వదిలించుకుని వచ్చేశాక...
ఇష్టం లేని దాన్ని ధైర్యంగా వదిలించుకున్న అమ్మాయిలకు నిజంగా ప్రభుత్వాలు ఏదైనా అవార్డు ఏర్పాటు చేయాలి. ఇష్టమైన దాన్ని ఎలాగో కష్టపడి సాధించుకోవచ్చు. ఇష్టం లేని దాన్ని వదిలించుకోడానికే పెద్ద ఫైట్ చెయ్యాలి. వదిలించుకున్నాక కూడా ఆ ఫైట్‌ని కొనసాగిస్తూనే ఉండాలి. అందుకే అవార్డు! ఇష్టం లేని ప్రేమ, ఇష్టం లేని పెళ్లి, ఇష్టం లేని భర్త, ఇష్టం లేని ఉద్యోగం వదిలేసి కొత్తగా షిఫ్ట్ అవడం స్త్రీ జీవితంలో పెద్ద సాహసం. వద్దనుకుని వదిలించుకున్నది కూడా విడిచిన బట్టల మూటలా వెనకే వచ్చేస్తుంటుంది! ‘నాకు ఇష్టం లేదు’ అని చెప్పేస్తే.. ప్రేమిస్తున్నవాడు ప్రేమించడం మాని టార్చర్ మొదలు పెడతాడు. ‘నాకీ పెళ్లి ఇష్టం లేదు’ అంటే, ఉగ్గుపాలు పట్టినంత తేలిగ్గా పేరెంట్స్ కూతురుపై పగ బడతారు. ‘నీతో ఇక కలిసి ఉండలేను’ అని భర్త నుండి విడిపోయివస్తే..
నాతోనే కాదు అసలెక్కడా ఉండేందుకు వీల్లేకుండా చేస్తానంటూ మనశ్శాంతిని హరిస్తాడు. వదిలేసుకున్న ఉద్యోగం కూడా రోజూ ఏదో ఒక టైమ్‌లో.. మాణింగ్ బ్రేక్ ఫాస్ట్‌కో, లంచ్ అవర్‌కో, రాత్రి డైనింగ్ టేబుల్ మీదకో వచ్చేసి పరామర్శించి వెళుతుంది. ముందు - ‘ఎలా ఉన్నావ్?’ అంటుంది. తర్వాత - ‘చూశావా ఎంత తప్పు చేశావో’ అంటుంది. ఇలాంటివన్నీ ఉంటాయని తెలిసీ ఇష్టం లేని దాన్ని వదిలించుకుని వచ్చేసిందీ అంటే.. అలాంటి అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే.. ప్రభుత్వాలైనా, పక్కనే ఉంటున్న మనమైనా!
హార్పర్ లీ అమెరికా అమ్మాయి. లా చదువుతోంది. ఎయిర్‌లైన్స్‌లో రిజర్వేషన్ క్లర్కుగా పని చేస్తోంది. అవి రెండూ ఆమెకు ఇష్టం లేదు. పుస్తకాలు చదవడం ఇష్టం. క్రియేటివ్‌గా ఏదైనా రాయడం ఇష్టం. ఏం చేయాలి? వదలించుకుంది. ‘లా’ని, క్లర్కు ఉద్యోగాన్నీ వదలించుకుని.. తనలోంచి తను బయటికి వచ్చేసింది. చేతిలో డబ్బుల్లేవు. ఇద్దరు ఫ్రెండ్స్ మాత్రం ఉన్నారు. మైఖేల్, జాయ్ బ్రౌన్. క్రిస్మస్ కానుకగా లీ కి వాళ్లు కొంత డబ్బు ఇచ్చారు. ఉద్యోగానికి వెళ్లనవసరం లేనంత డబ్బు. తీరిగ్గా కూర్చొని ఒక నవల రాసుకోడానికి నెమ్మదినిచ్చేంత డబ్బు. లీ ఎంతో తెగింపుతో చదువుని, ఉద్యోగాన్ని వదిలించుకుంది కదా అని అమెరికన్ గవర్నమెంటు ఆమెకు అవార్డేమీ ఇవ్వలేదు కానీ, వదిలించుకుని వచ్చాక ఆమె రాసిన పుస్తకం ‘టు కిల్ ఎ మాకింగ్‌బర్డ్’కు మాత్రం పులిట్జర్ అవార్డు వచ్చింది. అమెరికాలో పౌర హక్కుల ఉద్యమం మొదలైనప్పుడు విడుదలైన ఆ పుస్తకం మూడు కోట్ల కాపీలు అమ్ముడయింది. 20 వ శతాబ్దపు క్లాసిక్ గా నిలిచిపోయింది. అదే పేరుతో సినిమాగా వచ్చింది. ఆ సినిమాకు బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్టర్. బెస్ట్ స్క్రీన్ అడాప్షన్ ఆస్కార్‌లు వచ్చాయి. ‘ఎ గిఫ్ట్ టు ది ఎంటైర్ వరల్డ్’ అని జార్జిబుష్ ఆమె పుస్తకాన్ని ప్రశంసించారు.
అయితే లీ కి ఇవన్నీ లెక్క కాదు. తను రాయదలచుకున్నది రాశారు. ‘చదివితే చదివారు లేకపోతే లేదు’ అనుకుని రాశారు. పదేళ్ల వయసులో 1936లో తను చూసిన, తను అర్థం చేసుకున్న సంఘటలకు పాత్రలను అల్లుకుని ‘టు కిల్ ఎ మాకింగ్‌బర్డ్’ రాశారు. ఒక తెల్లజాతి టీనేజ్ అమ్మాయిపై అత్యాచారం జరిపాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక నల్లజాతి పౌరుడి తరఫున ఒక తెల్లజాతి న్యాయవాది కోర్టులో వాదించడం కథ. మాకింగ్ బర్డ్ అమాయకత్వానికి సంకేతం. చూడ్డానికి మన పిచ్చుకలా, గొంతు శ్రావ్యంగా ఉంటుంది. మాకింగ్‌బర్డ్‌ని నవల్లోని నల్లజాతి వ్యక్తికి సింబలైజ్ చేశారు హార్పర్ లీ.
లీ తన 30 ఏళ్ల వయసులో ఈ నవల రాశారు. ఇదొక్కటే రాశారు. ఈ నెల 19న ఆమె తన 89వ యేట నిద్దట్లోనే చనిపోయారు.
లీ అవివాహిత. మితభాషి. 1964 నుంచి ఇంటర్వ్యూలు ఇవ్వడం, బయటికి రావడం మానేశారు. పదేళ్ల క్రితం మాత్రం ఒక పత్రికకు ఇచ్చిన చిన్న వ్యాసంలో.. ‘ఇప్పుడు.. ఈ డెబ్బై ఐదేళ్ల తర్వాత.. ఈ లాప్‌ట్యాప్‌లు, సెల్‌ఫోన్లు, ఐపాడ్‌ల కాలంలోనూ.. పుస్తకాలతోనే నేను గడుపుతున్నాను’ అని రాశారు హార్పర్ లీ. కొన్నిటిని వదులుకున్నందుకే కాదు, కొన్నిటిని వదులుకోనందుకూ మహిళలకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మహిళలకే ఎందుకంటే.. ఇష్టమైన వాటికి దగ్గరగా వెళ్లడం కన్నా, ఇష్టం లేనివాటికి దూరంగా జరగడం.. వాళ్లకు కష్టమైన పని కాబట్టి.
-మాధవ్ శింగరాజు