అమ్మ మాట... అమృత తుల్యం!
ఆత్మీయం
బిడ్డకు తల్లే తన తొలి గురువు. అమ్మ ఏమి చెబితే, అది అక్షరాలా ఆచరిస్తారు. అమ్మను చూసి అనుసరిస్తారు. ఎందరో ప్రముఖులు బాల్యంలో తల్లి చెప్పిన మాట విని, దానిని అక్షరాలా ఆచరించి, ఆ తరువాత గొప్పవారయ్యారు. అందుకు కొన్ని ఉదాహరణలు చూద్దాం. గాంధీగారు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఒకరోజు ఓడలో విదేశాలకు బయల్దేరబోతున్నారు. పరస్త్రీ సంగమం ఎన్నటికీ చేయనని తనకు మాటివ్వమని అడిగి తల్లి పుత్లీబాయ్ ప్రమాణం చేయించుకుంది. కొన్నేళ్ళ తరువాత ఒకసారి ఆయన చెయ్యకూడని పొరబాటు చేయడానికి వెళ్ళి అంగుళం దూరంలో ఉన్నప్పుడు అమ్మకిచ్చిన మాట గుర్తొచ్చి సర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇదంతా స్వయంగా ఆయన తన జీవిత చరిత్రలో నిజాయితీగా రాసుకున్నారు. అంత నిగ్రహం చూపి అలా వెనుకకు తిరిగి వెళ్ళిపోయిన కారణానికి ఆయన తరువాత కాలంలో మహాత్ముడయ్యాడు.
జాతిపిత అని, దేశప్రజల చేత ‘తండ్రీ’ అని పిలిపించుకోలిగాడు. తల్లి జీజీబాయ్ నూరిపోసిన దేశభక్తి, సనాతన ధర్మ పరిరక్షణ హితోక్తులతో శివాజీ మహరాజ్ సామ్రాజ్య స్థాపన చేసి, గోసంరక్షణ చేసి శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ అమ్మవారి అనుగ్రహంతో భవానీ ఖడ్గాన్ని కూడా పొందగలిగాడు. అమ్మ మాట అమృతతుల్యం. అమ్మ వాక్కు బ్రహ్మ వాక్కు. ‘అమ్మ’ కు ఈ వేదభూమి, ఈ దేశం ఇచ్చిన గౌరవం అది. ఆ తరమయినా, ఈ తరమయినా, ఏతరమయినా సనాతన ధర్మ పరిరక్షణ అమ్మ చేతుల్లోనే ఉంది, అమ్మల చేతల్లోనే ఉంది. అందుకే అమ్మను గౌరవిద్దాం. ఆదరిద్దాం. ప్రేమిద్దాం. బాల్యంలో అమ్మ పెట్టిన గోరుముద్దలు తిన్నాం... పెద్దయ్యాక ‘అమ్మ మాట బోరు’ అనకుండా విందాం. ఆమ్మ కోరిక తీరుద్దాం.