సహరన్‌పూర్‌లో తొలి ‘ఉగ్ర’ సమావేశం!  | Junud Al Khalifa Phil Hind First Meeting On Uttar Pradesh | Sakshi
Sakshi News home page

సహరన్‌పూర్‌లో తొలి ‘ఉగ్ర’ సమావేశం! 

Published Wed, Sep 16 2020 7:11 AM | Last Updated on Wed, Sep 16 2020 7:12 AM

Junud Al Khalifa Phil Hind First Meeting On Uttar Pradesh - Sakshi

నఫీజ్‌ ఖాన్‌

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌)కు అనుబంధంగా ఏర్పడిన ‘జునూద్‌ అల్‌ ఖలీఫా ఫిల్‌ హింద్‌’ (జేకేహెచ్‌) మాడ్యూల్‌కు సంబంధించిన తొలి సమావేశం ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో జరిగిందని జాతీయ దర్యాప్తు సంస్థ నిర్ధారించింది. ఈ మీటింగ్‌కు నగరం నుంచి నఫీజ్‌ ఖాన్‌ వెళ్లాడని తేల్చింది. ఈ వివరాలను ఎన్‌ఐఏ తన అభియోగపత్రాల్లో పొందుపరిచింది. ఈ కేసులోనే తొమ్మది మందిని దోషులుగా ప్రకటిస్తూ ఢిల్లీలోని న్యాయస్థానం శనివారం తీర్పు ఇచ్చింది. వీరిలో హైదరాబాద్‌కు చెందిన నఫీజ్‌ ఖాన్‌ సహా ముగ్గురు ఉన్న విషయం విదితమే.

2016 జనవరిలో సిటీలో చిక్కిన నఫీస్‌ ఖాన్‌ ఈ మాడ్యుల్‌లో అత్యంత కీలకమైన ఉగ్రవాదిగా అధికారులు నిర్ధారించారు. సిరియా కేంద్రంగా అన్సార్‌ ఉల్‌ తౌహిద్‌ సంస్థను ఏర్పాటు చేసి, ఐసిస్‌ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న షఫీ ఆర్మర్‌ అలియాస్‌ యూసుఫ్‌ హింద్‌ (కర్ణాటకలోని భత్కల్‌ వాసి) ఆదేశాలతోనే ఈ మాడ్యుల్‌ పని చేస్తున్నట్లు ధ్రువీకరించారు. ఫేస్‌బుక్‌ ద్వారా ఇతడికి పరిచయమైన ముంబై నివాసి ముదబ్బిర్‌ ముస్తాఖ్‌ షేక్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రిజ్వాన్‌ అలియాస్‌ ఖాలిద్‌లకు ‘జునూద్‌’ విస్తరణ బాధ్యతల్ని అప్పగించాడు.  

సహరన్‌పూర్‌లో మీటింగ్‌... 
ఈ మాడ్యుల్‌కు చీఫ్‌గా వ్యవహరించిన ముదబ్బీర్‌ ఆన్‌లైన్‌ ద్వారానే ‘జునూద్‌’ను విస్తరించాడు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌కు చెందిన నఫీస్‌ ఖాన్‌తో 2014లో పరిచయం ఏర్పడింది. అబు జరార్‌ పేరుతో మాడ్యుల్‌లో చేరి, చాకచక్యంగా వ్యవహరిస్తున్న నఫీజ్‌ ఖాన్‌ను ఈ మాడ్యుల్‌ ఆర్థిక లావాదేవీలు పర్యవేక్షించే ఫైనాన్స్‌ చీఫ్‌గా ముదబ్బీర్‌ నియమించాడు. మాడ్యుల్‌ను దేశవ్యాప్తంగా విస్తరించాలనే ఉద్దేశంతో ముదబ్బీర్‌ 2015 జనవరిలో యూపీలో ఉన్న సహరన్‌పూర్‌ ప్రాంతం​లో తొలి సమావేశం ఏర్పాటు చేశాడు. అప్పట్లో అక్కడ మత ఘర్షణలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని మీటింగ్‌కు ఎంచుకున్నారు.

ఇందులో పాల్గొన్న ఐదుగురిలో నఫీస్‌ ఖాన్‌ అలియాస్‌ అబు జరార్‌ సైతం ఉన్నాడు. వాస్తవానికి ఈ సమావేశంలోనే మాడ్యుల్‌లోని ప్రతి ఒక్కరికీ ప్రాంతాల వారీ గా ‘ఉగ్రబాధ్యతలు’ అప్పగించాలని భావించారు. అయితే షఫీ ఆర్మర్‌ ఆదేశాల మేరకు ఆ ప్రక్రియను వాయిదా వేసుకున్నారు. ఈ సమావేశం నుంచి తిరిగి వచ్చిన తర్వాతే నఫీస్‌ నగరానికి చెందిన ఒబేదుల్లా ఖాన్, మహ్మద్‌ షరీఫ్‌ మొహియుద్దీన్, అబు అన్స్‌లను ఉగ్రవాదబాట పట్టించాడు. ఈ మాడ్యు ల్‌ సహరన్‌పూర్‌తో పాటు హైదరాబాద్, లక్నో, టమ్కూర్‌లో పలుమార్లు సమావేశమైందని, క్యాడర్‌కు ఆయుధాల వినియోగం, పేలుడు పదార్థాల తయారీకి సంబంధించి బెంగళూరు, టమ్కూరు, లక్నోల్లోని అటవీ ప్రాంతాల్లో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసేందుకు కుట్రపన్నిందని ఎన్‌ఐఏ నిర్థారించింది.  

నిఘాకు దొరకని యాప్స్‌తో... 
ముష్కరమూకల వినియోగం పెరిగిన నేపథ్యంలో నిఘా వర్గాలు ఫేస్‌బుక్, వాట్సాప్‌ తదితర సోషల్‌మీడియాలపై కన్నేసి ఉంచుతున్నాయి. దీన్ని పసిగట్టిన ‘జునూద్‌’ మాడ్యుల్‌ సమాచార మార్పిడికి కొత్త యాప్స్‌ను వినియోగించింది. అంతగా ప్రాచుర్యంలోకి రాని ఆడ్రాయిడ్‌ యాప్స్‌ ‘ట్రిలియన్‌’, ‘సురిస్పోట్‌’లను తమ సెల్‌ఫోన్లలోకి డౌన్‌లోడ్‌ చేసుకుని వ్యవహారాలు కొనసాగించామని ఎన్‌ఐఏ అధికారులకు ఉగ్రవాదులు వెల్లడించారు. ‘జునూద్‌’ కార్యకలాపాలను విస్తరించే ప్రయత్నాల్లో ఉన్న ముదబ్బీర్‌ ముంబైతో పాటు ఢిల్లీ, గుజరాత్, బీహార్, పశ్చిమ బెంగాల్, అలహాబాద్, ఉత్తరాఖండ్, ఆజామ్‌ఘర్‌ ప్రాంతాల్లో మీడియా వింగ్స్‌ ఏర్పాటు చేశాడు. దీనికోసం ఆయా ప్రాంతాల్లో ఓ వర్గానికి చెందిన విద్యాధికుల్ని, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారిని ఎంచుకుని ఉగ్రవాద బాటపట్టించే ప్రయత్నం చేశాడు. ఈ వివరాలు జాతీయ దర్యాప్తు సంస్థ తమ అభియోగపత్రాల్లో పొందుపరిచింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement