మరోసారి కశ్మీర్ కన్నీటి వరదగా మారింది. జీలం నదికి ఏడు నెలల వ్యవధిలో రెండోసారి వచ్చిన వరదలవల్ల మళ్లీ జన జీవితం సంక్షోభంలో పడింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పినట్టు మొన్నటి వరదలతో పోలిస్తే దీని తీవ్రత తక్కువే. సాధారణ పౌరులు గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఉన్నంతలో ముందు జాగ్రత్తలు తీసుకున్నారు గనుక మృతుల సంఖ్య 20కి మించలేదు. ఆచూకీ తెలియకుండా పోయిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గత మూడు రోజులుగా శ్రీనగర్‌తోసహా జీలం నది పొడవునా ఉన్న పట్టణాలు, గ్రామాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చింది. అర్ధరాత్రి ఉన్నట్టుండి చుట్టుముట్టిన వరద నీటిని చూసి అనేకులు బెంబేలెత్తారు. ప్రాణాలు అరచేత పెట్టుకుని ఎత్తై ప్రదేశాలకు వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. బుడ్‌గామ్ జిల్లాలోని ఒక గ్రామంలో నాలుగు ఇళ్లు కూలిపోయి పదిమందికిపైగా నిద్రలోనే చని పోయారు. ఇంకా శిథిలాలు తొలగించడం పూర్తికాలేదు గనుక మృతుల సంఖ్య పెరిగినా పెరగొచ్చు. కొండ చరియలు విరిగిపడి జమ్మూ నుంచి శ్రీనగర్ వరకూ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. వేలాదిమంది చిక్కుబడ్డారు.
నిరుడు సెప్టెంబర్ నెలలో వచ్చిన వరదల్లో వచ్చిన అనుభవంతో సామాన్యులు జాగ్రత్తలు తీసుకున్నా... ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ఎప్పటిలా మందకొడి గానే ఉండిపోయింది. సంక్షోభం వచ్చిపడ్డాక రంగంలోకి దిగి ఏదో ఒకటి చేస్తున్న మాట నిజమే అయినా ముందే ఎందుకు మేల్కొనడం లేదో అర్థంకాదు. భారీ వర్షాలు కురుస్తాయన్న సమాచారం ఉన్నా గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేయడం, సహాయ బృందాలను సిద్ధం చేయడంవంటి చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది. అదే గనుక జరిగి ఉంటే ఇళ్లు కూలి అంతమంది మరణించే పరిస్థితి ఉండేది కాదు. ప్రకృతి కాస్త కరుణించి వర్షం తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే, ఇదంతా ఒక్క రోజు మాత్రమేనని రాగల మూడు, నాలుగు రోజుల్లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అభివృద్ధి పేరుతో చేపడుతున్న ప్రాజెక్టులవల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతిని భారీ వర్షాలు, వరదలు వస్తున్నాయని పర్యావరణవేత్తలు ఎప్పటినుంచో అంటున్నారు. అందులో నిజం ఉంది. వందేళ్ల తర్వాత అంటే... 1915 తర్వాత మార్చి నెలలో దేశం మొత్తం మీద ఇంత అసాధారణ రీతిలో వర్షాలు కురవడం ఇదే మొదటిసారని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా ఈ నెలలో దేశంలో సగటున 24.4 మి.మీ. వర్షపాతం నమోదవుతుండగా అది ఈసారి 50 మి.మీకి చేరుకుంది. జమ్మూ-కశ్మీర్‌లో అయితే ఇది మరింత ఎక్కువగా ఉంది. అక్కడ సాధారణ పరిస్థితుల్లో 127.3 మి.మీ వర్షపాతం నమోదవుతుండగా ఈసారి ఒక్కసారిగా 102 శాతం పెరిగి 257.2 మి.మీ. వర్షపాతం పడింది. చెట్లను ఎడాపెడా నరకడంవల్ల అకాల వర్షాలు చుట్టుముడుతున్నాయని, నదీ ప్రాంతాల్లో అడ్డగోలు నిర్మాణాలు పెరుగుతుండటంవల్ల వర్షాలు వచ్చినప్పుడు నీరు పోవడానికి అవరోధాలు ఏర్పడి జనావాసాలు మునుగుతున్నాయని పర్యావరణ వేత్తలు వాపోతున్నారు. ప్రభుత్వాలు ఈ హెచ్చరికలను పట్టించుకోవడం లేదని వాటి ఆచరణను గమనిస్తే అర్థమవుతుంది. మొన్నటి వరదల సమయంలో చాలా నదులకు పడిన గండ్లను ఇంకా పూడ్చలేదు. డ్రైనేజీల పూడిక తీయించలేదు. మార్చి నెలలో కశ్మీర్‌లో భారీ వర్షాలుంటాయని తెలిసినా ఏడు నెలలుగా పనులన్నీ నత్తనడకనే ఉన్నాయి.
నిధులు అందుబాటులో ఉన్నా తగిన విధంగా ప్రణాళికలు లేకపోవడంవల్లా, అంచనాలు కొరవడటంవల్లా జనం మరోసారి వరద బీభత్సాన్ని చవిచూడాల్సివచ్చింది. ఈ పనులన్నీ ఈపాటికే పూర్తయి ఉంటే నష్టం పరిమితంగా ఉండేది. క్రితంసారి వరదల సమయంలో అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయిందని విమర్శలొచ్చాయి. అలా విమర్శించిన పార్టీల్లో పీడీపీ కూడా ఉంది. తీరా తాము చేయాల్సివచ్చేసరికి మళ్లీ అదే స్థితి పునరావృతమైంది. జమ్మూ-కశ్మీర్‌లో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ముఫ్తీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టడానికి దాదాపు రెండు నెలలు పట్టింది. కనీసం వచ్చాకైనా ఏ పనులు ఎంతవరకూ వచ్చాయో, ఏమేమీ త్వరగా పూర్తి చేయవచ్చునో చూడటానికి ముఫ్తీ సర్కారుకు తీరిక లేకపోయింది.
వాస్తవానికి ఇది ప్రభుత్వాల మార్పుతో సంబంధం లేకుండా జరగాల్సిన పని. ప్రజా ప్రభుత్వం ఉన్నా, గవర్నర్ పాలన ఉన్నా పోలీసు యంత్రాంగం యధావిధిగా పనిచేస్తుంది. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో తీసుకునే చర్యలకు ఆటంకాలు ఉండవు. కానీ, ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉండే పనులు ఏమేరకు సాగుతున్నాయో...ఏ కారణంగా నిలిచిపోయాయో ఆరా తీసే వారుండరు! మనకు జాతీయ విపత్తుల నివారణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంఏ) ఉంది. ఏడు నెలలనాటి వరదల తర్వాత జమ్మూ-కశ్మీర్‌లో అది సూచించిన చర్యలేమిటో, ఆచరణలో అవి ఏమేరకు అమలవుతున్నాయో ఎవరూ చూసిన పాపాన పోలేదు. ఇలాంటి నిర్లక్ష్యమే తాజా వరదల్లో పలువురి ప్రాణాలు తీసింది. వేలాదిమందిని ఇబ్బందులపాలు చేసింది. కొన్నిచోట్ల యువత కదిలి సోషల్ నెట్ వర్క్ గ్రూపుల ద్వారా సమన్వయం చేసు కుని రాగల ప్రమాదంపై వివిధ ప్రాంతాల ప్రజలను హెచ్చరించారు గనుక చాలా చోట్ల ముందస్తు చర్యలు తీసుకోగలిగారు. స్థానిక అధికారులను కదిలించారు. ఈ చొరవ అధికార యంత్రాంగంలో కూడా ఉంటే పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేది. రాగల మూడు రోజుల్లో మరోసారి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ విభాగం చెబుతున్న నేపథ్యంలో అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలి. ఈ గండం గట్టెక్కాక గండ్లు పూడ్చడం, పూడిక తీయించడం, కరకట్టలు పటిష్టం చేయడం వంటి పనులను చురుగ్గా పూర్తిచేయించాలి.
కశ్మీర్ వరద బీభత్సం
Published Tue, Mar 31 2015 11:37 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement