Kurdish
-
ఆ ఫొటో వాడిదే.. అవును నా మేనల్లుడిదే!!
‘‘అక్కా... నేను, నా కుటుంబం సముద్రాన్ని దాటేశాం. ఇక నిన్ను చూడటమే తరువాయి’ అనే నా తమ్ముడి మాటల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను. కానీ ఎన్ని రోజులైనా నిరీక్షణకు తెరపడటం లేదు. సరిగ్గా అదే సమయంలో ఇంటర్నెట్లో వైరల్‌గా మారిన ఆ ఒక్క ఫొటో... నేనింక ఎవరికోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పేసింది. నా ఆశలన్నీ అడియాసలు చేస్తూ నన్ను వెక్కిరించింది. నీలం రంగు ప్యాంటు... ఎర్ర షర్టు... నేను వాడికి బహుమానంగా ఇచ్చిందే కదా ఆ డ్రెస్సు... అంటే ఆ ఫొటో వాడిదే... ముద్దులొలికే నా మేనల్లుడు అలన్ కుర్దీదే...’ అంటూ సిరియా ఆడపడుచు టిమ్ కుర్దీ ‘ద బాయ్ ఆన్ ద బీచ్’ అనే పుస్తకం పేరిట సిరియాలో జరుగుతున్న నరమేధం గురించి మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేశారు. సరిగ్గా మూడేళ్ల క్రితం.. యూరప్‌నకు వలస వెళ్లే క్రమంలో జరిగిన పడవ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకొని... టర్కీ బీచ్‌లోకి కొట్టుకు వచ్చిన మూడేళ్ల చిన్నారి అలన్ కుర్దీ ఫొటో చూసి ప్రపంచమంతా కన్నీరు పెట్టింది. నిరంతరం బాంబుల వర్షంతో అల్లకల్లోలంగా మారిన సిరియాలో బతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో చెప్పడానికి నిదర్శనంగా నిలిచింది. అటువంటి ఫొటోలు, మనసును కదిలించే ఎన్నెన్నో దృశ్యాలు ఆధిపత్య పోరును ఏమాత్రం ఆపలేకపోయాయి. పైపెచ్చు ఇటువంటివి అక్కడ సాధా‘రణమే’లే అని సరిపెట్టుకునే మానసిక స్థితికి మనల్ని తీసుకొచ్చాయి. ఈ భావన పెరిగిపోకూడదనే... ‘ద బాయ్ ఆన్ ద బీచ్’ పేరిట పుస్తకాన్ని తీసుకొచ్చారు అలన్ కుర్దీ మేనత్త టిమ్ కుర్దీ. జీరో టాలరెన్స్ పేరిట అమెరికా అనుసరిస్తున్న విధానాలు శరణార్థుల పాలిట శాపంగా మారిన నేటి తరుణంలో.. తలదాచుకునేందుకు కాస్త చోటైనా దొరికితే చాలంటూ వలస వెళ్లే క్రమంలో... శరణార్థులు ఎదుర్కొనే ఇబ్బందులు, వాళ్లు పడుతున్న అగచాట్ల గురించి... టిమ్ రాసిన అక్షరాలు ప్రతీ ఒక్కరి మనస్సును ద్రవింపజేస్తాయి. తప్పే కానీ తప్పలేదు... శరణార్థులకు కూడా జీవించే హక్కు ఉంటుందనే విషయాన్ని ప్రపంచం మర్చిపోకూడదనే తాను ఈ పుస్తకాన్ని రాశానన్న టిమ్... ‘పెళ్లి చేసుకుని కెనడా వచ్చాను. కానీ నా మనసు మాత్రం సిరియాలోనే ఉండిపోయింది. నా వాళ్లంతా అక్కడ బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ఉంటే అన్నం కూడా సహించేది కాదు. ఈ కారణంగానే నా కెరీర్‌ను కూడా నిర్లక్ష్యం చేశాను. వాళ్ల ప్రాణాలు ఎలా కాపాడుకోవాలా అని నిరంతరం ఆలోచించేదాన్ని. ఆ క్రమంలోనే నా తోబుట్టువులను శరణార్థులుగా కెనడాకు తీసుకు రావాలని భావించాను. అది సాధ్యపడుతుందని అనిపించలేదు. అందుకే సముద్ర ప్రయాణం ద్వారా వాళ్లంతా యూరప్ చేరుకునేందుకు 5 వేల డాలర్లు స్మగ్లర్లకు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాను. ఆ సమయంలో అదే సరైన మార్గంగా తోచింది. కానీ దయలేని దేవుడు.. అలన్, రేహానా, గలీబ్లను తన దగ్గరికి తీసుకువెళ్లాడంటూ’ తన కుటుంబంలో చోటుచేసుకున్న విషాదం గురించి చెప్పుకొచ్చారు. తాను, తన సోదరుడు అబ్దుల్లా(అలన్ కుర్దీ తండ్రి) బతికి ఉన్నా శవాలతో సమానమంటూ కన్నీంటి పర్యంతమయ్యారు. రెండు భాషల్లో... తన ఉద్దేశాన్ని ప్రస్ఫుటంగా తెలియజేయాలనే సంకల్పంతోనే ‘ద బాయ్ ఆన్ ద బీచ్’ పుస్తకంలోని ప్రతీ చాప్టర్‌ను అరబిక్‌తో పాటు ఇంగ్లీషు భాషలో కూడా అచ్చువేయించారు టిమ్ కుర్దీ. అరబిక్ భాషలోని సామెతలు, జాతీయాలు ఉపయోగిస్తూ మనసుకు హత్తుకునే విధంగా అక్షరాలను తీర్చిదిద్దారు. అలన్ ఙ్ఞాపకంగా రూపుదిద్దుకున్న ఈ పుస్తకమైనా.. కరుడుగట్టిన నేతల పాషాణ హృదయాల్ని కాస్తైనా కరిగించాలని నిండు మనసుతో ఆకాంక్షిద్దాం. -సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్ -
ఐఎస్‌పై కుర్దిష్ మహిళల వీరోచిత పోరాటం..
డమస్కస్ : సిరియాలో నాలుగేళ్లపాటు తిష్టవేసి అనాగరికంగా, ఆటవికంగా పాలన సాగించిన ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులను ఓడించినట్లు సైనిక వర్గాలు ఇటీవల ప్రకటించగానే టెర్రరిస్టులకు వ్యతిరేకంగా విరోచితంగా పోరాడిన కుర్దిష్ మహిళా యోధులు వీధి వీధి తిరుగుతూ ఆనందోత్సవాలను చాటుకున్నారు. టెర్రరిస్టుల ఆధీనంలో ఉన్న రక్కాను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో వీరు కీలక పాత్ర పోషించారు. టెర్రరిస్టులు మహిళలను బానిసలుకన్నా అధ్వాన్నంగా చూడడమేకాకుండా వారిని, ముఖ్యంగా యాజిదీ మైనారిటీ మహిళలను సెక్స్ బానిసలుగా చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని కుర్దీష్ మహిళలు ఈ పోరాటంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వారిలో 30 మంది మహిళా యోధులు అమరులయ్యారు. తాము ఏ దేశంలో టెర్రరిజం ఏ మూలన ఉన్నా దానికి వ్యతిరేకంగా పోరాడుతామని ఈ సందర్భంగా మహిళాయోధులు శపథం చేశారు. ఈ సందర్భంగా మహిళలను తమ ఆలోచనలను మీడియాతో పంచుకున్నారు. వారిలో శాందా అఫ్రీన్ మాట్లాడుతూ ‘ నాయకుడు అబ్దుల్లా ఒకాలన్ మహిళల స్వేచ్ఛపై దష్టి పెట్టారు. అందుకనే మేము కూడా మహిళల స్వేచ్ఛ కోసం, మానసికంగా ప్రజల విముక్తి కోసం పోరాటం జరిపాం. మా పోరాటం ఒక్క ఐఎస్ఐఎస్కు వ్యతిరేకంగానే కాదు. అన్ని రకాల దుష్ట శక్తులపై మా పోరాటం కొనసాగుతుంది. ఒక్కోసారి మహిళల నుంచి కూడా చెడు ఎదురుకావచ్చు. అలాంటి ఆస్కారం లేకుండా వారు విద్యావంతులు కావాలి. మంచి సిద్ధాంతాన్ని అలవర్చుకోవాలి’ అని చెప్పారు. అబ్దుల్లా ఒకాలన్ కుర్దిస్ధాన్ వర్కర్స్ పార్టీ వ్యవస్థాపకుడు. ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయన పార్టీని కూడా టర్కీ, అమెరికా, యూరోపియన్ యూనియన్ కూడా టెర్రరిస్టు పార్టీగా గుర్తిస్తోంది. అయితే ఆయన్ని ఆదర్శంగా తీసుకున్న కుర్దిష్ మహిళా యోధులు మాత్రం ఒకాలన్ చిత్రంగల జెండాను ఎగరేస్తూ వారం క్రితం వీధుల్లో తిరిగారు. ఐఎస్ఐఎస్కు వ్యతిరేకంగా మూడేళ్ల క్రితం యుద్ధం ప్రారంభమైనప్పుడు అవ్రిమ్ డిఫ్రామ్ 17 ఏళ్ల అమ్మాయి. తమ పోరాటంలో ఎంతో మంది మరణించారని, ప్రతి మరణం కూడా తమను మరింత కతనిశ్చయంతో పోరాడేలా చేసిందని ఆమె చెప్పారు. అణచివేత నుంచి ప్రజలను విముక్తం చేసే వరకు, తమ నాయకుడు ఒకాలన్ను విడుదల చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆమె చెప్పారు. 24 ఏళ్ల వులత్ రోమిన్ గత ఏడాదిన్నరగా ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులను వ్యతిరేకంగా పోరాటం జరుపుతున్నారు. ఆమె రక్కా, తబ్కా, హల్హోల్లో పోరాటం జరిపారు. ‘కుర్దిష్ ప్రజల స్వేచ్ఛ కోసం, ముఖ్యంగా మహిళల స్వేచ్ఛ కోసం నేను పోరాటం జరుపుతున్నాను. ప్రజలకు జరిగే ప్రతి అన్యాయంపైనా పోరాటం చేస్తాను’ అని ఆమె చెప్పారు. ఇక సోజ్దార్ డెరిక్ ఆరేళ్లుగా ఐఎస్ఐఎస్ టెర్రిరిస్టులను వ్యతిరేకండా పోరాటం చేస్తున్నారు. ‘మా మహిళలను, మా మాతభూమిపై కొనసాగిస్తున్న అణచివేతకు వ్యతిరేకంగా నేను పోరాడుతున్నాను. మహిళలను సెక్స్ బానిసలుగా, ఉప మానువులుగా చూస్తున్న టెర్రరిస్టులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాను’ అని ఆమె వ్యాఖ్యానించారు. -
చెదరని స్వప్నం
ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదుల సుదీర్ఘ చెరలో నిలువెల్లా క్షతగాత్రగా మిగిలిన ఇరాక్‌లోని కుర్దుల ప్రాంతం స్వతంత్ర రాజ్యంగా ఎదగాలన్న చిరకాల వాంఛను ఫలింపజేసుకునేందుకు తొలి అడుగు వేసింది. ఇరాక్ ప్రభుత్వమే కాదన్నా... ఇరుగు పొరుగునున్న టర్కీ, ఇరాన్‌లు ఆగ్రహావేశాలతో చెలరేగినా... ఐక్యరాజ్యసమితి వద్దని బతిమాలినా మూడు రోజుల క్రితం రిఫరెండం నిర్వహించుకుంది. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతూనే ఉన్నా ఆ రిఫరెండంలో పాల్గొన్న 93 శాతంమంది పౌరుల్లో అత్యధికులు స్వతంత్ర కుర్దిస్తాన్ ఆవిర్భావానికి అనుకూలంగా ఓటేశారని సమాచారం వస్తోంది. తుది ఫలితం గురువారం అధికారికంగా వెలువడాల్సి ఉంది. ఇరాక్ ప్రధాని హైదర్ అల్–అబాదీ ఈ రిఫరెండాన్ని ‘వ్యూహాత్మక, చరిత్రాత్మక తప్పిదం’గా అభిర్ణిస్తే... టర్కీ అధ్యక్షుడు ‘నమ్మకద్రోహ’మని మండిపడ్డారు. ఇరాన్ మత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు దీన్ని ‘మరో ఇజ్రాయెల్’ స్థాపించడానికి వేసిన ఎత్తుగడగా వ్యాఖ్యానించారు. చిత్రమేమంటే ప్రపంచంలో ఇజ్రాయెల్ ఒక్కటే కుర్దుల రిఫరెండాన్ని సమర్ధించింది. ఈ సమర్ధనే రిఫరెండం పర్యవసానాలెలా ఉండబోతున్నాయో సూచిస్తోంది. కుర్దిష్ ప్రాంతీయ ప్రభుత్వ అధ్యక్షుడు మసౌద్ బర్జానీ ఇప్పటికిప్పుడు సరిహద్దు రేఖలు గీసే ఆలోచనేదీ లేదని హామీ ఇచ్చినా, ‘మంచి ఇరుగుపొరుగు’గా ఉండాలంటే ఏం చేయాలన్న అంశంపై సంభాషణలకు ఇది ప్రాతిపదికని చెబుతున్నారు. పశ్చిమాసియాలో తమకంటూ సొంతంగా ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకోవా లని శతాబ్దాలుగా తహతహలాడుతున్నా కుర్దులకు అది నెరవేరని స్వప్నంగానే మిగి లింది. కుర్దు జాతి ప్రజలకంటూ ఇప్పుడు సొంత భూభాగం లేదు. వారుండే ప్రాంతం ఇరాక్, ఇరాన్, టర్కీ, సిరియా భూభాగాల్లో కలిసి ఉంది. ఆ జాతి ప్రజలు ఇంకా ఆర్మేనియా, అజర్బైజాన్లలో కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. ఇరాక్‌లో కుర్దిష్ భాషకు అధికార భాష హోదా ఉన్నా వేరే దేశాల్లో ఆ పరిస్థితి లేదు. వేర్వేరు దేశాల్లో ఆ భాషకు వేర్వేరు లిపులు కూడా తప్పలేదు. తామంతా ఒకే భూభాగంలో ఉమ్మడి లిపితో, సంస్కృతితో, స్వతంత్రంగా బతకాలని కుర్దులు వాంఛిస్తున్నా అది ఇప్పట్లో నెరవేరే సూచనలు కూడా కనబడటం లేదు. ఉత్తర ఇరాక్‌లోని కుర్దుల ప్రాంతానికి మాత్రం స్వయంపాలిత ప్రభుత్వం ఉంది. అంత కుమించి ఆశించరాదని ఇరాక్ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. హద్దు మీరితే చర్య లుంటాయంటున్నది. అందుకు కారణం ఉంది. కుర్దిస్తాన్ ప్రాంతీయ ప్రభుత్వం (కేఆర్జీ) ఏలుబడిలోని ప్రాంతంలో దండిగా చమురు బావులున్నాయి. అక్కడ రోజుకు 6,50,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి అవుతుంది. ఇది ఇరాక్ చమురు ఉత్పత్తిలో 15 శాతం. ప్రపంచ చమురులో 0.7 శాతం. తన మాట వినకుండా రిఫరెండం నిర్వహించినందుకు కేఆర్జీ నుంచి చమురు కొనుగోలు చేయరాదని ఇరాక్ నిర్ణయించడమే కాదు... ఇకపై చమురు కోసం తమ ఫెడరల్ ప్రభుత్వాన్ని మాత్రమే సంప్రదించాలని ఇరుగుపొరుగు దేశాలకు సూచించింది. అమెరికా ఒత్తిళ్ల పర్యవసానంగా సరే అన్నా చమురు మార్కెటింగ్‌ను కేఆర్జీకి అప్పగించడం ఇరాక్ ప్రభుత్వానికి ఆదినుంచీ ఇష్టం లేదు. చివరకు ఒప్పుకున్నా పలు సందర్భాల్లో అందుకు ఆటంకాలు కల్పించింది. చమురు డబ్బుతో కేఆర్జీ ముందూ మునుపూ పుంజుకుంటుందని భయం. ఈ రిఫరెండంతో టర్కీ కూడా ఆగ్రహించింది. చమురు మార్కెటింగ్‌కు సహకరిస్తున్నందుకు ఇదా ప్రతిఫలమని కేఆర్జీపై అది విరుచుకుపడుతోంది. కుర్దులు నాలుగు దేశాల్లోనూ దశాబ్దాలుగా తీవ్ర అణచివేతనూ, వేధింపులనూ ఎదుర్కొంటున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అటొమన్ సామ్రాజ్యాన్ని రద్దు చేసినప్పుడు స్వతంత్ర కుర్దిస్తాన్ ఏర్పాటుకు హామీ ఇచ్చినా టర్కీ తీవ్రంగా ప్రతిఘటించడంతో అది ఆగిపోయింది. ఆ తర్వాత వచ్చిన అనేక తిరుగుబాట్లను ఆ దేశం అణచివేసింది. ఇరాన్లో సైతం కుర్దులు స్వయంపాలన కోసం పోరా డుతూనే ఉన్నారు. ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ ఏలుబడిలో వారిపై యుద్ధ విమా నాలు బాంబుల వర్షం కురిపించాయి. హలబ్జా నగరంలో 1988లో విషవాయువు ప్రయోగించడంతో 5,000మంది పౌరులు మృత్యువాత పడ్డారు. 1991లో గల్ఫ్ యుద్ధం సమయంలో ఉత్తర ఇరాక్‌లోని కుర్దిష్ ప్రాంతం అమెరికా, మిత్రదేశాల కూటమి రక్షణలోకి వచ్చింది. ఇరాక్‌లో, సిరియాలో తన చెప్పుచేతల్లో ఉన్న కుర్దు గ్రూపులకు అమెరికా అండదండలందిస్తున్నా స్వతంత్ర కుర్దిస్తాన్ ఏర్పాటు దానికి ససేమిరా ఇష్టం లేదు. ఐఎస్ పీడ విరగడైందో లేదో తేలకుండానే పశ్చిమాసియాలో మరో కుంపటి రాజుకోవడం అమెరికాకు ససేమిరా ఇష్టం లేదు. కుర్దులకు మద్ద తిస్తే అది నాలుగు దేశాలతో కొత్త సమస్యలను సృష్టిస్తుంది. ఇరాక్ పాలకులు ఎదురుతిరగొచ్చు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ దూరం జరగొచ్చు. ఇదంతా ఆ ప్రాంతంలో ఇప్పుడున్న తన పలుకుబడిని దెబ్బతీస్తుందని అది భయపడుతోంది. బ్రిటన్, యూరప్ యూనియన్(ఈయూ), అరబ్‌లీగ్ దేశాల భయం కూడా అదే. ఇరాక్‌లో, సిరియాలో, ఇరాన్లో పాశ్చాత్య దేశాలకు పావులుగా పని చేస్తున్నారన్న అపప్రద కుర్దులకున్నా ఒక జాతిగా వారి ఆకాంక్షలు న్యాయమైనవి. వాటిపై నీళ్లు జల్లాలని చూడటం అధర్మం. అమెరికాను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన ఐఎస్ ఉగ్రవాదులతో రణరంగంలో ప్రత్యక్షంగా తలపడింది కుర్దులే. వారి సహకారం లేకపోతే ఐఎస్‌ను తరిమికొట్టడం అసా ధ్యమయ్యేది. దానికి ప్రతిఫలంగా తాము కోరుకున్న ప్రత్యేక రాజ్యానికి తోడ్పడాలన్నది కుర్దుల వాదన. ప్రశాంతత ఏర్పడ్డాక చూద్దామని అమెరికా సర్దిచెబుతున్నా అదెప్పటికి సాధ్యమన్నది కీలక ప్రశ్న. జాతుల స్వయంప్రతి పత్తిని గౌరవించాలన్న మౌలిక విధానానికి కట్టుబడి ఐక్యరాజ్యసమితి చొరవ తీసుకోవాలని, దాని ఆధ్వర్యంలోనే తమ దీర్ఘకాల సమస్యకు పరిష్కారం లభించాలని కుర్దులు కోరుకుంటున్నారు. వాయిదాలతో పొద్దుపుచ్చడం ఇకపై సాధ్యం కాదని ఆ ప్రాంత దేశాలూ, అమెరికా తదితర అగ్రరాజ్యాలు గుర్తించక తప్పదు. -
ఎర్డోగాన్‌కు ఎదురుదెబ్బ
సర్వాధికారాలూ సొంతం చేసుకుందామనుకున్న టర్కీ అధ్యక్షుడు రెసెప్ ఎర్డోగాన్ కలలు భగ్నమయ్యాయి. పదమూడేళ్లుగా అవిచ్ఛిన్నంగా దేశాన్ని ఏలుతున్న ఎర్డోగాన్ మొట్టమొదటిసారి ఎన్నికల్లో భంగపడ్డారు. ఈ నెల 7న జరిగిన ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని జస్టిస్ అండ్ డెవలప్మెంట్ పార్టీ (ఏకే పార్టీ)కి మిగిలిన పార్టీలతో పోలిస్తే అధికంగా సీట్లు లభించినా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అవసరమైన సంఖ్యాబలం కొరవడింది. విపక్షాలతో కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి సాగుతున్న చర్చలు రాగల 45 రోజుల్లో ఫలించని పక్షంలో దేశం మరోసారి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటుచే యాలంటే ఏకే పార్టీకి 550 స్థానాలున్న పార్లమెంటులో కనీసం 276 సీట్లుండాలి. కానీ, ఆ పార్టీ 258 స్థానాలను మాత్రమే గెల్చుకోగలిగింది. పోలైన ఓట్లలో ఏకే పార్టీకి 41 శాతంకన్నా తక్కువ ఓట్లు వస్తే... విపక్షాలన్నిటికీ కలిసి 60 శాతం ఓట్లు వచ్చాయి. ఇన్నేళ్లుగా పార్లమెంటులో తిరుగులేని మెజారిటీ చలాయిస్తున్న ఏకే పార్టీ ఇలాంటి ఫలితాలను ఊహించలేదు. దేశ జనాభాలో 20శాతంగా ఉన్న కుర్దిష్ పౌరులకు ప్రాతినిధ్యంవహించే హెచ్‌డీపీ తొలిసారి ఈ ఎన్నికల్లో గణనీయంగా ఓట్లు సాధించి తొలిసారి ఒక పార్టీగా పార్లమెంటులో చోటు దక్కించుకుంది. ఎర్డోగాన్ పార్టీని దెబ్బతీసింది ప్రధానంగా టెలిఫోన్ సంభాషణల టేపులంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన హయాంలో టర్కీలో వేళ్లూనుకున్న అవినీతిని ఆ టేపులు పట్టిచూపాయి. ఎవరో కాదు...ఎర్డోగాన్ కుమారుడే తమకు రావ లసిన వాటాల గురించి మాట్లాడుతూ దొరికిపోయాడు. టర్కీలో అవినీతి కొత్తేం కాదు. ప్రతి స్థాయిలోనూ విచ్చలవిడిగా డబ్బు ప్రభావం పెరిగిపోయిందని, రాజకీయాల్లో అదే అన్నిటినీ నిర్దేశిస్తున్నదని విపక్షాలు చాలా కాలంనుంచి ఆరోపిస్తున్నాయి. నయా ఉదారవాద విధానాలను అమలుచేసి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలను ఎర్డోగాన్ విశేషంగా ఆకట్టుకున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో పాశ్చాత్య దేశాలనుంచి వచ్చిపడిన కోట్లాది డాలర్లు... పశ్చిమాసియా, ఆసియా దేశాలతో విస్తరించిన వాణిజ్యం వగైరాలన్నీ దేశ ఆర్థిక వ్యవస్థను బలంగా తయారుచేశాయి. కళ్లు చెదిరే మాల్స్, విశాలమైన రోడ్లు, అత్యాధునిక సౌకర్యాలతో విమానాశ్రయాలు, జనంలో పెరిగిన కొనుగోలు శక్తి వంటివన్నీ ఎర్డోగాన్‌కు రాజకీయంగా ఎంతగానో తోడ్పడ్డాయి. వృద్ధి రేటు సైతం అంతకంతకు పెరుగుతూ వచ్చింది. 2010లో అది 9 శాతానికి చేరుకుంది. కానీ నయా ఉదారవాద విధానాలను అవలంబించే ప్రతీచోటా ఏమవుతున్నదో టర్కీలోనూ అదే జరిగింది. ఆర్థిక అసమానతలు అపారంగా పెరిగాయి. పేదల రోదనలు పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. అవినీతి తారస్థాయికి చేరింది. మొదట్లో ఉద్యోగావకాశాలు అపారంగా ఉన్నట్టే కనిపించినా అవి క్రమేపీ అడుగంటాయి. వృద్ధిరేటు సైతం నిరుడు 3 శాతానికి పడిపోయింది. నిరుద్యోగం 10 శాతానికి చేరింది. ఇవన్నీ ఎర్డోగాన్ ప్రభుత్వంపై అసంతృప్తిని పెంచుతూ వచ్చాయి. రెండేళ్లక్రితం రాజధాని ఇస్తాంబుల్‌లో ఒక పార్కును కూల్చి భారీ షాపింగ్ మాల్ నిర్మించాలని ప్రయత్నించినప్పుడు ఇది భళ్లున బద్దలయింది. వేలాదిమంది జనం దాన్ని అడ్డుకోవడానికి రోడ్లపైకి వచ్చినప్పుడు పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. తన పాలనపై పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చడానికి ఎర్డోగాన్ రెండు రకాల పద్ధతులను ఎంచుకున్నారు. మతం పేరిట భావోద్వేగాలను రెచ్చగొట్టడం ఒకపక్క...తన విధానాలను ప్రశ్నించే వర్గాలపై అణిచివేతను ప్రయోగించడం మరోపక్క సాగించారు. మీడియాపై ఆంక్షలు విధించడంతోపాటు అనేకమంది జర్నలిస్టులను, కార్టూనిస్టులను కటకటాల వెనక్కి నెట్టారు. వ్యతిరేక వార్తలు రాకుండా భయోత్పాతాన్ని సృష్టించారు. ఈ అణచివేతకు భయపడి పలు మీడియా సంస్థలు ఎర్డోగాన్‌కు దాసోహమన్నాయి. పార్లమెంటులో మెజారిటీ ఉందన్న నెపంతో విపక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునేందుకే ఆయన నిరాకరించారు. తన ఇష్టానుసారం పాలించారు. ఇవన్నీ చివరకు ఎర్డోగాన్‌కు శాపంగా మారాయి. నిజానికి మొన్నటి ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరగలేదు. విపక్ష పార్టీల అభ్యర్థులనూ, కార్యకర్తలనూ బెదరగొట్టడం...వారిపై పోలీసులతో దాడులు చేయించడంవంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల కోసం కొన్ని పోలింగ్ కేంద్రాలకు తరలించిన బ్యాలెట్ బాక్స్‌ల్లో...అప్పటికే ఏకే పార్టీకి అనుకూలంగా ముద్రేసి ఉన్న బ్యాలెట్ పత్రాలుండటం పరిశీలకుల కంటబడింది. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించడానికి వెళ్లిన అంతర్జాతీయ పరిశీలక బృందాలను సైనికులు తుపాకులు గురిపెట్టి భయభ్రాంతులకు గురిచేశారు. హింసాత్మక ఘటనలకు అంతేలేదు. ఇన్ని చేసినా ఎర్డోగాన్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అవసరమైన మెజారిటీకి చేరువ కాలేకపోయింది. ఇప్పుడు విపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు చేసే ప్రయత్నాలు విఫలమై మళ్లీ ఎన్నికలు గనుక వస్తే తన మెజారిటీ మరింత పడిపోవడం ఖాయమని ఎర్డోగాన్ భయపడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత రాజ్యాంగాన్ని తిరగరాసి కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని కైవసం చేసుకోవాలని, తన అధికారాలను మరింత పెంచుకోవాలని, ఏక పార్టీ స్వామ్యాన్ని నెలకొల్పాలని ఎర్డోగాన్ కలలుగన్నారు. సరిహద్దుల ఆవలినుంచి చొచ్చుకువస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను నిలువరించడానికి దేశంలో సుస్థిరమైన, బలమైన ప్రభుత్వం అవసరం ఉన్నదని ప్రజలకు పిలుపునిచ్చారు. వారిలో దేశభక్తిని రెచ్చగొట్టడానికి చూశారు. సెక్యులర్ విధానాలవల్ల కలిగే ముప్పును గురించి హెచ్చరించారు. కానీ ప్రజలు మాత్రం తాము నిరంకుశ పాలనకు వ్యతిరేకమని తేల్చిచెప్పారు. ప్రజాస్వామిక విధానాలనుంచి వైదొలగితే అంగీకరించబోమని స్పష్టంచేశారు. ఇది ఎర్డోగాన్‌కు మాత్రమే కాదు...ప్రపంచంలోని ఆ బాపతు పాలకులందరికీ హెచ్చరికే. మౌలిక సమస్యల పరిష్కారాన్ని గాలికొదిలి, జనం భావోద్వేగాలతో ఆటలాడాలనుకునే వారందరికీ గుణపాఠమే.