వాషింగ్టన్: విశ్వంలో జనించి కోట్లాది కాంతి సంవత్సరాలు ప్రయాణించే గురుత్వాకర్షణ తరంగాలను నాలుగోసారి గుర్తించినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. భూమికి దాదాపు 180 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో రెండు కృష్ణ బిలాలు ఢీకొన్న సమయంలో ఈ శక్తిమంతమైన తరంగాలు ఉద్భవించినట్లు తెలిపారు. ఈ తరంగాలను అమెరికాలోని వాషింగ్టన్, లూసియానాల్లోని లేజర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ (లిగో)లు, యూరప్‌లోని ఇటలీలో ఏర్పాటు చేసిన విర్గో అబ్జర్వేటరీ తొలిసారి సంయుక్తంగా గుర్తించినట్లు వెల్లడించారు. ఈ రెండు కృష్ణబిలాలు ఢీకొన్న అనంతరం ఏర్పడ్డ కృష్ణబిలం ద్రవ్యరాశి సూర్యుని ద్రవ్యరాశి కంటే 53 రెట్లు ఎక్కువన్నారు. మూడు సూర్యులకు సమానమైన శక్తి ఈ గురుత్వ తరంగాలుగా రూపాంతరం చెందిందని పేర్కొన్నారు.
ప్రయోజనం ఏంటి?
గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించడం ద్వారా ఖగోళంలో మనకు అంతుచిక్కని అనేక రహస్యాలను తెలుసుకోవచ్చు. విశ్వం ఆవిర్భావ (బిగ్‌బ్యాంగ్) సమయంలో ఎలాంటి పరిస్థితులున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. కాంతిని విశ్లేషించడం ద్వారా టెలిస్కోపులు విశ్వంలోని సుదూర ప్రాంతాల సమాచారాన్ని అందిస్తాయి. అయితే కాంతి కంటే గురుత్వ తరంగాల ద్వారా అందే సమాచారం చాలా ఎక్కువగా, మరింత కచ్చితత్వంతో ఉంటుంది. గురుత్వ తరంగాల ద్వారా అవి జనించిన గ్రహాలు, నక్షత్రాలు, కృష్ణబిలాల ద్రవ్యరాశిని, అక్కడి పరిస్థితిని తెలుసుకోవచ్చు. తద్వారా విశ్వం గురించి మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు.
ఎప్పుడు కనుగొన్నారు
ఈ తరంగాలను 2015 సెప్టెంబర్‌లో తొలిసారి, అదే ఏడాది డిసెంబర్‌లో రెండోసారి గుర్తించారు. అనంతరం ఈ ఏడాది జనవరిలో మూడోసారి గురుత్వాకర్షణ తరంగాలను కనుగొన్నారు. తాజాగా ఆగస్ట్ 14న లిగో శాస్త్రవేత్తలు, యూరప్‌కు చెందిన విర్గో పరిశోధకులతో సంయుక్తంగా గురుత్వాకర్షణ తరంగాలను కనుగొన్నారు.
భారతీయుల కీలక పాత్ర
గురుత్వాకర్షణ తరంగాలను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాల్లో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. లిగో ప్రాజెక్టులో భాగంగా దేశంలోని 13 కేంద్రాల్లో 67 మంది భారత శాస్త్రవేత్తలు పనిచేస్తున్నట్లు లిగో–ఇండియాకు నేతృత్వం వహిస్తున్న సంజీవ్ దురంధర్ తెలిపారు. సీఎంఐ–చెన్నై, ఐసీటీఎస్– బెంగళూరు, ఐఐఎస్‌ఇఆర్–కోల్‌కతా, ఐఐఎస్‌ఇఆర్–తిరువ నంతపురం, ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్, ఐఐటీ హైదరాబాద్, ఐపీఆర్ గాంధీనగర్, ఐయూసీఏఏ పూణే, ఆర్‌ఆర్‌సీఏటీ ఇండోర్, టీఐఎఫ్‌ఆర్ ముంబై, యూఏఐఆర్ గాంధీనగర్ తదితర చోట్ల ఈ ప్రాజెక్టుకు సంబంధించి పరిశోధనలు జరుగుతున్నట్లు వెల్లడించారు.
గురుత్వాకర్షణ తరంగాలు అంటే?
కృష్ణ బిలాలు లేదా నక్షత్రాలు పరస్పరం ఢీకొన్నప్పడు ఈ గురుత్వాకర్షణ తరంగాలు జనిస్తాయి. 1915లో ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం ప్రకారం స్థల, కాలాలను ప్రభావితం చేసే శక్తి గురుత్వ తరంగాలకు ఉంటుంది. కాంతి వేగంతో ప్రయాణించే ఈ తరంగాలు తమ మార్గంలో అడ్డువచ్చే వస్తువులను ముందుకు తోస్తాయి. తద్వారా విశ్వం మరింతగా విస్తరిస్తుంది. ఈ గురుత్వాకర్షణ తరంగాల పరిమాణం అణువు కంటే చాలా చిన్నవిగా ఉండటంతో వీటిని చాలాకాలంగా గుర్తించలేకపోయారు. ఐన్‌స్టీన్ కూడా వీటిని గుర్తించడం అప్పటి సాంకేతికతో సాధ్యం కాదని గతంలో అభిప్రాయపడ్డారు.