చెవుల్లోపల ఒస్సికల్స్ అని మూడు చిన్న చిన్న ఎముకలుంటాయి. ఇవి శబ్దాల ద్వారా పుట్టే ప్రకంపనలను కర్ణభేరి నుంచి కాక్లియా ఇయర్ డ్రమ్ నుంచి కాక్లియాకు ప్రసారం చేస్తాయి. ఏ కారణం చేతనైనా ఇవి దెబ్బతింటే బధిరత్వం వచ్చేస్తుంది. అయితే త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు ఈ పరిస్థితి మారనుంది. ఇప్పటివరకూ ఈ మూడు చిన్న ఎముకల స్థానంలో ఉక్కు లేదా పింగాణి భాగాలను అమర్చడం ద్వారా చికిత్స అందిస్తున్నా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. ఈ కృత్రిమ భాగాలు తగిన సైజులో లేకపోవడం దీనికి కారణం. ఈ నేపథ్యంలో మేరీల్యాండ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ ఒస్సికల్స్‌ను నేరుగా త్రీడీ ప్రింటర్ ద్వారా తయారు చేసేందుకు ప్రయత్నించారు.
మృతదేహాల నుంచి సేకరించిన మూడు ఒస్సికల్ ఎముకలను సీటీ స్కాన్ ద్వారా ఫొటో తీశారు. ఆ స్కాన్లను ఓ చౌక త్రీడీ ప్రింటర్ ద్వారా రెజిన్ పదార్థంతో ముద్రించారు. ఎముకలను సేకరించిన మృతదేహాలకు వీటిని కచ్చితంగా అమర్చగలిగారు. దీంతో ఉక్కు, పింగాణీ పదార్థాలతో కాకుండా.. మన శరీరానికి సరిపడే ఇతర పదార్థాలతో వీటిని త్రీడీ ప్రింటర్ ద్వారా ముద్రించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒక్కో వ్యక్తి శారీరక నిర్మాణానికి అనుగుణంగా కచ్చితమైన ఆకారంలో ముద్రించే వీలు ఉండటం వల్ల సమీప భవిష్యత్తులో ఈ రకమైన బధిరత్వ సమస్యను సులువుగా అధిగమించే వీలేర్పడుతుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment