![Editorial on Kurdish Referendum](/styles/webp/s3/article_images/2017/09/28/Iraq_Kurdish_referendum.jpg.webp?itok=fFJSCfFr)
ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదుల సుదీర్ఘ చెరలో నిలువెల్లా క్షతగాత్రగా మిగిలిన ఇరాక్‌లోని కుర్దుల ప్రాంతం స్వతంత్ర రాజ్యంగా ఎదగాలన్న చిరకాల వాంఛను ఫలింపజేసుకునేందుకు తొలి అడుగు వేసింది. ఇరాక్ ప్రభుత్వమే కాదన్నా... ఇరుగు పొరుగునున్న టర్కీ, ఇరాన్‌లు ఆగ్రహావేశాలతో చెలరేగినా... ఐక్యరాజ్యసమితి వద్దని బతిమాలినా మూడు రోజుల క్రితం రిఫరెండం నిర్వహించుకుంది. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతూనే ఉన్నా ఆ రిఫరెండంలో పాల్గొన్న 93 శాతంమంది పౌరుల్లో అత్యధికులు స్వతంత్ర కుర్దిస్తాన్ ఆవిర్భావానికి అనుకూలంగా ఓటేశారని సమాచారం వస్తోంది. తుది ఫలితం గురువారం అధికారికంగా వెలువడాల్సి ఉంది.
ఇరాక్ ప్రధాని హైదర్ అల్–అబాదీ ఈ రిఫరెండాన్ని ‘వ్యూహాత్మక, చరిత్రాత్మక తప్పిదం’గా అభిర్ణిస్తే... టర్కీ అధ్యక్షుడు ‘నమ్మకద్రోహ’మని మండిపడ్డారు. ఇరాన్ మత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు దీన్ని ‘మరో ఇజ్రాయెల్’ స్థాపించడానికి వేసిన ఎత్తుగడగా వ్యాఖ్యానించారు. చిత్రమేమంటే ప్రపంచంలో ఇజ్రాయెల్ ఒక్కటే కుర్దుల రిఫరెండాన్ని సమర్ధించింది. ఈ సమర్ధనే రిఫరెండం పర్యవసానాలెలా ఉండబోతున్నాయో సూచిస్తోంది. కుర్దిష్ ప్రాంతీయ ప్రభుత్వ అధ్యక్షుడు మసౌద్ బర్జానీ ఇప్పటికిప్పుడు సరిహద్దు రేఖలు గీసే ఆలోచనేదీ లేదని హామీ ఇచ్చినా, ‘మంచి ఇరుగుపొరుగు’గా ఉండాలంటే ఏం చేయాలన్న అంశంపై సంభాషణలకు ఇది ప్రాతిపదికని చెబుతున్నారు.
పశ్చిమాసియాలో తమకంటూ సొంతంగా ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకోవా లని శతాబ్దాలుగా తహతహలాడుతున్నా కుర్దులకు అది నెరవేరని స్వప్నంగానే మిగి లింది. కుర్దు జాతి ప్రజలకంటూ ఇప్పుడు సొంత భూభాగం లేదు. వారుండే ప్రాంతం ఇరాక్, ఇరాన్, టర్కీ, సిరియా భూభాగాల్లో కలిసి ఉంది. ఆ జాతి ప్రజలు ఇంకా ఆర్మేనియా, అజర్‌బైజాన్‌లలో కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. ఇరాక్‌లో కుర్దిష్ భాషకు అధికార భాష హోదా ఉన్నా వేరే దేశాల్లో ఆ పరిస్థితి లేదు. వేర్వేరు దేశాల్లో ఆ భాషకు వేర్వేరు లిపులు కూడా తప్పలేదు. తామంతా ఒకే భూభాగంలో ఉమ్మడి లిపితో, సంస్కృతితో, స్వతంత్రంగా బతకాలని కుర్దులు వాంఛిస్తున్నా అది ఇప్పట్లో నెరవేరే సూచనలు కూడా కనబడటం లేదు. ఉత్తర ఇరాక్‌లోని కుర్దుల ప్రాంతానికి మాత్రం స్వయంపాలిత ప్రభుత్వం ఉంది. అంత కుమించి ఆశించరాదని ఇరాక్ ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
హద్దు మీరితే చర్య లుంటాయంటున్నది. అందుకు కారణం ఉంది. కుర్దిస్తాన్ ప్రాంతీయ ప్రభుత్వం (కేఆర్‌జీ) ఏలుబడిలోని ప్రాంతంలో దండిగా చమురు బావులున్నాయి. అక్కడ రోజుకు 6,50,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి అవుతుంది. ఇది ఇరాక్ చమురు ఉత్పత్తిలో 15 శాతం. ప్రపంచ చమురులో 0.7 శాతం. తన మాట వినకుండా రిఫరెండం నిర్వహించినందుకు కేఆర్‌జీ నుంచి చమురు కొనుగోలు చేయరాదని ఇరాక్ నిర్ణయించడమే కాదు... ఇకపై చమురు కోసం తమ ఫెడరల్ ప్రభుత్వాన్ని మాత్రమే సంప్రదించాలని ఇరుగుపొరుగు దేశాలకు సూచించింది. అమెరికా ఒత్తిళ్ల పర్యవసానంగా సరే అన్నా చమురు మార్కెటింగ్‌ను కేఆర్‌జీకి అప్పగించడం ఇరాక్ ప్రభుత్వానికి ఆదినుంచీ ఇష్టం లేదు. చివరకు ఒప్పుకున్నా పలు సందర్భాల్లో అందుకు ఆటంకాలు కల్పించింది. చమురు డబ్బుతో కేఆర్‌జీ ముందూ మునుపూ పుంజుకుంటుందని భయం. ఈ రిఫరెండంతో టర్కీ కూడా ఆగ్రహించింది. చమురు మార్కెటింగ్‌కు సహకరిస్తున్నందుకు ఇదా ప్రతిఫలమని కేఆర్‌జీపై అది విరుచుకుపడుతోంది.
కుర్దులు నాలుగు దేశాల్లోనూ దశాబ్దాలుగా తీవ్ర అణచివేతనూ, వేధింపులనూ ఎదుర్కొంటున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అటొమన్ సామ్రాజ్యాన్ని రద్దు చేసినప్పుడు స్వతంత్ర కుర్దిస్తాన్ ఏర్పాటుకు హామీ ఇచ్చినా టర్కీ తీవ్రంగా ప్రతిఘటించడంతో అది ఆగిపోయింది. ఆ తర్వాత వచ్చిన అనేక తిరుగుబాట్లను ఆ దేశం అణచివేసింది. ఇరాన్‌లో సైతం కుర్దులు స్వయంపాలన కోసం పోరా డుతూనే ఉన్నారు. ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ ఏలుబడిలో వారిపై యుద్ధ విమా నాలు బాంబుల వర్షం కురిపించాయి.
హలబ్జా నగరంలో 1988లో విషవాయువు ప్రయోగించడంతో 5,000మంది పౌరులు మృత్యువాత పడ్డారు. 1991లో గల్ఫ్ యుద్ధం సమయంలో ఉత్తర ఇరాక్‌లోని కుర్దిష్ ప్రాంతం అమెరికా, మిత్రదేశాల కూటమి రక్షణలోకి వచ్చింది. ఇరాక్‌లో, సిరియాలో తన చెప్పుచేతల్లో ఉన్న కుర్దు గ్రూపులకు అమెరికా అండదండలందిస్తున్నా స్వతంత్ర కుర్దిస్తాన్ ఏర్పాటు దానికి ససేమిరా ఇష్టం లేదు. ఐఎస్ పీడ విరగడైందో లేదో తేలకుండానే పశ్చిమాసియాలో మరో కుంపటి రాజుకోవడం అమెరికాకు ససేమిరా ఇష్టం లేదు. కుర్దులకు మద్ద తిస్తే అది నాలుగు దేశాలతో కొత్త సమస్యలను సృష్టిస్తుంది. ఇరాక్ పాలకులు ఎదురుతిరగొచ్చు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ దూరం జరగొచ్చు. ఇదంతా ఆ ప్రాంతంలో ఇప్పుడున్న తన పలుకుబడిని దెబ్బతీస్తుందని అది భయపడుతోంది. బ్రిటన్, యూరప్ యూనియన్(ఈయూ), అరబ్‌లీగ్ దేశాల భయం కూడా అదే.
ఇరాక్‌లో, సిరియాలో, ఇరాన్‌లో పాశ్చాత్య దేశాలకు పావులుగా పని చేస్తున్నారన్న అపప్రద కుర్దులకున్నా ఒక జాతిగా వారి ఆకాంక్షలు న్యాయమైనవి. వాటిపై నీళ్లు జల్లాలని చూడటం అధర్మం. అమెరికాను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన ఐఎస్ ఉగ్రవాదులతో రణరంగంలో ప్రత్యక్షంగా తలపడింది కుర్దులే. వారి సహకారం లేకపోతే ఐఎస్‌ను తరిమికొట్టడం అసా ధ్యమయ్యేది. దానికి ప్రతిఫలంగా తాము కోరుకున్న ప్రత్యేక రాజ్యానికి తోడ్పడాలన్నది కుర్దుల వాదన. ప్రశాంతత ఏర్పడ్డాక చూద్దామని అమెరికా సర్దిచెబుతున్నా అదెప్పటికి సాధ్యమన్నది కీలక ప్రశ్న. జాతుల స్వయంప్రతి
పత్తిని గౌరవించాలన్న మౌలిక విధానానికి కట్టుబడి ఐక్యరాజ్యసమితి చొరవ తీసుకోవాలని, దాని ఆధ్వర్యంలోనే తమ దీర్ఘకాల సమస్యకు పరిష్కారం లభించాలని కుర్దులు కోరుకుంటున్నారు. వాయిదాలతో పొద్దుపుచ్చడం ఇకపై సాధ్యం కాదని ఆ ప్రాంత దేశాలూ, అమెరికా తదితర అగ్రరాజ్యాలు గుర్తించక తప్పదు.