Campus life
-
30 శాతం మంది తెలుగు విద్యార్థులే
విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఎన్ఐటీ).. పరిచయం అక్కర్లేని విద్యా సంస్థ. దేశం గర్వించదగ్గ ఇంజనీర్,భారతరత్న అవార్డ్ గ్రహీత మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరుమీదుగా ఏర్పడిన ఈ సంస్థకు ఇంజనీరింగ్ కోర్సులను అందించడంలో మంచి పేరుంది. ఇక్కడ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్న నన్నపరాజు నైషద్ తన క్యాంపస్ లైఫ్‌ను వివరిస్తున్నాడిలా.. క్యాంపస్ లైఫ్ మాది హైదరాబాద్. జేఈఈ మెయిన్-2012లో విజయం సాధించి ఎన్ఐటీ -నాగ్‌పూర్‌లో చేరాను. ప్రస్తుతం బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్నాను. 220 ఎకరాల్లో క్యాంపస్ ఉంటుంది. ఇక్కడ తెలుగు విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ. బీటెక్‌లో అన్ని బ్రాంచ్‌లూ కలుపుకుని 30 శాతం మంది తెలుగు విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. సౌకర్యాలు అత్యుత్తమం ప్రవేశం లభించిన విద్యార్థులందరికీ హాస్టల్ వసతి ఉం టుంది. అందరికీ ల్యాన్ సౌకర్యం కల్పిస్తారు. ర్యాగింగ్ ఇంటరాక్షన్ వరకే పరిమితం. ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి హాస్టల్లో సదుపాయాలున్నాయి. హాస్టల్ కామన్రూమ్లో భాగంగా పత్రికలు, మ్యాగజైన్లు అందుబాటులో ఉంటాయి. ఇన్స్టిట్యూట్ ఉత్తర భారతదేశంలో ఉన్నా మన తెలుగు వంటకాలన్నీ లభిస్తాయి. భోజనం రుచిగా ఉంటుంది. తరగతి గదులు, లేబొరేటరీలు, లైబ్రరీ వంటివి అత్యుత్తమ స్థాయిలో ఉన్నాయి. ఇండస్ట్రీ విజిట్స్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు ఆయా బ్రాంచ్‌లు, షెడ్యూల్‌ను బట్టి క్లాసులు, ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఫ్యాకల్టీ చాలా బాగా బోధిస్తారు. సబ్జెక్టు సందేహాలను నివృత్తి చేస్తారు. గెస్ట్ లెక్చర్లు ఇవ్వడానికి విద్యాసంస్థలు, పరిశ్రమల నుంచి నిపుణులు వస్తుంటారు. వివిధ అంశాలపై అవగాహన కల్పించడానికి విద్యార్థులను ఇండస్ట్రీ విజిట్స్‌కు కూడా తీసుకెళ్తారు. హ్యుమానిటీస్ కూడా ప్రతి సెమిస్టర్లో రెండు ఇంటర్నల్స్, ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. వీటితోపాటు నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సు పూర్తయ్యేలోపు హ్యుమానిటీస్/సోషల్ సెన్సైస్ సబ్జెక్టులను అధ్యయనం చేయాలి. వీటిల్లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. వీటిల్లో వచ్చిన మార్కులను కూడా క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ ఏవరేజ్ (సీజీపీఏ)లో కలుపుతారు. నేను ఇప్పటివరకు 10కి 7.58 సీజీపీఏ సాధించాను. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ల్లో విద్యార్థులకు మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఈ ఏడాది గరిష్టంగా రూ. 22 లక్షల వరకు కంపెనీలు వేతనాలు అందించాయి. ప్రధానంగా కోర్ బ్రాంచ్‌లు (మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్) చదివే విద్యార్థులు మంచి ఉద్యోగావకాశాలు పొందుతున్నారు. మేనేజ్మెంట్ ఫెస్ట్ ప్రత్యేకం ఏటా క్యాంపస్‌లో టెక్నికల్ ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్, మేనేజ్మెంట్ ఫెస్ట్ నిర్వహిస్తారు. గతేడాది టెక్నికల్ ఫెస్ట్‌కు మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్‌కలాం హాజరయ్యారు. ఏ ఎన్ఐటీలో నిర్వహించని మేనేజ్మెంట్ ఫెస్ట్‌ను ఇక్కడ మాత్రమే ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ-సెల్ అందించే సేవలెన్నో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునేవారి కోసం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్ ఉంది. విద్యార్థుల ఆలోచనలు నచ్చితే స్టార్టప్‌కు కావాల్సిన ఆర్థిక వనరులు అందిస్తారు. స్టార్టప్ విజయవంతం కావడానికి సూచనలు, సలహాలు ఇస్తారు. కోర్సు పూర్తయ్యాక రెండేళ్లు జాబ్ చేసి తర్వాత ఎంబీఏ చేస్తా. -
క్యాంపస్ అంబాసిడర్స్ - ఆర్. భరత్‌సింహా రెడ్డి
ఆర్. భరత్‌సింహా రెడ్డి ఎంఏఎన్ఐటీ / భోపాల్ మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - భోపాల్.. దేశంలోనే మంచిపేరున్న విద్యా సంస్థ. అక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మూడో ఏడాది చదువు తున్న ఆర్. భరత్ సింహా రెడ్డి తన క్యాంపస్ లైఫ్‌ను పంచుకుంటున్నారిలా.. నో ర్యాగింగ్ : క్యాంపస్‌లో అందరికీ హాస్టల్ వసతి కల్పిస్తారు. క్యాంటీన్లో రుచికరమైన ఆహారం దొరుకుతోంది. రాత్రిళ్లు ఎక్కువ సేపు చదువుకునే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా క్యాంటీన్ కూడా ఏర్పాటైంది. క్యాంపస్‌లో ర్యాగింగ్ లేదు. అన్ని హాస్టల్స్ దగ్గర పటిష్ట మైన రక్షణ ఏర్పాట్లు చేశారు. ఎన్నో కోర్సులు: క్యాంపస్ వాతావరణం చాలా బాగుంటుంది. హైస్పీడ్‌తో క్యాంపస్ అంతా వై-ఫై ఉంది. బీటెక్, బీఆర్‌క, బీప్లానింగ్ లతోపాటు పీజీ కోర్సుల్లో ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, పీహెచ్డీ వంటివాటిని ఆఫర్ చేస్తున్నారు. బీటెక్‌లో జేఈఈ మెయిన్ ర్యాంకు ఆధారంగా, ఎంటెక్‌లో గేట్ స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. విద్యార్థులంతా ఎంతో స్నేహంగా ఉంటారు. ఎంటెక్, పీహెచ్డీ విద్యార్థులు కూడా క్యాంపస్‌లోనే ఉంటారు. సబ్జెక్టుల పరంగా వివిధ సందేహాలను నివృత్తి చేస్తారు. అత్యుత్తమ సదుపాయాలు: విశాలమైన తరగతి గదులు, అన్ని వసతులతో కూడిన లేబొరేటరీలు, డిస్పెన్సరీ, కంప్యూ టర్ సెంటర్, క్రీడా మైదానాలు ఉన్నాయి. ప్రస్తుతం అత్యాధునిక శైలిలో షాపింగ్ కాంప్లెక్స్, లైబ్రరీని నిర్మిస్తున్నారు. విద్యార్థులకు, అధ్యాపకులకు వసతి.. ఇలా చదువుకోవ డానికి కావాల్సిన చక్కటి వాతావర ణం, సదుపాయాలు ఉన్నాయి. రీసెర్చ చేసే విద్యార్థు లను ప్రోత్సహించడానికి ఇటీవలే ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. ఇది పరిశోధకు లకు ఆర్థిక సహాయం చేస్తుంది. ప్రాక్టికల్స్‌కు పెద్దపీట: బోధనలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను వినియోగిస్తారు. ప్రాక్టికల్స్‌కు పెద్దపీట వేస్తారు. ఇండస్ట్రీ ఓరియెంటేషన్‌తో క్లాసులు నిర్వహిస్తారు. అన్ని బ్రాంచ్‌ల విభాగాల ఆధ్వర్యంలో పరిశోధనపరమైన కార్యక్రమాలు ఎక్కువగా జరుగు తుంటాయి. ప్రతి డిపార్ట్మెంట్కు సొంతంగా ల్యాబ్‌లు ఉన్నాయి. అదేవిధంగా అత్యాధునిక పరిశోధన పరికరాలను సమకూర్చారు. విద్యార్థులను కూడా పరిశోధనల వైపు ప్రోత్సహిస్తారు. ఇన్స్టి ట్యూట్‌కు.. సీఎస్ఐఆర్, డీఎస్టీ, యూజీసీ, ఇస్రో, ఐసీఎంఆర్‌ల నుంచి భారీగా నిధులు అందుతున్నాయి. క్విజర్ క్లబ్ ఎన్ఐటీల్లోనే మొదటిది: క్యాంపస్ విద్యార్థులందరూ వివిధ సొసైటీలు, క్లబుల్లో సభ్యులుగా ఉంటారు. ఈ క్రమంలో ఏర్పడిన క్విజర్ క్లబ్.. దేశంలో ఉన్న 30 ఎన్ఐటీల్లో మొదటిగా ఏర్పడింది. ఇంకా ఎన్ఐటీబీ వెబ్ క్లబ్ కూడా ఉంది. దీని ద్వారా విద్యార్థులంతా ఆన్లైన్లో అందుబాటులో ఉంటారు. వారి కార్యకలాపాలను, బ్రాంచ్, డిపార్ట్మెంట్ ఈవెంట్స్‌ను అందరితో పంచుకుంటారు. అంతేకాకుండా వెబ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, గో గ్రీన్ ఫోరమ్, పర్యావరణ పరిరక్షణ సొసైటీ వంటివాటిని ఏర్పాటు చేశాం. రోటరీ ఇంటర్నేషనల్ ఆధ్యర్యంలోనూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. వివిధ విద్యా సంస్థలతో ఒప్పందాలు: క్యాంపస్‌లో కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులకు మంచి ప్లేస్‌మెంట్స్ లభిస్తున్నా యి. ఇంటర్న్షిప్స్, ప్లేస్‌మెంట్స్ కోసం ఇన్స్టిట్యూట్.. వివిధ ప్రముఖ సంస్థలు, కంపెనీల సహకారం, ఒప్పందాలతో ముందడుగు వేస్తోంది. ప్రీ ప్లేస్మెం ట్స్ ఆఫర్స్ లోనూ ఇన్స్టిట్యూట్ ముం దుంటోంది. గతేడాది ఏడాదికి కనీసం రూ. 4 లక్షల నుంచి గరిష్టంగా ఏడాదికి రూ.10 లక్షల వరకు వేతనాలు అందిం చాయి. కంపెనీలివే: ఫేస్బుక్, పవర్‌గ్రిడ్, హోండా మోటార్స్, మహీంద్రా, అమెజాన్, డేటా 64 వంటి కంపెనీలు క్యాంపస్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. -
కేస్ స్టడీస్‌కు ప్రాధాన్యం ఎక్కువ
మై క్యాంపస్ లైఫ్ - ఐఐఎం- కోల్‌కతా కోల్‌కతా.. భారతదేశ తూర్పుతీరంలో.. హుగ్లీనది ప్రవాహ హోయలతో అలరారే అందమైన నగరం. బ్రిటిష్ ఇండియాకు తొలి రాజధాని. అంతేకాదు.. గీతాంజలితో.. ప్రపంచవ్యాప్తం గా అందరి గుర్తింపు పొందిన రవీంద్రనాథ్ ఠాగూర్.. సేవామూర్తి మదర్ థెరిస్సా నడయాడిన నేల. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి వెలుగెత్తి చాటిన స్వామి వివేకానందుడు.. మొక్కలకు ప్రాణం ఉందని నిరూపించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్‌లు ఇక్కడివారే. ఇక.. ఆ రోజుల్లోనే ఇండియన్ సివిల్ సర్వీసు (నేటి ఐఏఎస్)కు ఎంపికైనా.. దేశమాత దాస్య శృంఖలాలు తెంచడానికి.. తన ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలి, జైహింద్ నినాదాలతో బ్రిటిష్‌వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన భరతమాత ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ విద్య నేర్చిందీ ఇక్కడే. ఇలా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సేవ, పరిశోధన వంటి అన్ని రంగాల్లోనూ స్వాత్రంత్యానికి ముందే తనదైన ముద్ర వేసిన ఈ నగరం.. అత్యుత్తమ మేనేజ్మెంట్ విద్యకు.. శిఖరంలా భాసిల్లుతోంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)- కోల్‌కతా ఇక్కడే కొలువు దీరింది. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (పీజీడీఎం) ద్వితీయ సంవత్సరం చదువుతున్న పల్లా రవితేజ తన క్యాంపస్ లైఫ్‌ను మనతో పంచుకుంటున్నారు. వివరాలు.. ఐఐటీ - మద్రాస్‌లో బీటెక్ చేశా మాది వైజాగ్. నాన్న రైల్వే డీఎస్పీగా పనిచేస్తున్నారు. అమ్మ గృహిణి. తమ్ముడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)- ఖరగ్‌పూర్‌లో కెమికల్ ఇంజనీరింగ్ చదువు తున్నాడు. నేను ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు వైజాగ్‌లో నే విద్యనభ్యసించాను. స్కూల్ డేస్‌లో వివిధ పోటీల్లో పతకాలు కూడా వచ్చాయి. పదో తరగతిలో (ఐసీఎస్ఈ సిలబస్) 92 శాతం మార్కులు, ఇంటర్మీడియెట్‌లో 911 మార్కులు సాధించాను. తర్వాత జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 236వ ర్యాంకుతో ఐఐటీ మద్రాస్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చదివాను. 6.82 సీజీపీఏతో బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించాక.. ఏడాదిపాటు పుణెలోని టాటా మోటార్స్‌లో సిస్టమ్ మేనేజర్ గా పనిచేశాను. ఆ తర్వాత కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)లో విజయం సాధించి ఐఐఎం - కోల్‌కతాలో చేరాను. దేశంలో మొదటి ఐఐఎం- కోల్‌కతా మేనేజ్మెంట్లో పీజీ కోర్సులు, పరిశోధనల కోసం దేశంలోని 13 ఐఐఎంల్లో తొలిగా ఏర్పడిన ఇన్స్టిట్యూట్.. ఐఐఎం- కోల్‌కతా. 1961లో నాటి కేంద్ర ప్రభుత్వం.. ఫోర్డ్ ఫౌండేషన్, భారతీయ పరిశ్రమల సమాఖ్య, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం, ఆల్ఫెడ్ పి. సోలన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ సహకారంతో ఐఐఎంను ఏర్పాటు చేసింది. ఇక్కడ వివిధ స్పెషలైజేషన్లలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్, డాక్టోరల్ ప్రోగ్రామ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఎగ్జిక్యూటివ్స్ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. సకల సదుపాయాలతో అలరారే క్యాంపస్ క్యాంపస్ మొత్తం 135 ఎకరాల్లో ఉంటుంది. కమలాలతో విలసిల్లే ఎన్నో చెరువులు, పచ్చని గడ్డి మైదానాలు, వృక్షాలతో.. ఉద్యానవనంలా కనిపిస్తోంది. విశాలమైన తరగతి గదులు ఉంటాయి. విద్యార్థులు చదువుకోవడానికి తెల్లవార్లూ తెరిచి ఉండే లైబ్రరీ, 750మందికి పైగా కూర్చొనే సౌకర్యం గల ఆడిటోరియం, క్రీడా మైదానం.. క్యాంపస్‌కే ప్రధాన ఆకర్షణ లు. ప్రవేశం లభించిన ప్రతి విద్యార్థికీ హాస్టల్ సదుపాయం కల్పిస్తారు. అల్పాహారం, భోజనం బాగుంటుంది. ఇన్స్టిట్యూ ట్ అంతా వై-ఫై సౌకర్యం ఉంది. స్పెషలైజేషన్లు ఎన్నో రెండేళ్ల పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (పీజీడీఎం) కోర్సులో భాగంగా ఎన్నో స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. మొదటి ఏడాది అందరికీ కామన్‌గా అన్ని అంశాలపై అవగాహన కల్పిస్తారు. రెండో సంవత్సరంలో విద్యార్థులు తమకు నచ్చిన స్పెషలైజేషన్‌ను ఎంచుకోవచ్చు. లేదంటే అందుబాటులో ఉన్న అన్ని స్పెషలైజే షన్లను చదివే అవకాశం ఉంటుంది. ట్రైమిస్టర్ విధానంలో కోర్సు ఉంటుంది. ఏడాదికి మూడు ట్రైమిస్టర్లు ఉంటాయి. ప్రతి ట్రైమిస్టర్లో పరీక్షలు ఉంటాయి. సమస్యల అధ్యయనం.. మేనేజ్మెంట్ అంటేనే.. నిర్వహణ, సమస్యలను పరిష్కరించడం. ఇందుకు అనుగుణంగానే ఇక్కడ బోధన ఉంటుంది. ఉదయం 8.30 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు క్లాసులుంటాయి. ఈ సమయంలో వీలును బట్టి తరగతులు నిర్వహిస్తారు. ఒక్కో పీరియడ్ వ్యవధి గంటన్నర. సాధారణంగా వారానికి 12 క్లాసులు ఉంటాయి. థియరీతో పాటు ప్రాక్టికల్స్‌కు పెద్దపీట వేస్తారు. కేస్ స్టడీస్‌ను ఎక్కువగా అధ్యయనం చేస్తుంటాం. అంతేకాకుండా ప్రస్తుతం వివిధ కంపెనీల్లో తలెత్తుతున్న సమస్యలను కేస్ స్టడీస్‌గా తీసుకుని పరిష్కార మార్గాలను అన్వేషిస్తాం. తద్వారా సంబంధిత సమస్య మాకు ఎదురైతే ఎలా ఎదుర్కోగలమో తెలుసు కుంటాం. స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్‌లో భాగంగా వేరే ఇన్స్టిట్యూట్లను సందర్శిస్తుంటాం. వీటి ద్వారా వివిధ అంశాలపై శిక్షణ పొందుతాం. ఏటా సమ్మర్లో రెండు నెలల పాటు ఇంటర్న్‌షిప్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ.50,000 వరకు స్టెఫండ్ అందిస్తారు. ఇంక్యుబేషన్.. ఇన్నోవేషన్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం వద్దనుకుని.. యువ వ్యాపారవేత్తలుగా రాణించాలనుకునేవారి కోసం ప్రత్యేకంగా ఇంక్యుబేషన్ సెల్ ఉంది. కొత్త స్టార్టప్‌ను ప్రారంభించాలను కునేవారికి ఆఫీసు కోసం కార్యాలయం కేటాయిస్తారు. స్టార్టప్ విజయవంతం కావడానికి కావాల్సిన సూచనలు, సలహాలు, సాంకేతిక సహకారం కూడా అందిస్తారు. స్టార్టప్‌కు అవసరమైన ఆర్థిక వనరులను కూడా సమకూరుస్తారు. ఇంక్యుబేషన్ సెంటర్‌తోపాటు ఇన్నోవేషన్ పార్క్ కూడా ఉంది. ఇక్కడ వివిధ సమస్యలను అధ్యయనం చేస్తుంటారు. గత ఐదేళ్ల నుంచి ఇప్పటివరకు క్యాంపస్‌లో 40కు పైగా స్టార్టప్‌లు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. అలుమ్ని అసోసియేషన్ సేవలెన్నో క్యాంపస్‌లో విద్యనభ్యసించి వివిధ కంపెనీల్లో మంచి హోదాల్లో ఉన్నవారు.. సొంతంగా వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్నవారి నుంచి ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహం ఉంటుంది. ప్రతి డిసెంబర్లో పూర్వ విద్యార్థులు క్యాంపస్‌ను సందర్శి స్తుంటారు. ప్రస్తుత విద్యార్థులకు వివిధ అంశాలపై గెస్ట్ లెక్చర్స్ కూడా ఇస్తారు. విజయవంతమైన గ్రాడ్యుయేట్‌గా, మేనేజర్‌గా ఎదగడానికి సూచనలు, సలహాలు అందిస్తారు. ప్లేస్‌మెంట్స్ విషయంలోనూ సహాయపడతారు. http:// alumninet.iimcal.ac.in/ద్వారా నిత్యం పూర్వ విద్యార్థులతో అందుబాటులో ఉండొచ్చు. ప్రతిభావంతులకు పురస్కారాలు పీజీడీఎం కోర్సు రెండేళ్లలో అన్ని ఖర్చులు కలుపుకుని దాదాపు రూ.20 లక్షలు అవుతుంది. అయితే ప్రవేశం లభించిన విద్యార్థులకు ఎలాంటి గ్యారెంటీ, సెక్యూరిటీ అవసరం లేకుండానే బ్యాంకులు రుణాలిస్తున్నాయి. ప్రతిభావంతులకు నగదు పురస్కారాలను కూడా ఇన్స్టిట్యూట్ అందిస్తోంది. క్యాంపస్‌లో తరచుగా నిర్వహించే బిజినెస్ కాంపిటీషన్స్‌లో బెస్ట్ ఐడియాలు ఇచ్చినవారికి నగదు బహుమతులు కూడా ఉంటాయి. ఇవేకాకుండా ప్రతి ఏటా జనవరిలో మేనేజ్మెంట్ ఫెస్ట్, ఫిబ్రవరిలో కల్చరల్ ఫెస్ట్ కూడా నిర్వహిస్తారు. ఇందులో విజేతలకు వివిధ బహుమతులు ఇస్తారు. లెక్కకు మిక్కిలి.. ప్లేస్‌మెంట్స్ ఐఐఎంలు అంటేనే.. భారీ వేతనాలు అందించే ప్లేస్‌మెంట్స్‌కు పెట్టింది పేరు. ప్రతి ఏటా వేసవిలో ఎన్నో కంపెనీలు, పరిశ్రమలు ఇన్స్టిట్యూట్లో ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తాయి. విశాఖలో కంపెనీ ఏర్పాటు చేస్తా ప్రస్తుతానికి నా లక్ష్యం.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో మంచి ఉద్యోగం సాధించడం. పదేళ్లపాటు ఉద్యోగం చేసి ఆర్థికంగా నిలదొక్కుకున్నాక.. విశాఖపట్నంలో సొంతంగా ఏదైనా కంపెనీని ఏర్పాటు చేస్తా. -
ఇంజనీరింగ్ స్టూడెంట్స్... క్యాంపస్ లైఫ్
విశ్వవిద్యాలయం ఏదైనా క్యాంపస్ కళాశాలలకు ఉండే ప్రాధాన్యతే వేరు! టాప్ ర్యాంకర్లకు వేదికై, ఇతర కళాశాలలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి క్యాంపస్ కాలేజీలు. అత్యుత్తమ విద్యాప్రమాణాలు పాటిస్తూ.. భావి ఇంజనీర్లను తీర్చిదిద్దుతున్నాయి. రిక్రూట్మెంట్ కంపెనీల ప్రాధాన్యాన్ని సొంతం చేసుకుంటూ.. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తున్నాయి. మరోవైపు నాలుగేళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి జీవితంలో.. ‘క్యాంపస్ లైఫ్’ అనేది ఓ మధురమైన, మరుపురాని, ముఖ్యమైన ఘట్టం. భవిష్యత్‌లో అతను అధిరోహించబోయే ఉన్నత విజయాలకు తొలి అడుగు పడేది ఇక్కడే! ఈ నేపథ్యంలో.. రాజధాని నగరంలోని ప్రముఖ క్యాంపస్ కళాశాలల్లో ఇంజనీరింగ్ విద్యార్థి క్యాంపస్ లైఫ్‌పై ఫోకస్... ఇంజనీరింగ్... నాలుగేళ్లు.. విద్యార్థి కెరీర్ నిర్మాణానికి నాలుగు స్తంభాలు. పునాది బలంగా ఉన్నప్పుడే దృఢమైన భవన నిర్మాణం సాధ్యమవుతుంది. నాలుగేళ్ల ఇంజనీరింగ్‌లో నాణ్యమైన విద్యతోపాటు మంచి నడవడిక అలవడితే.. విద్యార్థి భవిష్యత్తు బంగారమవుతుంది. ఉన్నత అవకాశాలూ సొంతమవుతాయి. సిటీలోని ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, జేఎన్టీయూ- హైదరాబాద్ తదితర క్యాంపస్ కళాశాలల్లో విద్యావిధానం, జీవనశైలి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీస్తున్నాయి. ఆధునిక సమాజానికి అవసరమయ్యే నైపుణ్యాలను వారిలో పెంపొందిస్తున్నాయి. అందుకే నాణ్యమైన విద్య లభించే ఇలాంటి క్యాంపస్ కాలేజీల్లో చేరడం ప్రతి విద్యార్థి కలగా మారింది. క్లాస్ రూం పాఠాలు : క్యాంపస్ కాలేజీల్లో ప్రతిభావంతులకే అడ్మిషన్ లభిస్తుంది. కాబట్టి వారిలో స్వయం శోధన, పరిశోధనా లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. వాటికితోడు అనుభవజ్ఞులైన ప్రొఫెసర్ల పాఠాలు వారిని మరింత నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దుతాయి. ప్రొఫెసర్లు లెక్చర్లకే పరిమితం కాకుండా.. విద్యార్థుల సందేహాలను తీర్చడానికి సదా సిద్ధంగా ఉంటారు. శాస్త్రవేత్తలు, ఆయా రంగాల్లో నిపుణులు, ఇతర ప్రముఖులతో ఇంటరాక్టివ్ సెషన్లు కూడా క్యాంపస్ విద్యార్థులకు కలిసొచ్చే అంశం. లైబ్రరీ అండ్ ల్యాబ్స్: ఇంజనీరింగ్ క్యాంపస్ కళాశాలల్లో సువిశాలమైన లైబ్రరీ, ప్రయోగశాలల సదుపాయం ఉంటుంది. క్లాస్ రూం పాఠాలు ముగిసిన తర్వాత ల్యాబ్స్‌లో ప్రాక్టికల్ తరగతులుంటాయి. అధునాతన పరికరాల సాయంతో విద్యార్థులు పుస్తక పరిజ్ఞానాన్ని ప్రాక్టికల్‌గా నేర్చుకుంటారు. ఇవేకాకుండా క్యాంపస్ కాలేజీల్లో విద్యార్థులు.. స్కిల్స్‌ను మెరుగుపర్చుకోవడానికి ప్రత్యేక శిక్షణ ఉంటుంది. కమ్యూనికేషన్, గ్రూప్ డిస్కషన్ తదితర నైపుణ్యాలకు అధిక ప్రాధాన్యతనిస్తారు. కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఇంక్యుబేషన్ సెంటర్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విభాగాలు విద్యార్థుల్లోని వినూత్న ఆవిష్కరణలకు ప్రోత్సాహమిస్తాయి. రీడింగ్ అవర్స్: క్యాంపస్ కళాశాలల్లో విద్యార్థులు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ప్రశాంతంగా కూర్చుని చదవడానికి ఆసక్తి చూపుతారు. తెల్లవారుజామున 5 గంటలకే కొందరు విద్యార్థులు పుస్తకాలు ముందేసుకుంటారు. మరికొందరు ప్రశాంత వాతావరణంలో కూర్చొని పఠనం చేస్తుంటారు. ఇంకొందరు ప్రత్యేక శిక్షణ కోసం వెళ్తారు. ‘పొద్దున్నే దిన పత్రికలు, ఈఈఈ, ఎలక్ట్రానిక్స్ ఫర్ యు, ఏసీఎం తదితర మ్యాగజీన్లు చదువుతాం. అందులో ప్రచురించిన అంశాలపై స్నేహితులతో చర్చిస్తాం. అది మా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడానికి ఎంతగానో దోహదపడింది’ అని తెలిపాడు జేఎన్టీయూ క్యాంపస్‌లో ఈఈఈ చదువుతున్న వి.నరేశ్. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్: విద్యార్థుల మానసిక, శారీరక ప్రశాంతతకు నష్టం వాటిల్లకుండా ఉండడానికి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎంతగానో తోడ్పడుతాయి. అందుకే ఈ అంశానికి ఇంజనీరింగ్ కళాశాలలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి. ఆ దిశగా విద్యార్థులను ప్రోత్సహిస్తాయి. వారి సౌలభ్యం కోసం స్టూడెంట్ యాక్టివిటీస్ సెంటర్లు, ఔట్‌డోర్ గేమ్స్ ఆడేందుకు విశాలమైన మైదానాలను ఏర్పాటు చేస్తున్నాయి. కొన్ని కళాశాలలు విద్యార్థుల శారీరక ఆరోగ్యం కోసం అధునాతన పరికరాలతో జిమ్నాసియమ్స్ను కూడా అందుబాటులో ఉంచుతున్నాయి. టైమ్ మేనేజ్మెంట్: క్యాంపస్ విద్యార్థులు పక్కా టైమ్ మేనేజ్మెంట్ను పాటిస్తారు. ఉదయాన్నే క్లాస్‌రూంలో ప్రవేశించింది మొదలు సాయంత్రం హాస్టల్‌కు వెళ్లే వరకు పక్కా టైమ్ ప్రకారం సాగిపోవాల్సిందే. ఏ రోజు పని ఆ రోజే చేయడం, ప్రణాళిక ప్రకారం నడుచుకోవడం విద్యార్థులకు అలవాటవుతుంది. కొందరు అలసత్వం ప్రదర్శించినప్పటికీ.. పరీక్షల సమయంలో అందరూ తప్పనిసరిగా సమయ పాలన పాటిస్తారు. భవిత విద్యార్థి చేతిలోనే: క్యాంపస్ కళాశాలల్లో విద్యార్థులందరూ నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టరు. ఇతర కళాశాలల విద్యార్థుల మాదిరే ఎంటర్‌టైన్‌మెంట్‌కూ ప్రాధాన్యమిస్తారు. ఇతర యాక్టివిటీస్‌లోనూ పాల్గొంటారు. ‘క్యాంపస్ కళాశాలలో కావాల్సినంత స్వేచ్ఛ ఉంటుంది. కానీ దాన్ని దుర్వినియోగం చేయొద్దు. మంచి భవిష్యత్తును నిర్మించుకోవడం విద్యార్థుల చేతుల్లోనే ఉంటుంది’ అని చెప్తున్నాడు ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచి తాజాగా సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన మహమ్మద్ ఇస్మాయిల్. అతను కోర్సు చివరి ఏడాదిలో జరిగిన క్యాంపస్ సెలక్షన్స్‌లో కన్స్ట్రక్షన్ కంపెనీ అయిన ఎల్ అండ్ టీతో పాటు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోటెక్కూ ఎంపికయ్యాడు. సబ్జెక్టు పరంగా సహకరించుకుంటూ: అన్ని క్యాంపస్ కళాశాలల్లో వసతి సదుపాయం ఉంటుంది. సాధారణంగా అడ్మిషన్ జరిగినప్పుడు లేదా కొన్ని రోజుల్లోనే హాస్టల్లో గదులు కేటాయిస్తారు. ‘మా కళాశాలలో ఇంజనీరింగ్ బాయ్స్‌కు గంగ, కిన్నెర పేర్లతో రెండు ప్రత్యేక హాస్టళ్లను కేటాయించాం. వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులందరూ అన్నదమ్ముల్లా కలిసి మెలసి ఉంటారు. సబ్జెక్టు పరంగా, వ్యక్తిగతంగా కూడా ఒకరికొకరు సహకరించుకుంటారు’ అని ఉస్మానియా యూనివర్సిటీ అడిషనల్ చీఫ్ వార్డెన్ ప్రొ.వి. భిక్ష్మ తెలిపారు. క్యాంపస్ సెలక్షన్స్: క్యాంపస్ విద్యార్థులకు దాదాపు అన్ని కంపెనీలు పెద్దపీట వేస్తాయనేది తెలిసిందే. బీఈ/బీటెక్ నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్‌లోనే కంపెనీలు క్యాంపస్‌లకు క్యూ కడతాయి. క్యాంపస్ విద్యార్థులను కంపెనీలు ఎక్కువ ప్యాకేజీలతో ఎంపిక చేసుకుంటున్నాయని ఉస్మానియా యూనివర్సిటీ కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ వి.ఉమామహేశ్వర్ తెలిపారు. బ్రాంచ్‌తో సంబంధం లేకుండా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయని చెప్పారు. సంస్థల ప్రమాణాలకు తగిన అభ్యర్థులనే కంపెనీలు ఎంపిక చేసుకుంటాయి. నైపుణ్యాలు పెంచుకుంటే ఇతర కళాశాలల విద్యార్థులు కూడా ఆఫ్ క్యాంపస్ నియామకాల్లో మంచి ఉద్యోగం సాధించొచ్చని ఆయన సలహా ఇస్తున్నారు. క్యాంపస్.. జీవితాన్ని నేర్పింది! విభిన్న నేపథ్యాలు, ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులందరం కొద్ది రోజుల్లోనే మంచి స్నేహితుల్లా మారిపోయాం. మొదట్లో కొంచెం భయాందోళనలకు గురైనప్పటికీ క్యాంపస్ వాతావరణం నాలో ధైర్యాన్ని నింపింది. నాలుగేళ్లు సరదాగా గడిచిపోయాయి. ప్రొఫెసర్ల ప్రోత్సాహం ప్రేరణనిచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే క్యాంపస్ నాకు జీవితాన్ని నేర్పింది. క్యాంపస్ సెలక్షన్స్‌లో ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలకు ఎంపికయ్యాను. - రాఘవ్, బీఈ, సివిల్ ఇంజనీరింగ్, ఉస్మానియా యూనివర్సిటీ