మై క్యాంపస్ లైఫ్ - ఐఐఎం- కోల్‌కతా
కోల్‌కతా.. భారతదేశ తూర్పుతీరంలో.. హుగ్లీనది ప్రవాహ హోయలతో అలరారే అందమైన నగరం. బ్రిటిష్ ఇండియాకు తొలి రాజధాని. అంతేకాదు.. గీతాంజలితో.. ప్రపంచవ్యాప్తం గా అందరి గుర్తింపు పొందిన రవీంద్రనాథ్ ఠాగూర్.. సేవామూర్తి మదర్ థెరిస్సా నడయాడిన నేల. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి వెలుగెత్తి చాటిన స్వామి వివేకానందుడు.. మొక్కలకు ప్రాణం ఉందని నిరూపించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్‌లు ఇక్కడివారే. ఇక.. ఆ రోజుల్లోనే ఇండియన్ సివిల్ సర్వీసు (నేటి ఐఏఎస్)కు ఎంపికైనా.. దేశమాత దాస్య శృంఖలాలు తెంచడానికి.. తన ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలి, జైహింద్ నినాదాలతో బ్రిటిష్‌వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన భరతమాత ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ విద్య నేర్చిందీ ఇక్కడే. ఇలా ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సేవ, పరిశోధన వంటి అన్ని రంగాల్లోనూ స్వాత్రంత్యానికి ముందే తనదైన ముద్ర వేసిన ఈ నగరం.. అత్యుత్తమ మేనేజ్‌మెంట్ విద్యకు.. శిఖరంలా భాసిల్లుతోంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)- కోల్‌కతా ఇక్కడే కొలువు దీరింది. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎం) ద్వితీయ సంవత్సరం చదువుతున్న పల్లా రవితేజ తన క్యాంపస్ లైఫ్‌ను మనతో పంచుకుంటున్నారు. వివరాలు..
ఐఐటీ - మద్రాస్‌లో బీటెక్ చేశా
మాది వైజాగ్. నాన్న రైల్వే డీఎస్పీగా పనిచేస్తున్నారు. అమ్మ గృహిణి. తమ్ముడు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)- ఖరగ్‌పూర్‌లో కెమికల్ ఇంజనీరింగ్ చదువు తున్నాడు. నేను ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు వైజాగ్‌లో నే విద్యనభ్యసించాను. స్కూల్ డేస్‌లో వివిధ పోటీల్లో పతకాలు కూడా వచ్చాయి. పదో తరగతిలో (ఐసీఎస్‌ఈ సిలబస్) 92 శాతం మార్కులు, ఇంటర్మీడియెట్‌లో 911 మార్కులు సాధించాను. తర్వాత జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 236వ ర్యాంకుతో ఐఐటీ మద్రాస్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చదివాను. 6.82 సీజీపీఏతో బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించాక.. ఏడాదిపాటు పుణెలోని టాటా మోటార్స్‌లో సిస్టమ్ మేనేజర్ గా పనిచేశాను. ఆ తర్వాత కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)లో విజయం సాధించి ఐఐఎం - కోల్‌కతాలో చేరాను.
దేశంలో మొదటి ఐఐఎం- కోల్‌కతా
మేనేజ్‌మెంట్‌లో పీజీ కోర్సులు, పరిశోధనల కోసం దేశంలోని 13 ఐఐఎంల్లో తొలిగా ఏర్పడిన ఇన్‌స్టిట్యూట్.. ఐఐఎం- కోల్‌కతా. 1961లో నాటి కేంద్ర ప్రభుత్వం.. ఫోర్డ్ ఫౌండేషన్, భారతీయ పరిశ్రమల సమాఖ్య, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం, ఆల్ఫెడ్ పి. సోలన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సహకారంతో ఐఐఎంను ఏర్పాటు చేసింది. ఇక్కడ వివిధ స్పెషలైజేషన్లలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్, డాక్టోరల్ ప్రోగ్రామ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఎగ్జిక్యూటివ్స్ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి.
సకల సదుపాయాలతో అలరారే క్యాంపస్
క్యాంపస్ మొత్తం 135 ఎకరాల్లో ఉంటుంది. కమలాలతో విలసిల్లే ఎన్నో చెరువులు, పచ్చని గడ్డి మైదానాలు, వృక్షాలతో.. ఉద్యానవనంలా కనిపిస్తోంది. విశాలమైన తరగతి గదులు ఉంటాయి. విద్యార్థులు చదువుకోవడానికి తెల్లవార్లూ తెరిచి ఉండే లైబ్రరీ, 750మందికి పైగా కూర్చొనే సౌకర్యం గల ఆడిటోరియం, క్రీడా మైదానం.. క్యాంపస్‌కే ప్రధాన ఆకర్షణ లు. ప్రవేశం లభించిన ప్రతి విద్యార్థికీ హాస్టల్ సదుపాయం కల్పిస్తారు. అల్పాహారం, భోజనం బాగుంటుంది. ఇన్‌స్టిట్యూ ట్ అంతా వై-ఫై సౌకర్యం ఉంది.
స్పెషలైజేషన్లు ఎన్నో
రెండేళ్ల పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎం) కోర్సులో భాగంగా ఎన్నో స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. మొదటి ఏడాది అందరికీ కామన్‌గా అన్ని అంశాలపై అవగాహన కల్పిస్తారు. రెండో సంవత్సరంలో విద్యార్థులు తమకు నచ్చిన స్పెషలైజేషన్‌ను ఎంచుకోవచ్చు. లేదంటే అందుబాటులో ఉన్న అన్ని స్పెషలైజే షన్లను చదివే అవకాశం ఉంటుంది. ట్రైమిస్టర్ విధానంలో కోర్సు ఉంటుంది. ఏడాదికి మూడు ట్రైమిస్టర్లు ఉంటాయి. ప్రతి ట్రైమిస్టర్‌లో పరీక్షలు ఉంటాయి.
సమస్యల అధ్యయనం..
మేనేజ్‌మెంట్ అంటేనే.. నిర్వహణ, సమస్యలను పరిష్కరించడం. ఇందుకు అనుగుణంగానే ఇక్కడ బోధన ఉంటుంది. ఉదయం 8.30 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు క్లాసులుంటాయి. ఈ సమయంలో వీలును బట్టి తరగతులు నిర్వహిస్తారు. ఒక్కో పీరియడ్ వ్యవధి గంటన్నర. సాధారణంగా వారానికి 12 క్లాసులు ఉంటాయి. థియరీతో పాటు ప్రాక్టికల్స్‌కు పెద్దపీట వేస్తారు. కేస్ స్టడీస్‌ను ఎక్కువగా అధ్యయనం చేస్తుంటాం. అంతేకాకుండా ప్రస్తుతం వివిధ కంపెనీల్లో తలెత్తుతున్న సమస్యలను కేస్ స్టడీస్‌గా తీసుకుని పరిష్కార మార్గాలను అన్వేషిస్తాం. తద్వారా సంబంధిత సమస్య మాకు ఎదురైతే ఎలా ఎదుర్కోగలమో తెలుసు కుంటాం. స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్‌లో భాగంగా వేరే ఇన్‌స్టిట్యూట్‌లను సందర్శిస్తుంటాం. వీటి ద్వారా వివిధ అంశాలపై శిక్షణ పొందుతాం. ఏటా సమ్మర్‌లో రెండు నెలల పాటు ఇంటర్న్‌షిప్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ.50,000 వరకు స్టెఫండ్ అందిస్తారు.
ఇంక్యుబేషన్.. ఇన్నోవేషన్
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం వద్దనుకుని.. యువ వ్యాపారవేత్తలుగా రాణించాలనుకునేవారి కోసం ప్రత్యేకంగా ఇంక్యుబేషన్ సెల్ ఉంది. కొత్త స్టార్టప్‌ను ప్రారంభించాలను కునేవారికి ఆఫీసు కోసం కార్యాలయం కేటాయిస్తారు. స్టార్టప్ విజయవంతం కావడానికి కావాల్సిన సూచనలు, సలహాలు, సాంకేతిక సహకారం కూడా అందిస్తారు. స్టార్టప్‌కు అవసరమైన ఆర్థిక వనరులను కూడా సమకూరుస్తారు. ఇంక్యుబేషన్ సెంటర్‌తోపాటు ఇన్నోవేషన్ పార్క్ కూడా ఉంది. ఇక్కడ వివిధ సమస్యలను అధ్యయనం చేస్తుంటారు. గత ఐదేళ్ల నుంచి ఇప్పటివరకు క్యాంపస్‌లో 40కు పైగా స్టార్టప్‌లు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.
అలుమ్ని అసోసియేషన్ సేవలెన్నో
క్యాంపస్‌లో విద్యనభ్యసించి వివిధ కంపెనీల్లో మంచి హోదాల్లో ఉన్నవారు.. సొంతంగా వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్నవారి నుంచి ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహం ఉంటుంది. ప్రతి డిసెంబర్‌లో పూర్వ విద్యార్థులు క్యాంపస్‌ను సందర్శి స్తుంటారు. ప్రస్తుత విద్యార్థులకు వివిధ అంశాలపై గెస్ట్ లెక్చర్స్ కూడా ఇస్తారు. విజయవంతమైన గ్రాడ్యుయేట్‌గా, మేనేజర్‌గా ఎదగడానికి సూచనలు, సలహాలు అందిస్తారు. ప్లేస్‌మెంట్స్ విషయంలోనూ సహాయపడతారు. http:// alumninet.iimcal.ac.in/ద్వారా నిత్యం పూర్వ విద్యార్థులతో అందుబాటులో ఉండొచ్చు.
ప్రతిభావంతులకు పురస్కారాలు
పీజీడీఎం కోర్సు రెండేళ్లలో అన్ని ఖర్చులు కలుపుకుని దాదాపు రూ.20 లక్షలు అవుతుంది. అయితే ప్రవేశం లభించిన విద్యార్థులకు ఎలాంటి గ్యారెంటీ, సెక్యూరిటీ అవసరం లేకుండానే బ్యాంకులు రుణాలిస్తున్నాయి. ప్రతిభావంతులకు నగదు పురస్కారాలను కూడా ఇన్‌స్టిట్యూట్ అందిస్తోంది. క్యాంపస్‌లో తరచుగా నిర్వహించే బిజినెస్ కాంపిటీషన్స్‌లో బెస్ట్ ఐడియాలు ఇచ్చినవారికి నగదు బహుమతులు కూడా ఉంటాయి. ఇవేకాకుండా ప్రతి ఏటా జనవరిలో మేనేజ్‌మెంట్ ఫెస్ట్, ఫిబ్రవరిలో కల్చరల్ ఫెస్ట్ కూడా నిర్వహిస్తారు. ఇందులో విజేతలకు వివిధ బహుమతులు ఇస్తారు.
లెక్కకు మిక్కిలి.. ప్లేస్‌మెంట్స్
ఐఐఎంలు అంటేనే.. భారీ వేతనాలు అందించే ప్లేస్‌మెంట్స్‌కు పెట్టింది పేరు. ప్రతి ఏటా వేసవిలో ఎన్నో కంపెనీలు, పరిశ్రమలు ఇన్‌స్టిట్యూట్‌లో ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తాయి.
విశాఖలో కంపెనీ ఏర్పాటు చేస్తా
ప్రస్తుతానికి నా లక్ష్యం.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో మంచి ఉద్యోగం సాధించడం. పదేళ్లపాటు ఉద్యోగం చేసి ఆర్థికంగా నిలదొక్కుకున్నాక.. విశాఖపట్నంలో సొంతంగా ఏదైనా కంపెనీని ఏర్పాటు చేస్తా.
కేస్ స్టడీస్‌కు ప్రాధాన్యం ఎక్కువ
Published Mon, Sep 8 2014 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM
Advertisement
Advertisement