ఉగ్ర ముఠాపై పంజా! | Hyderabad police arrested Hizb-Ut-Tahrir terrorists | Sakshi
Sakshi News home page

ఉగ్ర ముఠాపై పంజా!

Published Wed, May 10 2023 3:49 AM | Last Updated on Wed, May 10 2023 3:49 AM

Hyderabad police arrested Hizb-Ut-Tahrir terrorists - Sakshi

వారు మంచి ఉద్యోగాలు, వృత్తుల్లో ఉన్నవారు.. అందరి మధ్య ఉంటూనే అవసరమైనప్పుడు దాడి చేసి, కలకలం సృష్టించి.. మళ్లీ ఏమీ తెలియనట్టు ఉండిపోయేలా ఉగ్రవాద శిక్షణ పొందుతున్న వారు.. ఇంకా అవసరమైతే బాంబులతో విధ్వంసానికీ వెనకాడనివారు.. హైదరాబాద్‌లో దాడులకు సిద్ధమై చాప కింద నీరులా ప్లాన్‌ అమలుకు సిద్ధమయ్యారు. మధ్యప్రదేశ్‌ ఏటీఎస్, రాష్ట్ర నిఘా విభాగం కలసి ఈ కుట్రను భగ్నం చేశాయి.

సాక్షి, హైదరాబాద్‌: మధ్యప్రదేశ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌), రాష్ట్ర నిఘా వర్గాలు సంయుక్తంగా హైదరాబాద్‌లో మంగళవారం చేపట్టిన ఆపరేషన్‌లో ఐదుగురు హిజ్బూ ఉత్‌ తహరీర్‌ (హెచ్‌యూటీ) సంస్థ ఉగ్రవాద అనుమానితులు చిక్కారు. ఈ మాడ్యుల్‌కు సూత్రధారిగా ఉన్న మహ్మద్‌ సలీం.. ఓ మెడికల్‌ కాలేజీలో డిపార్ట్‌మెంట్‌ హెడ్‌గా పనిచేస్తుండగా, పట్టుబడినవారిలో ఒక దంత వైద్యుడు, ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉండటం కలకలం రేపుతోంది.

ఈ ఐదుగురినీ ఏటీఎస్‌ అధికారులు పీటీ వారెంట్‌పై భోపాల్‌కు తరలించారు. ఇదే సమయంలో మధ్యప్రదేశ్‌లోనూ ఏటీఎస్‌ అధికారులు మరో 11 మంది హెచ్‌యూటీ సంస్థ సభ్యులను అరెస్టు చేశారు. వారందరినీ అక్కడి కోర్టులో హాజరుపర్చగా.. ఈ నెల 19వ తేదీ వరకు వారిని ఏటీఎస్‌ కస్టడీకి అప్పగించింది. 

ఐసిస్‌ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా.. 
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌కు అనుబంధంగా హెచ్‌యూటీ సంస్థ పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు, ఉగ్రవాదులకు సానుభూతిపరులను తయారుచేస్తున్నట్టు ఆరోపణలు ఉన్న ఈ సంస్థ.. భారత్‌ సహా 50కిపైగా దేశాల్లో ఉనికిలో ఉంది. మన దేశంలో దీనిపై నిషేధం లేదు.

కొంతకాలం నుంచి హెచ్‌యూటీ సంస్థ ఎక్కడికక్కడ మాడ్యూల్స్‌ను తయారు చేసుకుంటూ విస్తరిస్తోంది. తమకు ఆకర్షితులైన వారికి శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేకంగా ఆర్మ్‌డ్‌ వింగ్‌ను ఏర్పాటు చేసుకుంది. సోషల్‌ మీడియాలో గ్రూపులనూ నిర్వహిస్తోంది. కేడర్‌కు ప్రమాదకర ఆయుధాల వినియోగంతోపాటు రసాయన, జీవాయుధాల (కెమికల్, బయోలాజికల్‌) దాడులు చేసేలా.. వీటికి సంబంధించి ఎవరికి వారు మెటీరియల్‌ సిద్ధం చేసుకునేలా తర్ఫీదు ఇస్తోంది. 


మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చి ఇక్కడ మాడ్యూల్‌.. 
భోపాల్‌కు చెందిన యాసీర్‌ హెచ్‌యూటీలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. తనతో కలసి చదువుకున్న సౌరభ్‌రాజ్‌ వైద్యను మతం మార్చుకుని, హెచ్‌యూటీలో చేరేలా ప్రోత్సహించాడు. మహ్మద్‌ సలీంగా పేరుమార్చుకున్న సౌరభ్‌.. 2019లో హైదరాబాద్‌లోని గోల్కొండ బాబాబజార్‌ మోతీ మహల్‌కు వలస వచ్చాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కాలేజీలో ఫార్మాస్యూటికల్‌ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా ఉద్యోగంలో చేరాడు.

మరోవైపు కొన్నేళ్ల కింద ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన దేవీప్రసాద్‌ పాండ కొన్నేళ్ల క్రితమే మతం మార్చుకుని అబ్దుర్‌ రెహ్మాన్‌గా మారాడు. గోల్కొండలోని ధన్కోక ప్రాంతంలో నివాసం ఉంటూ.. ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో క్లౌడ్‌ సర్వీస్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇక హైదరాబాద్‌లోని హఫీజ్‌బాబా నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ బస్క వేణుకుమార్‌ కూడా కొన్నేళ్ల క్రితం మతం మార్చుకుని మహ్మద్‌ అబ్బాస్‌ అలీగా మారాడు. 

సలీం ఈ ఇద్దరితోపాటు గోల్కొండ బడాబజార్‌కు చెందిన దంత వైద్యుడు షేక్‌ జునైద్, జగద్గిరిగుట్ట మగ్దూంనగర్‌కు చెందిన మహ్మద్‌ హమీద్, జవహర్‌నగర్‌లోని శివాజీనగర్‌కు చెందిన మహ్మద్‌ సల్మాన్‌లను ఆకర్షించాడు. తనతో సహా ఆరుగురితో హెచ్‌యూటీ మాడ్యూల్‌ను ఏర్పాటు చేశాడు. మరోవైపు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో యాసీర్‌ నేతృత్వంలో 11 మంది మరో మాడ్యూల్‌ కార్యకలాపాలు ప్రారంభించింది. 

మూడు నెలల పాటు నిఘా పెట్టి.. 
యాసీర్, సలీంల మాడ్యూల్స్‌ ఉగ్రవాద దాడులకు సిద్ధమవుతున్న విషయంపై మధ్యప్రదేశ్‌ ఏటీఎస్‌ అధికారులకు మూడు నెలల క్రితం జాతీ నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. అప్పటి నుంచి తెలంగాణ నిఘా వర్గాల సాయంతో ఏటీఎస్‌ అధికారులు వీరిపై కన్నేసి ఉంచారు. అన్ని అంశాలను నిర్ధారించుకుని.. మంగళవారం తెల్లవారుజామున అటు భోపాల్‌లో, ఇటు హైదరాబాద్‌లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

భోపాల్‌లో 11 మంది పట్టుబడగా.. హైదరాబాద్‌కు చెందిన మాడ్యూల్‌లో మహ్మద్‌ సల్మాన్‌ మినహా ఐదుగురిని పట్టుకున్నారు. మహ్మద్‌ సలీం ఇంటి నుంచి రెండు ఎయిర్‌గన్‌లు, పిల్లెట్స్, కత్తులు, గొడ్డళ్లతోపాటు ఉగ్రవాద సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఐదుగురిని పీటీ వారెంట్‌పై భోపాల్‌కు తరలించారు. పరారీలో ఉన్న మహ్మద్‌ సల్మాన్‌ కోసం రాష్ట్ర పోలీసులు గాలిస్తున్నారు. 

నిషేధం విధించేలా.. 
హెచ్‌యూటీ సంస్థపై 2021లో తమిళనాడులో ఓ కేసు నమోదైంది. దాన్ని దర్యాప్తు చేసిన ‘నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)’గతేడాది అభియోగపత్రాలు దాఖలు చేసినట్టు అధికారులు తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ సంస్థపై నిషేధం విధించేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్టు వెల్లడించారు. 

అనంతగిరి అడవుల్లో క్యాంప్‌.. హైదరాబాద్‌లో రెక్కీ.. 
యాసీర్, సలీంల నేతృత్వంలోని 17 మంది ప్రత్యేకంగా రాకెట్‌ చాట్‌ యాప్‌ ద్వారా సంప్రదింపులు జరిపారు. తుపాకులు, కత్తులు, గొడ్డళ్లను వినియోగించి ఎవరికి వారుగా ‘లోన్‌ వూల్ఫ్‌ ఎటాక్స్‌ (ఒంటరిగానే ఎవరిపైనైనా దాడిచేసి కలకలం రేపడం)’చేయాలని.. అవసరమైనప్పుడు బాంబులు తయారు చేసి జనసమ్మర్థ ప్రాంతాల్లో విరుచుకుపడాలన్నది వీరి పథకం. ఇందుకోసం అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాలతో పోరాడిన ఐసిస్‌ మాడ్యుల్స్‌ను ఆదర్శంగా తీసుకున్నారు.

రెండు మాడ్యూల్స్‌కు చెందిన 17 మంది కొన్నినెలల కింద వికారాబాద్‌ అనంతగిరి అడవుల్లో క్యాంపు నిర్వహించారు. ఎవరిని టార్గెట్‌గా ఎంచుకోవాలి? ఏ విధంగా దాడులకు దిగాలనేది చర్చించుకున్నారు. తర్వాత హైదరాబాద్‌ నగరంలో రెక్కీ చేశారు. పలు కీలక ప్రాంతాల్లో డ్రోన్లతోనూ రెక్కీ చేసి.. దాడులకు సన్నాహాలు చేసుకున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా సంప్రదింపుల్లో ఉంటూ దాడులకు మెటీరియల్‌ను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు.  

ఐసిస్‌ కన్నా ప్రమాదకరంగా హెచ్‌యూటీ! 
ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు అనుబంధంగా హిజ్బ్‌ ఉత్‌ తెహ్రీర్‌ (హెచ్‌యూటీ) సంస్థ పనిచేస్తున్నట్టు ప్రచారమున్నా.. దాని మూలాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. 1952లో ఇజ్రాయెల్‌లోని జేరుసలేంలో స్థాపితమైన ఈ సంస్థ.. ప్రస్తుతం లండన్‌ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది. యూరప్‌తోపాటు ఆసియాలోని ముస్లిం ప్రభావిత దేశాలకు విస్తరించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియాలో దీని ఉనికి ఎక్కువ.

నేరుగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడకపోవడంతో చాలా దేశాల్లో దీనిపై నిషేధమేదీ లేదు. అయితే ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ పతనం అనంతరం ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు హెచ్‌యూటీ ప్రయత్నిస్తున్నట్టు అంతర్జాతీయ నిఘా వర్గాలు గుర్తించాయి.

ఈ సంస్థ ఐసిస్‌ కన్నా ప్రమాదకరంగా మారుతోందని..  రసాయన, జీవాయుధాల వినియోగంపై కేడర్‌కు శిక్షణ ఇస్తోందని హెచ్చరించాయి. భారత్‌లో హెచ్‌యూటీ కార్యకలాపాల విస్తరణపై అంతర్జాతీయ భద్రతా సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందిందని సమాచారం. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా నిఘా పెట్టినట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement