. దాదాపు ఇరవై అయిదేళ్లనాడు తొలిసారి ఈ గురుత్వాకర్షణ తరంగాల ఉనికిని పట్టుకునేందుకు అవసరమైన పరికరాలను శాస్త్రవేత్తలు రూపొందించగలిగారు. ఆ పరికరాలు ఒక పరమాణు కేంద్రక వ్యాసంలో వెయ్యోవంతు ప్రాంతంలో జరిగే విరూపతను కూడా ఇట్టే పసిగట్టగలిగేంత సున్నితమైనవీ, సునిశితమైనవీ. నాలుగు కిలోమీటర్ల నిడివిలో ఉన్న ఏ పరమాణు కేంద్రక వ్యాసంలోనైనా జరిగే అలజడిని కూడా చటుక్కున అందుకోగలగడమే ఆ పరికరాల విశిష్టత. అవి అందజేసే డేటాను విశ్లేషించి చెప్పడానికి రెండు సూపర్ కంప్యూటర్లను అమర్చారు. ఆ ఫలితాలను భిన్నకోణాల్లో విశ్లేషించడానికి అమెరికా, బ్రిటన్, జర్మనీ, జపాన్ తదితర దేశాలకు చెందిన వేయిమంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు నిరంతరం శ్రమించారు. అందులో మన దేశానికి చెందినవారు కూడా ఉన్నారు. కళ్లెదుటనున్న వాస్తవాలను అధ్యయనం చేసి, మధించినప్పుడు అదొక ఊహగా పురుడు పోసుకుంటే...దానిపై సాగించే ప్రయోగాల పర్యవసానంగా అదొక ఆవిష్కరణగా రూపుదిద్దుకుంటుంది. అది నిర్ధారణగా మారడానికి మరింత అధ్యయనం, విశ్లేషణ అవసరమవుతాయి. ఇన్ని దశలు పూర్తయి 130 కోట్ల ఏళ్లనాటి గురుత్వాకర్షణ తరంగ ధ్వని మన చెవులను సోకడం ఆధునిక శాస్త్ర విజ్ఞానం సాధించిన అపూర్వ విజయం. అందువల్లే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలంతా దీన్ని మరిన్ని ఆవిష్కరణలకు దారితీయగల విశిష్ట సందర్భంగా కొనియాడుతున్నారు. ఈ విశ్వంలో అసంఖ్యాకంగా ఉండే పాలపుంతల వెనకున్న గుట్టును తెలుసుకునే క్రమంలో శాస్త్రవేత్తలు నక్షత్రాలనుంచి వెలువడే పరారుణ, అతి నీలలోహిత, ఎక్స్‌రే, గామా కిరణాలనూ, రేడియో తరంగాలనూ తెలుసుకోగలిగారు. ఆ క్రమంలో గురుత్వాకర్షణ తరంగాలను కనుగొనడం ఒక మేలి మలుపని చెప్పాలి. గురుత్వాకర్షణ తరంగాల ఆధారంగా భవిష్యత్తులో నిర్మితమయ్యే ఖగోళ శాస్త్రం నక్షత్రాల పుట్టుకను మాత్రమే కాదు...వాటి మరణ రహస్యాన్ని కూడా ఛేదిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ నక్షత్రాలు పరస్పరం ఢీకొట్టుకుని నాశనమయ్యాయా లేక ఏదైనా కృష్ణబిలం వాటిని కబళించిందా అన్న సంగతిని నిర్ధారణగా చెప్పడానికి ఆస్కారం ఏర్పడుతుందంటున్నారు. గురుత్వాకర్షణ తరంగాలకు నిజానికి 200 ఏళ్ల చరిత్ర ఉంది. బ్రిటన్‌కు చెందిన విఖ్యాత శాస్త్రవేత్త మైఖేల్ ఫారడే ఈ విశాల విశ్వంలో సూర్యుడు తన చుట్టూ ఈ భూమిని ఎలా తిప్పుకోగలుగుతున్నాడని...ఆ రెండింటినీ పట్టి ఉంచుతున్న శక్తి ఏమిటని ఆలోచించాడు. ఏదో ఆకర్షణ శక్తి ప్రసరిస్తుండటంవల్లనే ఇది సాధ్యమవుతున్నదని భావించాడు. ఆయన ఊహ ఆధారంగా ఆ దేశానికే చెందిన గణిత శాస్త్రవేత్త జేమ్స్ మాక్స్వెల్ దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాడు. ఆ ఆకర్షణ శక్తి రేడియో తరంగాల రూపంలో ఉండొచ్చునని సంభావించాడు. కనుకనే గురుత్వాకర్షణ తరంగాలను ప్రతిపాదించేటపుడు ఐన్‌స్టీన్ ఈ ఇద్దర్నీ తన హీరోలుగా భావించి కొలిచాడు. ఈ సందర్భంలో మన దేశం గురించి చెప్పుకోవాలి. ఇప్పుడు గురుత్వాకర్షణ తరంగాలను కనుగొన్న లిగో తరహాలోనే ఇక్కడ కూడా డిటెక్టర్ కేంద్రాన్ని నెలకొల్పాలని అయిదేళ్లక్రితం మన శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకవసరమైన పరికరాలనూ, ఇతర వ్యవస్థలనూ అందజేస్తామని అమెరికా జాతీయ సైన్స్ ఫౌండేషన్ తెలిపింది. రూ. 1,260 కోట్లు వ్యయం కాగల ఆ ప్రతిపాదనపై సర్కారునుంచి జవాబు లేదు. ఇప్పుడు ఆ ప్రాజెక్టును నిర్మించే అవకాశం తనకివ్వమని ఆస్ట్రేలియా కోరుతోంది. ఈ దశలోనైనా మేల్కొంటే వినూత్న ఆవిష్కరణలో మన భాగస్వామ్యాన్ని కూడా సగర్వంగా నమోదు చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. మన యువతలో విజ్ఞాన శాస్త్ర తృష్ణను ఇంతకింతా పెంచడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కొత్తగా ఆవిర్భవించబోయే గురుత్వాకర్షణ తరంగ ఆధారిత ఖగోళ శాస్త్రంలో నిష్ణాతులు రూపుదిద్దుకునే వీలుంటుంది. ఆలోచిస్తారా?! -
ఐన్‌స్టీన్ ‘తరంగాలు’ దొరికాయి
గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించిన ‘లిగో’ శాస్త్రవేత్తలు * 130 కోట్ల ఏళ్ల కింద ఢీకొన్న కృష్ణబిలాల నుంచి వచ్చిన తరంగాలు వాషింగ్టన్: మానవ చరిత్రలో మరో అద్భుతమైన ఆవిష్కరణ చోటుచేసుకుంది. విశ్వం పుట్టుకనాటి రహస్యాలను తెలుసుకొనగలిగే పరిశోధనకు బీజం పడింది. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన, వందేళ్లుగా మిస్టరీగానే ఉన్న గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు గురువారం ప్రకటించారు. దాదాపు 130 కోట్ల ఏళ్ల కింద ఢీకొన్న రెండు కృష్ణబిలాల నుంచి జన్మించి.. అంతరిక్షంలోకి విస్తరిస్తున్న ఈ తరంగాల ఉనికిని నిర్ధారించుకున్నట్లు యూఎస్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డెరైక్టర్ ఫ్రాన్స్ కార్డోవా వెల్లడించారు. ఇప్పటివరకూ గురుత్వాకర్షణ తరంగాలను లెక్కించగలిగామని.. కానీ ఆధారపూర్వకంగా తొలిసారిగా గుర్తించామని తెలిపారు. దీనిద్వారా విశ్వానికి సంబంధించిన ఎన్నో కొత్త అంశాలను తెలుసుకోవచ్చని చెప్పారు. 1916లో ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన సాపేక్షతా సిద్ధాంతం ఆధారంగా లెక్కించగలిగిన గురుత్వాకర్షణ తరంగాలు.. తాము గుర్తించిన తరంగాలు కచ్చితంగా సరిపోలాయని ‘లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్-వేవ్ అబ్జర్వేటరీ (లిగో)’లో ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డేవిడ్ షూమాకర్ చెప్పారు. బిగ్‌బ్యాంగ్ ద్వారా విశ్వం పుట్టుక జరిగిన నాటి పరిస్థితులను.. కృష్ణబిలాలను దీని ద్వారా పరిశోధించవచ్చని తెలిపారు. కాగా ఈ పరిశోధనలో పాలుపంచుకున్న భారత శాస్త్రవేత్తల కృషిని ప్రధాని మోదీ అభినందించారు. గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించడం గొప్ప ముందడుగని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఏమిటీ పరిశోధన..? నక్షత్రాలకు, కృష్ణ బిలాలకు గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి నక్షత్రాలు, కృష్ణబిలాలు ఢీకొన్నప్పుడుగానీ, పేలినప్పుడుగానీ గురుత్వాకర్షణ తరంగాలు వెలువడతాయని అంచనా. అంతరిక్షంలో స్థల-కాలాలను ప్రభావితం చేసే అతి భారీ ద్రవ్యరాశుల గమనాన్ని వీటి ద్వారా నిర్ధారించవచ్చు. కాంతి వేగంతో ప్రయాణించే ఈ తరంగాలను ఏదీ అడ్డుకోలేదు. నీటిలో రాయి వేసినప్పుడు ఏర్పడే అలల్లా ఇవి విస్తరిస్తాయని అంచనా. ఈ తరంగాలను గుర్తించేందుకు అమెరికాలో ‘లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్-వేవ్ అబ్జర్వేటరీ (లిగో)’ పేరిట పరిశోధనశాలను ఏర్పాటు చేశారు. గురుత్వాకర్షణ తరంగాలు అతి స్వల్ప స్థాయిలో ఉన్నా గుర్తించగలిగే అత్యాధునికమైన రెండు అతి భారీ డిటెక్టర్లను హాన్ఫోర్డ్, లివింగ్స్టన్ ప్రాంతాల్లో భూగర్భంలో నిర్మించారు. వీటి సహాయంతో సుదూర అంతరిక్షంలో 130 కోట్ల ఏళ్ల కింద ఢీకొన్న రెండు కృష్ణబిలాలపై పరిశోధన చేశారు. ఈ కృష్ణబిలాలు ఒక్కోటి సూర్యుడికి దాదాపు 36 రెట్లు పెద్దవి. అవి ఢీకొన్నప్పుడు వెలువడి స్థల-కాలాల్లో అలల్లాగా విస్తరించిన గురుత్వాకర్షణ తరంగాలు గత ఏడాది సెప్టెంబర్ 14న భూమిని చేరాయి. ఆ రోజు సాయంత్రం 4.51 నిమిషాలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 11.21 గంటలకు) ‘లిగో’లోని పరికరాలు గురుత్వాకర్షణ తరంగాలకు తొలి ఆధారాన్ని సంపాదించాయి. తొలుత లివింగ్‌స్టన్‌లో ఉన్న డిటెక్టర్ ఈ తరంగాలను గుర్తించింది. అక్కడికి 3 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న హాన్‌ఫోర్డ్‌లోని డిటెక్టర్ 7.1 మిల్లీ సెకన్ల తర్వాత గుర్తించింది. ఈ రెండు చోట్ల తరంగాల రీడింగ్ ఒకేస్థాయిలో నమోదైంది కూడా. అయితే ఈ సమాచారాన్ని పూర్తిస్థాయిలో విశ్లేషించి, నిర్ధారించుకునేందుకు 5 నెలల సమయం పట్టింది. అయితే ఈ గురుత్వాకర్షణ తరంగాలకు సంబంధించిన పరోక్ష ఆధారాలను 1974లోనే ఓ న్యూట్రాన్ నక్షత్రంపై పరిశోధన చేసినప్పుడు గుర్తించారు.