ఇంజనీరింగ్ స్టూడెంట్స్... క్యాంపస్ లైఫ్ | Engineering students of Campus college life | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్ స్టూడెంట్స్... క్యాంపస్ లైఫ్

Published Sun, Jul 6 2014 4:03 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 AM

ఇంజనీరింగ్ స్టూడెంట్స్... క్యాంపస్ లైఫ్

ఇంజనీరింగ్ స్టూడెంట్స్... క్యాంపస్ లైఫ్

విశ్వవిద్యాలయం ఏదైనా క్యాంపస్ కళాశాలలకు ఉండే ప్రాధాన్యతే వేరు! టాప్ ర్యాంకర్లకు వేదికై, ఇతర కళాశాలలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి క్యాంపస్ కాలేజీలు. అత్యుత్తమ విద్యాప్రమాణాలు పాటిస్తూ.. భావి ఇంజనీర్లను తీర్చిదిద్దుతున్నాయి. రిక్రూట్‌మెంట్ కంపెనీల ప్రాధాన్యాన్ని సొంతం చేసుకుంటూ.. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తున్నాయి. మరోవైపు నాలుగేళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి జీవితంలో.. ‘క్యాంపస్ లైఫ్’ అనేది ఓ మధురమైన, మరుపురాని, ముఖ్యమైన ఘట్టం. భవిష్యత్‌లో అతను అధిరోహించబోయే ఉన్నత విజయాలకు తొలి అడుగు పడేది ఇక్కడే! ఈ నేపథ్యంలో.. రాజధాని నగరంలోని ప్రముఖ క్యాంపస్ కళాశాలల్లో ఇంజనీరింగ్ విద్యార్థి  క్యాంపస్ లైఫ్‌పై ఫోకస్...
 
 ఇంజనీరింగ్... నాలుగేళ్లు.. విద్యార్థి కెరీర్ నిర్మాణానికి నాలుగు స్తంభాలు. పునాది బలంగా ఉన్నప్పుడే దృఢమైన భవన నిర్మాణం సాధ్యమవుతుంది. నాలుగేళ్ల ఇంజనీరింగ్‌లో నాణ్యమైన విద్యతోపాటు మంచి నడవడిక అలవడితే.. విద్యార్థి భవిష్యత్తు బంగారమవుతుంది. ఉన్నత అవకాశాలూ సొంతమవుతాయి. సిటీలోని ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్,  జేఎన్‌టీయూ- హైదరాబాద్ తదితర క్యాంపస్ కళాశాలల్లో  విద్యావిధానం, జీవనశైలి, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీస్తున్నాయి. ఆధునిక సమాజానికి అవసరమయ్యే నైపుణ్యాలను వారిలో పెంపొందిస్తున్నాయి. అందుకే నాణ్యమైన విద్య లభించే ఇలాంటి క్యాంపస్ కాలేజీల్లో చేరడం ప్రతి విద్యార్థి కలగా మారింది.
 
 క్లాస్ రూం పాఠాలు : క్యాంపస్ కాలేజీల్లో ప్రతిభావంతులకే అడ్మిషన్ లభిస్తుంది. కాబట్టి వారిలో స్వయం శోధన, పరిశోధనా లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. వాటికితోడు అనుభవజ్ఞులైన ప్రొఫెసర్ల పాఠాలు వారిని మరింత నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దుతాయి. ప్రొఫెసర్లు లెక్చర్లకే పరిమితం కాకుండా.. విద్యార్థుల సందేహాలను తీర్చడానికి సదా సిద్ధంగా ఉంటారు. శాస్త్రవేత్తలు, ఆయా రంగాల్లో నిపుణులు, ఇతర  ప్రముఖులతో ఇంటరాక్టివ్ సెషన్లు కూడా క్యాంపస్ విద్యార్థులకు కలిసొచ్చే అంశం.
 
 లైబ్రరీ అండ్ ల్యాబ్స్: ఇంజనీరింగ్ క్యాంపస్ కళాశాలల్లో సువిశాలమైన లైబ్రరీ, ప్రయోగశాలల సదుపాయం ఉంటుంది. క్లాస్ రూం పాఠాలు ముగిసిన తర్వాత ల్యాబ్స్‌లో ప్రాక్టికల్ తరగతులుంటాయి. అధునాతన పరికరాల సాయంతో విద్యార్థులు పుస్తక పరిజ్ఞానాన్ని ప్రాక్టికల్‌గా నేర్చుకుంటారు. ఇవేకాకుండా క్యాంపస్ కాలేజీల్లో విద్యార్థులు.. స్కిల్స్‌ను మెరుగుపర్చుకోవడానికి ప్రత్యేక శిక్షణ ఉంటుంది. కమ్యూనికేషన్, గ్రూప్ డిస్కషన్ తదితర నైపుణ్యాలకు అధిక ప్రాధాన్యతనిస్తారు. కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ సెంటర్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విభాగాలు విద్యార్థుల్లోని వినూత్న ఆవిష్కరణలకు ప్రోత్సాహమిస్తాయి.
 
 రీడింగ్ అవర్స్: క్యాంపస్ కళాశాలల్లో విద్యార్థులు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ప్రశాంతంగా కూర్చుని చదవడానికి ఆసక్తి చూపుతారు. తెల్లవారుజామున 5 గంటలకే కొందరు విద్యార్థులు పుస్తకాలు ముందేసుకుంటారు. మరికొందరు ప్రశాంత వాతావరణంలో కూర్చొని పఠనం చేస్తుంటారు. ఇంకొందరు ప్రత్యేక శిక్షణ కోసం వెళ్తారు. ‘పొద్దున్నే దిన పత్రికలు, ఈఈఈ, ఎలక్ట్రానిక్స్ ఫర్ యు, ఏసీఎం తదితర మ్యాగజీన్‌లు చదువుతాం. అందులో ప్రచురించిన అంశాలపై స్నేహితులతో చర్చిస్తాం. అది మా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడానికి ఎంతగానో దోహదపడింది’ అని తెలిపాడు జేఎన్‌టీయూ క్యాంపస్‌లో ఈఈఈ చదువుతున్న వి.నరేశ్.
 
 ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్:
 విద్యార్థుల మానసిక, శారీరక ప్రశాంతతకు నష్టం వాటిల్లకుండా ఉండడానికి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎంతగానో తోడ్పడుతాయి. అందుకే ఈ అంశానికి ఇంజనీరింగ్ కళాశాలలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి. ఆ దిశగా విద్యార్థులను ప్రోత్సహిస్తాయి. వారి సౌలభ్యం కోసం స్టూడెంట్ యాక్టివిటీస్ సెంటర్లు, ఔట్‌డోర్ గేమ్స్ ఆడేందుకు విశాలమైన మైదానాలను ఏర్పాటు చేస్తున్నాయి. కొన్ని కళాశాలలు విద్యార్థుల శారీరక ఆరోగ్యం కోసం అధునాతన పరికరాలతో జిమ్నాసియమ్స్‌ను కూడా అందుబాటులో ఉంచుతున్నాయి.
 
 టైమ్ మేనేజ్‌మెంట్:
 క్యాంపస్ విద్యార్థులు పక్కా టైమ్ మేనేజ్‌మెంట్‌ను పాటిస్తారు. ఉదయాన్నే క్లాస్‌రూంలో ప్రవేశించింది మొదలు సాయంత్రం హాస్టల్‌కు వెళ్లే వరకు పక్కా టైమ్ ప్రకారం సాగిపోవాల్సిందే. ఏ రోజు పని ఆ రోజే చేయడం, ప్రణాళిక ప్రకారం నడుచుకోవడం విద్యార్థులకు అలవాటవుతుంది. కొందరు అలసత్వం ప్రదర్శించినప్పటికీ.. పరీక్షల సమయంలో అందరూ తప్పనిసరిగా సమయ పాలన పాటిస్తారు.
 
 భవిత విద్యార్థి చేతిలోనే: క్యాంపస్ కళాశాలల్లో విద్యార్థులందరూ నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టరు. ఇతర కళాశాలల విద్యార్థుల మాదిరే ఎంటర్‌టైన్‌మెంట్‌కూ ప్రాధాన్యమిస్తారు. ఇతర యాక్టివిటీస్‌లోనూ పాల్గొంటారు. ‘క్యాంపస్ కళాశాలలో కావాల్సినంత స్వేచ్ఛ ఉంటుంది. కానీ దాన్ని దుర్వినియోగం చేయొద్దు. మంచి భవిష్యత్తును నిర్మించుకోవడం విద్యార్థుల చేతుల్లోనే ఉంటుంది’ అని చెప్తున్నాడు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి తాజాగా సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన మహమ్మద్ ఇస్మాయిల్. అతను కోర్సు చివరి ఏడాదిలో జరిగిన క్యాంపస్ సెలక్షన్స్‌లో కన్‌స్ట్రక్షన్ కంపెనీ అయిన ఎల్ అండ్ టీతో పాటు సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోటెక్‌కూ ఎంపికయ్యాడు.
 
 సబ్జెక్టు పరంగా సహకరించుకుంటూ: అన్ని క్యాంపస్ కళాశాలల్లో వసతి సదుపాయం ఉంటుంది. సాధారణంగా అడ్మిషన్ జరిగినప్పుడు లేదా కొన్ని రోజుల్లోనే హాస్టల్‌లో గదులు కేటాయిస్తారు. ‘మా కళాశాలలో ఇంజనీరింగ్ బాయ్స్‌కు గంగ, కిన్నెర పేర్లతో రెండు ప్రత్యేక హాస్టళ్లను కేటాయించాం. వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులందరూ అన్నదమ్ముల్లా కలిసి మెలసి ఉంటారు. సబ్జెక్టు పరంగా, వ్యక్తిగతంగా కూడా ఒకరికొకరు సహకరించుకుంటారు’ అని ఉస్మానియా యూనివర్సిటీ అడిషనల్ చీఫ్ వార్డెన్  ప్రొ.వి. భిక్ష్మ తెలిపారు.
 
 క్యాంపస్ సెలక్షన్స్: క్యాంపస్ విద్యార్థులకు దాదాపు అన్ని కంపెనీలు పెద్దపీట వేస్తాయనేది తెలిసిందే. బీఈ/బీటెక్ నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్‌లోనే కంపెనీలు క్యాంపస్‌లకు క్యూ కడతాయి. క్యాంపస్ విద్యార్థులను కంపెనీలు ఎక్కువ ప్యాకేజీలతో ఎంపిక చేసుకుంటున్నాయని ఉస్మానియా యూనివర్సిటీ కళాశాల ప్లేస్‌మెంట్ ఆఫీసర్ వి.ఉమామహేశ్వర్ తెలిపారు. బ్రాంచ్‌తో సంబంధం లేకుండా సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయని చెప్పారు. సంస్థల ప్రమాణాలకు తగిన అభ్యర్థులనే కంపెనీలు ఎంపిక చేసుకుంటాయి. నైపుణ్యాలు పెంచుకుంటే ఇతర కళాశాలల విద్యార్థులు కూడా ఆఫ్ క్యాంపస్ నియామకాల్లో మంచి ఉద్యోగం సాధించొచ్చని ఆయన సలహా ఇస్తున్నారు.
 
 క్యాంపస్.. జీవితాన్ని నేర్పింది!
 విభిన్న నేపథ్యాలు, ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులందరం కొద్ది రోజుల్లోనే మంచి స్నేహితుల్లా మారిపోయాం. మొదట్లో కొంచెం భయాందోళనలకు గురైనప్పటికీ క్యాంపస్ వాతావరణం నాలో ధైర్యాన్ని నింపింది. నాలుగేళ్లు సరదాగా గడిచిపోయాయి. ప్రొఫెసర్ల ప్రోత్సాహం ప్రేరణనిచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే క్యాంపస్ నాకు జీవితాన్ని నేర్పింది. క్యాంపస్ సెలక్షన్స్‌లో ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలకు ఎంపికయ్యాను.
 - రాఘవ్, బీఈ, సివిల్ ఇంజనీరింగ్, ఉస్మానియా యూనివర్సిటీ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement