దైవం... ప్రేమ స్వరూపం
చింతన
మానవుని ప్రేమ షరతులతో కూడుకున్నది. అందుకే అనేక సందర్భాలలో అది విఫలం అవుతుంది. కానీ దేవుని ప్రేమ అనంతమైనది, షరతులు లేనిదీ. ‘నాకు లాభం కలిగితే అందులో కొంత నీకు చెల్లిస్తాను’ అని దేవునికి ప్రతిఫలం ఇవ్వజూపేవారు మనలో కొందరుంటారు. అయితే దేవుడు మన నుండి ఏమీ ఆశించకుండా ప్రేమిస్తున్నాడని మనం గ్రహించాలి. ఎందుకంటే ఈ సర్వ సృష్టి, సకల సంపదలు దేవునివే. ఆయన కలుగజేస్తే ఉద్భవించినవే. భగవంతుడు ప్రేమమయుడని భగవద్గీత, పురాణాలు అభివర్ణిస్తున్నాయి. దుర్మార్గుల పట్ల కూడా దేవుడు తన ప్రేమను కనబరిచి, వారు త్వరగా సన్మార్గంలోకి రావాలని ఆశిస్తాడు. తండ్రి తన బిడ్డల్లో ఎవరైనా తప్పు చేస్తే వారిని సరి చేయాలని చూస్తాడు తప్ప, నాశనం చేయాలనుకోడు.
మతం పేరిట నేడు కొందరు హింసకు పాల్పడుతున్నారు. ఈ హింస, ద్వేషం, అరాచకత్వం అన్నీ దుష్ట లక్షణాలు. దైవానికి సంబంధించినవి కావు. ఒకవేళ ద్వేషం దేవుని లక్షణమైతే, ఈ పాటికి సర్వ ప్రపంచం ఆయన ఉగ్రతకు నాశనమై ఉండేది.
దేవుడు ప్రేమ స్వరూపి కనుక మనం కూడా ఒకరి పట్ల ఒకరం ప్రేమగా మెలిగినప్పుడు ఆయనకు మనం అత్యంత ప్రీతిపాత్రులం అవుతాం.
- యస్. విజయ భాస్కర్