ప్రధాని మోదీకి అరకు కాఫీ రుచి!
- 6న ఐఎఫ్‌ఆర్‌లో జీసీసీ స్టాల్ సందర్శించనున్న ప్రధాని
- ఈ సందర్భంగా కాఫీ రుచి చూపించనున్న అధికారులు
- సీఐఐ సదస్సులో అరకు కాఫీని ఆస్వాదించిన
- కేంద్ర, రాష్ట్ర నేతలు
సాక్షి, విశాఖపట్నం: ఒకప్పటి చాయ్ వాలా.. నేటి ప్రధాని నరేంద్రమోదీ అరకు కాఫీ రుచి చూడబోతున్నారు. విశాఖ ఏజెన్సీలో పండించే ఆర్గానిక్ కాఫీకి జాతీయ, అంతర్జాతీయ డిమాండ్ ఉంది. వాతావరణం, భూసారం, పండించే విధానం వంటివి ఈ కాఫీకి అమోఘమైన రుచి తెచ్చిపెడుతున్నాయి. గిరిజనులకు ఆర్థిక వెసులుబాటు కోసం కొన్నాళ్ల క్రితం గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ‘అరకు వ్యాలీ కాఫీ’ పేరుతో దీని మార్కెటింగ్ బాధ్యతలు చేపట్టింది. ఈ నెల 10 నుంచి మూడు రోజుల పాటు విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సుకు వచ్చిన కేంద్రమంత్రి అనంతకుమార్, గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు, ఇతర జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు ఈ కాఫీ రుచి చూసి.. ఔరా! అన్నారు.
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్‌ఆర్)లో పాల్గొనేందుకు ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ విశాఖ వస్తున్నారు. ఆ మర్నాడు విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేస్తున్న మారిటైం ఎగ్జిబిషన్, ఐఎఫ్‌ఆర్ విలేజ్‌ను సందర్శిస్తారు. అందులో వీవీఐపీ లాంజ్ ఏర్పాటు చేస్తున్నారు. దాని పక్కనే అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేయాలని గురువారం సాయంత్రం కలెక్టర్ ఎన్.యువరాజ్ జీసీసీ ఎండీ ఏఎస్‌పీఎస్ రవిప్రకాష్‌కు సూచించారు. ఆ స్టాల్ వద్దే ఫిబ్రవరి 6న సాయంత్రం మూడు గంటలకు ప్రధాని మోదీ అరకు కాఫీ రుచిని ఆస్వాదించనున్నారు. విశాఖ మన్యంలో లక్ష మంది గిరిజనులు పండిస్తున్న అరకు కాఫీకి దక్కుతున్న అరుదైన గౌరవంగా దీన్ని భావిస్తున్నామని రవిప్రకాష్ ‘సాక్షి’కి చెప్పారు.