‘పరమక్రూర చక్ర’వర్తి
చరిత్రలో దేశ దేశాలను ఏలిన చక్రవర్తులు, మహారాజులలో చాలామంది వీరులు, శూరులు ఉన్నారు. వారిలో కొందరు క్రూరులు కూడా లేకపోలేదు. శౌర్యం కంటే క్రౌర్యాన్ని ఎక్కువగా ప్రదర్శించిన వారిలో బ్రిటిష్ చక్రవర్తి ఎనిమిదో హెన్రీ ముందు వరుసలో నిలుస్తాడు. ఇతగాడికి ‘పరమక్రూర చక్ర’ బిరుదు ఇవ్వవచ్చని చరిత్రకారుల అభిప్రాయం. చరిత్రలో పరమక్రూర, ఘోర, దుర్మార్గ చక్రవర్తులెవరనే దానిపై అంతర్జాతీయ చరిత్ర రచయితల సంఘం జరిపిన అభిప్రాయ సేకరణలో ‘పరమక్రూర చక్ర’ బిరుదుకు ఎనిమిదో హెన్రీనే అన్ని విధాలా అర్హుడంటూ ఇరవై శాతం మంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.
ఆయన తర్వాత పద్నాలుగు శాతం ఓట్లతో ఎనిమిదో ఎడ్వర్డ్, చెరో ఎనిమిది శాతం ఓట్లతో ఒకటో చార్లెస్, ఒకటో జాన్ ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో నిలిచారు. ‘పరమక్రూర చక్ర’వర్తుల్లో అగ్రస్థానంలో నిలిచిన ఎనిమిదో హెన్రీ దొరవారు తన ఆరుగురు భార్యల్లో ఇద్దరికి శిరచ్ఛేదం విధించిన దయాళువు. అంతేకాదు, వందలాది మంది పౌరులకు కూడా మరణశిక్షలతో ముక్తి ప్రసాదించేవాడు ఈ మహానుభావుడు.