సాహసోపేతమైన విన్యాసాలు, సంప్రదాయ కళారూపాలు, అధునాతన నృత్య రీతులు, ర్యాప్ సంగీత హోరు విశాఖ సాగర తీరాన్ని ఉత్తేజభరితం చేశాయి. నాలుగు రోజులపాటు జరిగిన అంతర్జాతీయ నౌకా దళ ప్రదర్శన(ఐఎఫ్‌ఆర్) సందర్భంగా ఆకాశంలో, సముద్రంలో, నేలమీదా నావికా దళం చేసిన విన్యాసాలు చూసి వేలాదిమంది వీక్షకులు మంత్రముగ్ధులయ్యారు. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ప్రదర్శించిన పాటవం అందరినీ అబ్బురపరిచింది. ఎప్పుడో పదిహేనేళ్లక్రితం జరిగిన ఐఎఫ్‌ఆర్ తర్వాత మన దేశం నిర్వహించిన రెండో వేడుక ఇది. తూర్పు తీరం వేదికగా జరిగిన మొట్టమొదటి సంరంభం. ఈ అంతర్జాతీయ ప్రదర్శన కోసం నావికారంగ నిపుణులు, ఉన్నతాధికారులు ఎంతకాలంనుంచో ఎదురుచూస్తున్నారు.
దేశదేశాలనుంచీ వచ్చి ఇందులో పాలుపంచుకునేవారందరి ముందూ తమ ప్రతిభాపాటవాలను చాటడానికి, తమ యుద్ధ సన్నద్ధతను వెల్లడించడానికి, తమ శక్తియుక్తులను తెలపడానికి నావికాదళానికి లభించే అపూర్వ అవకాశమిది. అంతేకాదు...వారి విన్యాసాలతో సరిపోల్చుకుని మరింత పదునుదేరడానికి తోడ్పడే సందర్భమిది. ఈ ప్రదర్శనలో 51 దేశాలు పాల్గొంటే అందులో సగం దేశాలు యుద్ధ నౌకలను పంపాయి. దాదాపు 90 యుద్ధ నౌకలు, తీర రక్షక నౌకలు, మర్చంట్ నౌకలు, జలాంతర్గాములు...వాటితోపాటు మిగ్ 29కె, పీ81, హక్, ఫాంటన్స్, బ్లాక్ పాంథర్స్, వైట్ టైగర్స్ యుద్ధ విమానాలు, పలు హెలికాప్టర్లు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. 2001లో ముంబై తీరాన తొలిసారి జరిగిన ఐఎఫ్‌ఆర్‌లో కేవలం 29 దేశాలు మాత్రమే పాల్గొన్నాయని గుర్తుంచుకుంటే ఇప్పుడు విశాఖ తీరంలో సాగిన విన్యాసాల విస్తృతి ఎంతటిదో అర్ధమవుతుంది.
ఈసారి ఐఎఫ్‌ఆర్‌ను కేవలం యుద్ధ నౌకల, విమానాల విన్యాసాలకే పరిమితం చేయకుండా ఎన్నో సంక్లిష్టతలతో నిండి ఉన్న వర్తమాన తీర ప్రాంత భద్రతా వాతావరణాన్ని, ఆ నేపథ్యంలో వివిధ దేశాలమధ్య పెంపొందాల్సిన సుహృద్భావాన్ని, అందుకోసం అవసరమైన సహకారాన్ని తేటతెల్లం చేసేవిధంగా రూపొందించారు. మహాసాగరాల సాక్షిగా కలిసి సాగుదామన్న ఇతివృత్తంతో రూపొందిన ఈ ఐఎఫ్‌ఆర్... ఉగ్రవాదం, సముద్ర దొంగతనాలు, స్మగ్లింగ్‌వంటి నేర చర్యలను అరికట్టడంలో ప్రాంతీయ సహకారం ఎంత కీలకమో నొక్కిచెప్పింది. ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థల్ని ఏర్పాటుచేసుకుంటే పెనుముప్పును తప్పించుకోవచ్చునని చాటింది. అంతేకాదు...భూగోళం వేడెక్కి మంచు కరుగుతున్న కారణంగా సముద్ర మట్టాలు పెరగడం, పర్యవసానంగా దేశాల సరిహద్దులు మారడంవంటివి చోటు చేసుకుంటున్నాయి. ఇక సునామీలు, తుఫానుల సంగతి సరేసరి. ఇలాంటి సమయాల్లో సమాచారం ఇచ్చిపుచ్చుకునే విధానం సమస్యల తీవ్రతను తగ్గిస్తుంది. సంక్షోభ నివారణకు తోడ్పడుతుంది. ఆ దిశగా కూడా ఆలోచింపజేసేందుకు ప్రస్తుత సందర్భం దోహదపడిందని చెప్పాలి. ప్రపంచ వాణిజ్యంలో 90 శాతం సాగరమార్గాల్లోనే సాగుతుంది. అంటే దేశాలు ఆర్ధికంగా బలపడాలంటే సముద్ర మార్గాలు ప్రమాదరహితంగా, ప్రశాంతంగా ఉండటం చాలా అవసరం.
పరస్పర అపనమ్మకం, అనుమానాలు అలుముకొన్న ప్రస్తుత కాలంలో ఇలాంటి అంతర్జాతీయ ప్రదర్శనల నిర్వహణ సులభం కాదు. ఈ ప్రదర్శనలో పాల్గొన్న చైనా, జపాన్‌లమధ్య దక్షిణ చైనా సముద్ర విషయమై ఇప్పటికే తగాదా ఉంది. కొన్ని నెలలక్రితం జపాన్ నిర్వహించిన అంతర్జాతీయ నావికాదళ ప్రదర్శనలో చైనాకు చోటు దొరకలేదు. ఒక్క జపాన్‌తో మాత్రమే కాదు... సరిహద్దు జలాల విషయంలో అనేక ఆగ్నేయాసియా దేశాలతో చైనాకు వివాదాలున్నాయి. ఆ దేశాలన్నిటికీ వెనకనుంచి అమెరికా అండదండలందిస్తున్నదనే అనుమానాలు పుష్కలంగా ఉన్నాయి.
హిందూ మహా సముద్రంలో భారత్ తన చొరవనూ, సమర్ధతనూ ప్రదర్శించడం కోసం ప్రస్తుత సందర్భాన్ని వినియోగించుకుంటుందని కూడా చైనా అంచనా వేసింది. ఇక ఈ వేడుకలకు రమ్మని పిలిచినా మన పొరుగునున్న పాకిస్తాన్ మొహం చాటేసింది. అందువల్లే ‘భౌగోళికంగా విడివడి ఉన్నా మహాసాగరాల్లో కలిసి పనిచేద్దామ’ని ఈ సందర్భానికి చాలాముందే మన నావికాదళ చీఫ్ ఆర్‌కే ధావన్ అన్ని దేశాలకూ విజ్ఞప్తిచేశారు. మనకుండే అభ్యంతరాలనూ, సందేహాలనూ ప్రాంతీయ ప్రయోజనాల కోసం పక్కనబెడదామని కోరారు.
విశాఖ తీరంలో జరిగిన ఈ ప్రదర్శన మరో ముఖ్యమైన అంశాన్ని ప్రపంచ దేశాల ముందు పరిచింది. ప్రధాని నరేంద్రమోదీ ‘మేకిన్ ఇండియా’ పిలుపును ప్రతిబింబించేవిధంగా దేశీయంగా రూపొందించిన అనేక ఉత్పత్తులను మన నావికాదళం ప్రదర్శించింది. రక్షణ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించాలన్న తపనతో నావికాదళం పదిహేనేళ్లక్రితం డీఆర్‌డీఓ సహకారంతో వివిధ ఉత్పత్తులపై దృష్టిపెట్టింది. ఆ రంగంలో ఎంతో పురోగతి సాధించింది. ప్రపంచ శాంతి సాకారం కావాలంటే సముద్ర జలాల్లో శాంతి, సుస్థిరతలు అవసరమని...అందుకోసం సాగర తీర దేశాల మధ్య వ్యూహాత్మక, సుహృద్భావ సంబంధాలుండాలని నరేంద్ర మోదీ పిలుపునివ్వడంతోపాటు అందుకోసం ఏప్రిల్‌లో ముంబైలో మారిటైమ్ సదస్సు నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. తీర ప్రాంత భద్రతలో మన సంసిద్ధతను ఐఎఫ్‌ఆర్ ప్రపంచానికి వెల్లడించింది. హిందూ మహా సముద్ర ప్రాంతంలో భారత్ పోషించే వ్యూహాత్మక పాత్రను తేటతెల్లం చేసింది. గత ఏడెనిమిదేళ్లుగా హిందూమహా సముద్ర ప్రాంతంలో మన నావికాదళం చురుగ్గా పనిచేస్తోంది. అరేబియా సముద్ర ప్రాంతంలో సముద్ర దొంగల పనిబట్టడంలో పేరు సంపాదించుకుంది.
అయితే మన నావికాదళం వినియోగించే నౌకలు, జలాంతర్గాములు వగైరాల్లో 60 శాతం వార్థక్యానికొచ్చాయి. ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొన్న ఐఎన్‌ఎస్ విరాట్ 29 ఏళ్ల సర్వీసు తర్వాత త్వరలో నిష్ర్కమించబోతున్నది. రెండేళ్లక్రితం ఐఎన్‌ఎస్ సింధురక్షక్‌లో పేలుళ్లు సంభవించి 18మంది నావికా సిబ్బంది మరణించడంతో మొదలెట్టి వరసబెట్టి అనేక చిన్నా పెద్దా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. దీనికితోడు ఉన్నతాధికారుల స్థాయిలో 16 శాతం...నాన్ కమిషన్డ్ అధికారుల్లో 11 శాతం ఖాళీలున్నాయి. ఈ లోటుపాట్లన్నిటినీ సరిదిద్దుకోవడానికీ, మన సామర్ధ్యానికి మరింత పదునుపెట్టుకోవడానికీ ఇలాంటి సందర్భాలు దోహదపడతాయి. పటిష్ట కార్యాచరణకు కదిలిస్తాయి.
సంభ్రమాశ్చర్యాల కలబోత
Published Tue, Feb 9 2016 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 PM
Advertisement
Advertisement