గ్రీస్ సంక్షోభం | Greece debt crisis: Crowdfunders come to rescue | Sakshi
Sakshi News home page

గ్రీస్ సంక్షోభం

Published Wed, Jul 1 2015 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 4:38 AM

గ్రీస్ సంక్షోభం

గ్రీస్ సంక్షోభం

ప్రపంచం మొత్తం... ముఖ్యంగా యూరో దేశాలు భయపడిందే నిజమైంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్)కు మంగళవారానికల్లా చెల్లించాల్సిన 170 కోట్ల డాలర్ల వాయిదా మొత్తాన్ని తీర్చలేమని గ్రీస్ చేతులెత్తేసింది. సామ, దాన, భేద ప్రయోగాలన్నీ పూర్తయి ఇక దండోపాయమే తరవాయని హెచ్చరిస్తూ వచ్చిన యూరో జోన్ దేశాలకు ఈ పరిణామంతో ఊపిరి ఆగిపోయి ఉండాలి. వామపక్ష సిరిజా పార్టీ ఆధ్వర్యంలోని గ్రీస్ ప్రభుత్వాన్ని గత కొన్ని నెలలుగా యూరో దేశాలన్నీ బతిమాలి, బుజ్జగించి దారికి తెచ్చుకుందామని చూశాయి. ఆఖరి నిమిషంలో యూరొపియన్ కమిషన్ చీఫ్ జీన్ క్లాడ్ జంకర్ రంగంలోకి దిగి బెయిలవుట్ ప్యాకేజీకి అంగీకరించమని అడిగారు.
 
 సరికొత్త షరతులకు ‘సరే’నని లిఖితపూర్వకంగా చెబితే యూరప్ దేశాల ఆర్థిక మంత్రుల అత్యవసర భేటీని ఏర్పాటుచేసి అప్పు తీర్చడానికి వారితో కొత్త అప్పు ఇప్పిస్తానని గ్రీస్ ప్రధాని సిప్రాస్‌కు హామీ ఇచ్చారు. అయితే ఈ ప్యాకేజీ ప్రతిపాదనలపైనా, దాంతోపాటు వచ్చే కొత్త షరతులపైనా జనం ముందుకెళ్లి వారి మనోగతాన్ని తెలుసుకుని అడుగుముందుకేయాలని...అందుకోసం వచ్చే ఆదివారం రిఫరెండం నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అందువల్లే రుణ వాయిదా చెల్లింపు విషయంలో మరో అయిదు రోజులు ఆగమని సిప్రాస్ జంకర్‌ను కోరారు. అందుకు ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఐఎంఎఫ్ రుణ వాయిదాను తాము చెల్లించడంలేదని గ్రీస్ ఆర్థికమంత్రి ప్రకటించారు.  
 
 ఊరంతా అప్పులు చేసినవాడిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యతా, అతని బాగోగులను పట్టించుకోవాల్సిన అవసరం రుణదాతలకే ఉంటుంది. ఎందుకంటే, అతనికేమైనా అయితే దెబ్బతినేది రుణదాతలే. పచ్చగా బతికిన దేశాన్ని వినియోగ వస్తు వ్యామోహంలో ముంచెత్తి నిజానికి అప్పులపాలు చేసింది ‘యూరోత్రయం’గా అందరూ పిలిచే యూరోపియన్ కమిషన్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు, ఐఎంఎఫ్‌లే!  దివాలా స్థితికి చేరుకున్నాక అప్పులు తీర్చడానికి బెయిలవుట్ ప్యాకేజీల పేరిట కొత్త అప్పులివ్వడం, అందుకోసం పొదుపు చర్యలు అమలు చేయాలని ఒత్తిళ్లు తీసుకురావడం, అందుకనుగుణంగా గ్రీస్ ప్రభుత్వాలు వ్యవహరించడం గత ఏడేళ్లుగా సాగుతూనే ఉంది. ప్రభుత్వ వ్యయంలో కోత విధించడం, పన్నులు పెంచడం ఇందులో ముఖ్యమైనవి. ఈ చర్యల పర్యవసానంగా లక్షలాదిమంది ఉద్యోగులకు జీతాలు కోతబడ్డాయి.
 
 చాలా మందికి పింఛన్లు ఆగిపోయాయి. పబ్లిక్ రంగంలో లక్షన్నరమంది ఉద్యోగాలు పోగా... గత అయిదేళ్లలో సుమారు 4 లక్షల వ్యాపార సంస్థలు మూతబడ్డాయి. ప్రజల ఆదాయంలో 40 శాతం మేర కోతపడింది. నిరుడు ఏప్రిల్‌నాటికి జనాభాలో 26 శాతం నిరుద్యోగిత ఉంటే...యువతలో ఇది 50 శాతం! జనం అర్ధాకలితో రోజులు వెళ్లదీసే పరిస్థితులు వచ్చాయి. లక్షలమంది తిండి తినడం మానేసి కేవలం సూప్‌లతో ఆకలి తీర్చుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులకు తట్టుకోలేక ఈ అయిదేళ్లలో వేలాదిమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తిండికే ఇబ్బందులు పడుతున్నచోట ఎంతగా పన్నులు పెంచినా ప్రభుత్వానికి వచ్చే రాబడి ఏముంటుంది?  ఇలాంటి చర్యలతో విసిగి వేసారిన గ్రీస్ జనం పాలక పార్టీలకు గుణపాఠం చెప్పారు. మొన్న జనవరిలో జరిగిన ఎన్నికల్లో వామపక్ష సిరిజా పార్టీ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది.
 
 ఇప్పుడు అమలవుతున్న పొదుపు చర్యలే జనాన్ని బెంబేలెత్తిస్తుంటే తాజాగా మరిన్ని కోతలు విధించాలని సిప్రాస్ ప్రభుత్వంపై యూరో జోన్ దేశాలు ఒత్తిళ్లు తెస్తున్నాయి. దారిద్య్రరేఖకు దిగువనున్నవారికిచ్చే పింఛన్లలో కోత, ఆహార  పదార్థాలపై అదనంగా మరో 23 శాతం వ్యాట్ విధింపు వంటివి వాటిలో కొన్ని. ఈ చర్యలతోపాటు వచ్చే ఏడాదికల్లా గ్రీస్ బడ్జెట్‌లో ప్రభుత్వ వ్యయం కంటే పన్ను రాబడి 1 శాతం ఎక్కువగా ఉండాలని...ఇది క్రమేపీ 3.5 శాతానికి చేరాలని షరతు. ఇలాంటి షరతుల్ని విధించడమంటే గ్రీస్ పౌరుల జీవితాలతో క్రూర పరిహాసమాడటమే. ఎందుకంటే యూరో జోన్ దేశాలతో పోలిస్తే గ్రీస్‌లో పింఛన్ల కోత ఇప్పటికే అత్యంత దారుణంగా ఉంది.

 

వాస్తవానికి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టు సిప్రాస్ ప్రభుత్వం పొదుపు చర్యలకు స్వస్తి చెప్పలేదు. పాత బెయిలవుట్ ప్యాకేజీల కోసం అప్పటి ప్రభుత్వాలు అంగీకరించిన కోతలు యథాతథంగా అమలు చేస్తామని...అదనపు కోతలకు తాము సిద్ధంగా లేమని ప్రకటించింది. అధికారంలో కొచ్చి ఆర్నెల్లయ్యాక తొలిసారి దానికి ఈ ‘కోతల’ పరీక్ష మొదలైంది. ఒక దశలో యూరో పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి తాజా పొదుపు చర్యలకు సిప్రాస్ సిద్ధపడినా పార్లమెం టులో సొంత పార్టీ ఎంపీలనుంచే ఆయనకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఓటింగ్ జరి గితే ఓటమి ఖాయమని తేలాకే ఆయన రిఫరెండం ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.
 
  గ్రీస్‌లో ఇప్పుడు బ్యాంకుల మూత, ఏటీఎంలలో డ్రా చేసే నగదుపై పరిమితులు వగైరా చర్యలు బెంబేలెత్తిస్తున్నాయి. యూరొపియన్ యూనియన్ (ఈయూ) నుంచి గ్రీస్ వైదొలగే పరిస్థితులువస్తే అది ఆ దేశానికి మాత్రమే కాదు... ఈయూకి కూడా పెనుముప్పే. దాని విచ్ఛిన్నానికి ఇక రోజులు దగ్గరపడినట్టే. ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతాయని, అది 1930 నాటి పరిస్థితులకంటే తీవ్రంగా ఉండొచ్చునని జోస్యాలు వెలువడుతున్నాయి.

 

కనుక పరిణతితో ఆలోచించాల్సిందీ...బుద్ధెరిగి ప్రవర్తించాల్సిందీ యూరో జోన్ దేశాలే. ఇప్పుడు గ్రీస్‌ను చూసీచూడనట్టు వదిలేస్తే స్పెయిన్...ఆ తర్వాత ఐర్లాండ్, ఇటలీవంటివి సైతం అదే బాటలో వెళ్తాయన్నది జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాల భయం. అందుకే అవి గ్రీస్‌ను ఎలాగైనా బెదిరించి దారికి తెచ్చుకోవాలని చూస్తున్నాయి. కానీ అంతులేని కోతలతో ఏ ఆర్థిక వ్యవస్థా గట్టెక్కలేదు. వర్తమాన గ్రీస్ సంక్షోభంలో తమ బాధ్యత కూడా ఉన్నదని అంగీకరించి, అందుకు పరిహారంగా రుణమాఫీకి సిద్ధపడటంతోపాటు ఆ దేశ పునర్నిర్మాణంలో భాగస్తులు కావాలి. గ్రీస్ మనుగడతోనే తమ భవితవ్యం కూడా ముడిపడి ఉన్నదని తెలుసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement