ఎర్డోగాన్‌కు ఎదురుదెబ్బ | Erdogan suffers Turkish poll blow as pro-Kurdish party gains | Sakshi
Sakshi News home page

ఎర్డోగాన్‌కు ఎదురుదెబ్బ

Published Fri, Jun 12 2015 12:03 AM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM

Erdogan suffers Turkish poll blow as pro-Kurdish party gains

సర్వాధికారాలూ సొంతం చేసుకుందామనుకున్న టర్కీ అధ్యక్షుడు రెసెప్ ఎర్డోగాన్ కలలు భగ్నమయ్యాయి. పదమూడేళ్లుగా అవిచ్ఛిన్నంగా దేశాన్ని ఏలుతున్న ఎర్డోగాన్ మొట్టమొదటిసారి ఎన్నికల్లో భంగపడ్డారు. ఈ నెల 7న జరిగిన ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని జస్టిస్ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ (ఏకే పార్టీ)కి మిగిలిన పార్టీలతో పోలిస్తే అధికంగా సీట్లు లభించినా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అవసరమైన సంఖ్యాబలం కొరవడింది. విపక్షాలతో కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి సాగుతున్న చర్చలు రాగల 45 రోజుల్లో ఫలించని పక్షంలో దేశం మరోసారి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటుచే యాలంటే ఏకే పార్టీకి 550 స్థానాలున్న పార్లమెంటులో కనీసం 276 సీట్లుండాలి.
 
 కానీ, ఆ పార్టీ 258 స్థానాలను మాత్రమే గెల్చుకోగలిగింది. పోలైన ఓట్లలో ఏకే పార్టీకి 41 శాతంకన్నా తక్కువ ఓట్లు వస్తే... విపక్షాలన్నిటికీ కలిసి 60 శాతం ఓట్లు వచ్చాయి. ఇన్నేళ్లుగా పార్లమెంటులో తిరుగులేని మెజారిటీ చలాయిస్తున్న ఏకే పార్టీ ఇలాంటి ఫలితాలను ఊహించలేదు. దేశ జనాభాలో 20శాతంగా ఉన్న కుర్దిష్ పౌరులకు ప్రాతినిధ్యంవహించే హెచ్‌డీపీ తొలిసారి ఈ ఎన్నికల్లో గణనీయంగా ఓట్లు సాధించి తొలిసారి ఒక పార్టీగా పార్లమెంటులో చోటు దక్కించుకుంది. ఎర్డోగాన్ పార్టీని దెబ్బతీసింది ప్రధానంగా టెలిఫోన్ సంభాషణల టేపులంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన హయాంలో టర్కీలో వేళ్లూనుకున్న అవినీతిని ఆ టేపులు పట్టిచూపాయి. ఎవరో కాదు...ఎర్డోగాన్ కుమారుడే తమకు రావ లసిన వాటాల గురించి మాట్లాడుతూ దొరికిపోయాడు.
 
 టర్కీలో అవినీతి కొత్తేం కాదు. ప్రతి స్థాయిలోనూ విచ్చలవిడిగా డబ్బు ప్రభావం పెరిగిపోయిందని, రాజకీయాల్లో అదే అన్నిటినీ నిర్దేశిస్తున్నదని విపక్షాలు చాలా కాలంనుంచి ఆరోపిస్తున్నాయి. నయా ఉదారవాద విధానాలను అమలుచేసి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలను ఎర్డోగాన్ విశేషంగా ఆకట్టుకున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో పాశ్చాత్య దేశాలనుంచి వచ్చిపడిన కోట్లాది డాలర్లు... పశ్చిమాసియా, ఆసియా దేశాలతో విస్తరించిన వాణిజ్యం వగైరాలన్నీ దేశ ఆర్థిక వ్యవస్థను బలంగా తయారుచేశాయి. కళ్లు చెదిరే మాల్స్, విశాలమైన రోడ్లు, అత్యాధునిక సౌకర్యాలతో విమానాశ్రయాలు, జనంలో పెరిగిన కొనుగోలు శక్తి వంటివన్నీ ఎర్డోగాన్‌కు రాజకీయంగా ఎంతగానో తోడ్పడ్డాయి. వృద్ధి రేటు సైతం అంతకంతకు పెరుగుతూ వచ్చింది. 2010లో అది 9 శాతానికి చేరుకుంది.  కానీ నయా ఉదారవాద విధానాలను అవలంబించే ప్రతీచోటా ఏమవుతున్నదో టర్కీలోనూ అదే జరిగింది. ఆర్థిక అసమానతలు అపారంగా పెరిగాయి. పేదల రోదనలు పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. అవినీతి తారస్థాయికి చేరింది.
 
 మొదట్లో ఉద్యోగావకాశాలు అపారంగా ఉన్నట్టే కనిపించినా అవి క్రమేపీ అడుగంటాయి. వృద్ధిరేటు సైతం నిరుడు 3 శాతానికి పడిపోయింది. నిరుద్యోగం 10 శాతానికి చేరింది. ఇవన్నీ ఎర్డోగాన్ ప్రభుత్వంపై అసంతృప్తిని పెంచుతూ వచ్చాయి. రెండేళ్లక్రితం రాజధాని ఇస్తాంబుల్‌లో ఒక పార్కును కూల్చి భారీ షాపింగ్ మాల్ నిర్మించాలని ప్రయత్నించినప్పుడు ఇది భళ్లున బద్దలయింది. వేలాదిమంది జనం దాన్ని అడ్డుకోవడానికి రోడ్లపైకి వచ్చినప్పుడు పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు.
 
  తన పాలనపై పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చడానికి ఎర్డోగాన్ రెండు రకాల పద్ధతులను ఎంచుకున్నారు. మతం పేరిట భావోద్వేగాలను రెచ్చగొట్టడం ఒకపక్క...తన విధానాలను ప్రశ్నించే వర్గాలపై అణిచివేతను ప్రయోగించడం మరోపక్క సాగించారు. మీడియాపై ఆంక్షలు విధించడంతోపాటు అనేకమంది జర్నలిస్టులను, కార్టూనిస్టులను కటకటాల వెనక్కి నెట్టారు. వ్యతిరేక వార్తలు రాకుండా భయోత్పాతాన్ని సృష్టించారు. ఈ అణచివేతకు భయపడి పలు మీడియా సంస్థలు ఎర్డోగాన్‌కు దాసోహమన్నాయి. పార్లమెంటులో మెజారిటీ ఉందన్న నెపంతో విపక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునేందుకే ఆయన నిరాకరించారు. తన ఇష్టానుసారం పాలించారు. ఇవన్నీ చివరకు ఎర్డోగాన్‌కు శాపంగా మారాయి.
 
 నిజానికి మొన్నటి ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరగలేదు. విపక్ష పార్టీల అభ్యర్థులనూ, కార్యకర్తలనూ బెదరగొట్టడం...వారిపై పోలీసులతో దాడులు చేయించడంవంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల కోసం కొన్ని పోలింగ్ కేంద్రాలకు తరలించిన బ్యాలెట్ బాక్స్‌ల్లో...అప్పటికే ఏకే పార్టీకి అనుకూలంగా ముద్రేసి ఉన్న బ్యాలెట్ పత్రాలుండటం పరిశీలకుల కంటబడింది. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించడానికి వెళ్లిన అంతర్జాతీయ పరిశీలక బృందాలను సైనికులు తుపాకులు గురిపెట్టి భయభ్రాంతులకు గురిచేశారు. హింసాత్మక ఘటనలకు అంతేలేదు. ఇన్ని చేసినా ఎర్డోగాన్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అవసరమైన మెజారిటీకి చేరువ కాలేకపోయింది. ఇప్పుడు విపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు చేసే ప్రయత్నాలు విఫలమై మళ్లీ ఎన్నికలు గనుక వస్తే తన మెజారిటీ మరింత పడిపోవడం ఖాయమని ఎర్డోగాన్ భయపడుతున్నారు.
 
 ఈ ఎన్నికల తర్వాత రాజ్యాంగాన్ని తిరగరాసి కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని కైవసం చేసుకోవాలని, తన అధికారాలను మరింత పెంచుకోవాలని, ఏక పార్టీ స్వామ్యాన్ని నెలకొల్పాలని ఎర్డోగాన్ కలలుగన్నారు. సరిహద్దుల ఆవలినుంచి చొచ్చుకువస్తున్న ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులను నిలువరించడానికి దేశంలో సుస్థిరమైన, బలమైన ప్రభుత్వం అవసరం ఉన్నదని ప్రజలకు పిలుపునిచ్చారు.
 
 వారిలో దేశభక్తిని రెచ్చగొట్టడానికి చూశారు. సెక్యులర్ విధానాలవల్ల కలిగే ముప్పును గురించి హెచ్చరించారు. కానీ ప్రజలు మాత్రం తాము నిరంకుశ పాలనకు వ్యతిరేకమని తేల్చిచెప్పారు. ప్రజాస్వామిక విధానాలనుంచి వైదొలగితే అంగీకరించబోమని స్పష్టంచేశారు. ఇది ఎర్డోగాన్‌కు మాత్రమే కాదు...ప్రపంచంలోని ఆ బాపతు పాలకులందరికీ హెచ్చరికే. మౌలిక సమస్యల పరిష్కారాన్ని గాలికొదిలి, జనం భావోద్వేగాలతో ఆటలాడాలనుకునే వారందరికీ గుణపాఠమే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement