దొరకని సీరియల్‌ చైన్‌ స్నాచర్ల జాడ.. తిరిగొస్తేనే పట్టుకునేది! | Hyderabad Serial Chain Snatchers Yet To Not Found | Sakshi
Sakshi News home page

Hyderabad: దొరకని సీరియల్‌ చైన్‌ స్నాచర్ల జాడ.. తిరిగొస్తేనే పట్టుకునేది!

Published Mon, Jan 23 2023 8:50 AM | Last Updated on Mon, Jan 23 2023 3:29 PM

Hyderabad Serial Chain Snatchers Yet To Not Found - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీరియల్‌ చైన్‌ స్నాచింగ్‌లలో కలకలం రేపిన బవారియా ముఠా జాడ ఇంకా చిక్కలేదు. పక్షం రోజుల క్రితం హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఏడు ప్రాంతాలలో స్నాచింగ్‌లకు పాల్పడిన పింకు గ్యాంగ్‌.. పోలీసుల కళ్లుగప్పి పరారయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని శామ్లీ జిల్లాలకు చెందిన ముఠా కోసం వెళ్లిన పోలీసు బృందాలు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవటంతో తిరిగి వెనక్కి వచ్చేసినట్టు తెలిసింది. చేతిలోని డబ్బు అయిపోయాక మళ్లీ స్నాచింగ్‌ల కోసం తిరిగి ఈ పింకు గ్యాంగ్‌ నగరానికి వస్తేనే పట్టుకునే అవకాశం ఉందని ఓ పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు. 

పంథా మార్చిన స్నాచర్లు.. 
ఆరేడేళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం బవారియా గ్యాంగ్‌ స్నాచింగ్‌ పంథా మారింది. గతంలో వేరే రాష్ట్రంలో బైక్‌ను దొంగిలించి స్నాచింగ్‌ గూడ్స్‌ రైలులో బైక్‌ను పార్శిల్‌ చేసి తీసుకొచ్చేవారు. స్నాచింగ్‌ చేసేశాక బైక్‌లను ఇక్కడే వదిలేసి పరారయ్యేవాళ్లు. ప్రస్తుతం గూడ్స్‌ రైళ్లలో తనిఖీలు పెరగడంతో నేరస్తులు పంథా మార్చారని, స్థానికంగానే బైక్‌ను దొంగిలించే స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారని ఓ పోలీసు ఉన్నతాధికారి వివరించారు.

అలాగే గతంలో ఒక వృద్దురాలిని వెంట తీసుకొచ్చి దుస్తులు విక్రయించేందుకో లేదా ఆసుపత్రికి వచ్చామనో స్థానిక ఇంటి యజమానికి నకిలీ గుర్తింపు పత్రాలను సమర్పించి అద్దెకు తీసుకునేవాళ్లు. ఆపైన పలు ప్రాంతాలలో రెక్కీ చేసి ఉదయం 6 నుంచి 8 గంటలు లేదా సాయంత్రం 7 నుంచి 9 గంటల మధ్య మ్యాత్రమే స్నాచింగ్‌లకు పాల్పడేవాళ్లు. కానీ, ఇప్పుడు నగరంలో షెల్టర్‌ తీసుకోకుండా ఒకేసారి పలు నగరాలలో చోరీ చేసి నేరుగా సొంతూళ్లకు పరారవుతున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే ఈ నెల 6న బెంగళూరులో వరుస చోరీలు చేసిన నిందితులు 7న నగరానికి వచి్చ.. ఉప్పల్, నాచారం, సికింద్రాబాద్‌లో వరుసగా ఏడు ఘటనల్లో 24 తులాల బంగారు గొలుసులను స్నాచింగ్‌ చేశారు.  

పక్కా ప్లానింగ్‌.. 
ఉత్తరప్రదేశ్‌లోని శామ్లీ జిల్లాలోని 10–12 గ్రామస్తులు బవారియా ముఠాగా ఏర్పడ్డాయి బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాలలో మాత్రమే ఈ ముఠా స్నాచింగ్‌లకు పాల్పడుతుంటాయి. రూట్లు తెలిసిన 4 నుంచి 6 మంది వరుసగా 6 నుంచి 10 ప్రాంతాల్లో స్నాచింగ్‌ చేస్తారు. ఒక్కో చోట 3 నుంచి 5 తులాలు బంగారం స్నాచింగ్‌లు చేస్తుంటారు. పోలీసులకు దొరికిపోతామని స్నాచింగ్‌ కోసం దిగే సమయంలో సెల్‌ఫోన్లను అసలు వాడరు.

పని పూర్తయ్యాక ఎక్కడ కలుసుకోవాలి? ఎలా పరారవ్వాలో ముందుగా ప్లానింగ్‌ చేసుకున్నాకే రంగంలోకి దిగుతారు. ఈ ముఠాపై హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి చాలా రాష్ట్రాలలో చాలా కేసులున్నాయని.. వీళ్లను పట్టుకునేందుకు వెళ్లితే పోలీసులపైనా కూడా దాడులు చేస్తారని, బయటి వాళ్లు వచ్చారనే సమాచారం సెకన్లలో వీరికి చేరిపోతుందని ఓ అధికారి తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement