డమస్కస్ : సిరియాలో నాలుగేళ్లపాటు తిష్టవేసి అనాగరికంగా, ఆటవికంగా పాలన సాగించిన ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టులను ఓడించినట్లు సైనిక వర్గాలు ఇటీవల ప్రకటించగానే టెర్రరిస్టులకు వ్యతిరేకంగా విరోచితంగా పోరాడిన కుర్దిష్ మహిళా యోధులు వీధి వీధి తిరుగుతూ ఆనందోత్సవాలను చాటుకున్నారు. టెర్రరిస్టుల ఆధీనంలో ఉన్న రక్కాను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో వీరు కీలక పాత్ర పోషించారు. టెర్రరిస్టులు మహిళలను బానిసలుకన్నా అధ్వాన్నంగా చూడడమేకాకుండా వారిని, ముఖ్యంగా యాజిదీ మైనారిటీ మహిళలను సెక్స్ బానిసలుగా చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని కుర్దీష్ మహిళలు ఈ పోరాటంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వారిలో 30 మంది మహిళా యోధులు అమరులయ్యారు. తాము ఏ దేశంలో టెర్రరిజం ఏ మూలన ఉన్నా దానికి వ్యతిరేకంగా పోరాడుతామని ఈ సందర్భంగా మహిళాయోధులు శపథం చేశారు.
ఈ సందర్భంగా మహిళలను తమ ఆలోచనలను మీడియాతో పంచుకున్నారు. వారిలో శాందా అఫ్రీన్ మాట్లాడుతూ ‘ నాయకుడు అబ్దుల్లా ఒకాలన్ మహిళల స్వేచ్ఛపై దష్టి పెట్టారు. అందుకనే మేము కూడా మహిళల స్వేచ్ఛ కోసం, మానసికంగా ప్రజల విముక్తి కోసం పోరాటం జరిపాం. మా పోరాటం ఒక్క ఐఎస్‌ఐఎస్‌కు వ్యతిరేకంగానే కాదు. అన్ని రకాల దుష్ట శక్తులపై మా పోరాటం కొనసాగుతుంది. ఒక్కోసారి మహిళల నుంచి కూడా చెడు ఎదురుకావచ్చు. అలాంటి ఆస్కారం లేకుండా వారు విద్యావంతులు కావాలి. మంచి సిద్ధాంతాన్ని అలవర్చుకోవాలి’ అని చెప్పారు.
అబ్దుల్లా ఒకాలన్ కుర్దిస్ధాన్ వర్కర్స్ పార్టీ వ్యవస్థాపకుడు. ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆయన పార్టీని కూడా టర్కీ, అమెరికా, యూరోపియన్ యూనియన్ కూడా టెర్రరిస్టు పార్టీగా గుర్తిస్తోంది. అయితే ఆయన్ని ఆదర్శంగా తీసుకున్న కుర్దిష్ మహిళా యోధులు మాత్రం ఒకాలన్ చిత్రంగల జెండాను ఎగరేస్తూ వారం క్రితం వీధుల్లో తిరిగారు. ఐఎస్‌ఐఎస్‌కు వ్యతిరేకంగా మూడేళ్ల క్రితం యుద్ధం ప్రారంభమైనప్పుడు అవ్రిమ్ డిఫ్రామ్ 17 ఏళ్ల అమ్మాయి. తమ పోరాటంలో ఎంతో మంది మరణించారని, ప్రతి మరణం కూడా తమను మరింత కతనిశ్చయంతో పోరాడేలా చేసిందని ఆమె చెప్పారు. అణచివేత నుంచి ప్రజలను విముక్తం చేసే వరకు, తమ నాయకుడు ఒకాలన్‌ను విడుదల చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆమె చెప్పారు.
24 ఏళ్ల వులత్ రోమిన్ గత ఏడాదిన్నరగా ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టులను వ్యతిరేకంగా పోరాటం జరుపుతున్నారు. ఆమె రక్కా, తబ్కా, హల్‌హోల్‌లో పోరాటం జరిపారు. ‘కుర్దిష్ ప్రజల స్వేచ్ఛ కోసం, ముఖ్యంగా మహిళల స్వేచ్ఛ కోసం నేను పోరాటం జరుపుతున్నాను. ప్రజలకు జరిగే ప్రతి అన్యాయంపైనా పోరాటం చేస్తాను’ అని ఆమె చెప్పారు. ఇక సోజ్దార్ డెరిక్ ఆరేళ్లుగా ఐఎస్‌ఐఎస్ టెర్రిరిస్టులను వ్యతిరేకండా పోరాటం చేస్తున్నారు. ‘మా మహిళలను, మా మాతభూమిపై కొనసాగిస్తున్న అణచివేతకు వ్యతిరేకంగా నేను పోరాడుతున్నాను. మహిళలను సెక్స్ బానిసలుగా, ఉప మానువులుగా చూస్తున్న టెర్రరిస్టులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాను’ అని ఆమె వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment