పులిట్జర్ విజేత హార్పర్ లీ కన్నుమూత
న్యూయార్క్: పులిట్జర్ ప్రైజ్ విజేత, అమెరికన్ నవలా రచయిత హార్పర్ లీ(89) కన్నుమూశారు. ఈ విషయాన్ని అలబామా, మోన్రోవిల్లే మేయర్ కార్యాలయం అధికారికంగా ధ్రువీకరించింది. ఆమె 1926 ఏప్రిల్ 28న అలబామా, మోన్రోవిల్లేలో జన్మించారు. 1960లలో 'టు కిల్ ఎ మాకింగ్ బర్డ్' రచన తన కెరీర్ ను ఓ దశకు తీసుకెళ్లింది. ఈ నవల హాట్ కెకుల్లా అమ్ముడవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడం విశేషం.
ఆ నవలకుగానూ ఆమె ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ అవార్డును సొంతం చేసుకున్నారు. 'టు కిల్ ఎ మాకింగ్ బర్డ్' నవల 4 కోట్ల కాపీలు అమ్ముడుపోయింది. ప్రముఖ రచయిత్రి మృతి పట్ల యాపిల్ సీఈవో టీమ్ కుక్ సంతాపం ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. రైటర్ మలోరి బ్లాక్మన్, తదితర ప్రముఖులు హార్పర్ లీ మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ ఆమె గొప్పతనాన్ని ప్రశంసించారు.