Monarchs
-
‘పరమక్రూర చక్ర’వర్తి
చరిత్రలో దేశ దేశాలను ఏలిన చక్రవర్తులు, మహారాజులలో చాలామంది వీరులు, శూరులు ఉన్నారు. వారిలో కొందరు క్రూరులు కూడా లేకపోలేదు. శౌర్యం కంటే క్రౌర్యాన్ని ఎక్కువగా ప్రదర్శించిన వారిలో బ్రిటిష్ చక్రవర్తి ఎనిమిదో హెన్రీ ముందు వరుసలో నిలుస్తాడు. ఇతగాడికి ‘పరమక్రూర చక్ర’ బిరుదు ఇవ్వవచ్చని చరిత్రకారుల అభిప్రాయం. చరిత్రలో పరమక్రూర, ఘోర, దుర్మార్గ చక్రవర్తులెవరనే దానిపై అంతర్జాతీయ చరిత్ర రచయితల సంఘం జరిపిన అభిప్రాయ సేకరణలో ‘పరమక్రూర చక్ర’ బిరుదుకు ఎనిమిదో హెన్రీనే అన్ని విధాలా అర్హుడంటూ ఇరవై శాతం మంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. ఆయన తర్వాత పద్నాలుగు శాతం ఓట్లతో ఎనిమిదో ఎడ్వర్డ్, చెరో ఎనిమిది శాతం ఓట్లతో ఒకటో చార్లెస్, ఒకటో జాన్ ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో నిలిచారు. ‘పరమక్రూర చక్ర’వర్తుల్లో అగ్రస్థానంలో నిలిచిన ఎనిమిదో హెన్రీ దొరవారు తన ఆరుగురు భార్యల్లో ఇద్దరికి శిరచ్ఛేదం విధించిన దయాళువు. అంతేకాదు, వందలాది మంది పౌరులకు కూడా మరణశిక్షలతో ముక్తి ప్రసాదించేవాడు ఈ మహానుభావుడు. -
రోమన్ ‘బాల’రాజు లీలలు
సుదీర్ఘ చరిత్ర కలిగిన రోమన్ సామ్రాజ్యంలో వింతలూ విడ్డూరాలూ తక్కువ కాదు. రోమన్ సామ్రాజ్యాన్ని ఏలిన కాలిగ్యులా, నీరో వంటి చక్రవర్తులు తమ సుపరిపాలన వల్ల కాకుండా, విచిత్ర ప్రవర్తన కారణంగా విఖ్యాతి చెందారు. రోమన్ సామ్రాజ్యాన్ని క్రీస్తుశకం 218 నుంచి 222 వరకు ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన ఎలగబాలస్ అనే ‘బాల’రాజు కూడా అలాంటి పిచ్చిమారాజే! ఇతగాడి అసలు పేరు మార్కస్ అలేరియస్ ఆంటోనినస్ అగస్టస్. అధికారంలోకి రావడానికి ముందు సిరియాలోని ఎమెసా పట్టణంలో పూజారిగా ఉండేవాడు. అనుకోని పరిస్థితుల్లో సెనేట్ మద్దతు కూడగట్టుకుని, పద్నాలుగో ఏటనే రోమన్ సామ్రాజ్యానికి చక్రవర్తి కాగలిగాడు. నిండా నాలుగేళ్లయినా అధికారంలో లేడు గానీ, పాలించిన ఆ కొన్నేళ్లూ జనాన్ని చిత్ర విచిత్రంగా కాల్చుకుతిన్నాడు. ఈ దయగల ప్రభువు ఆత్మహత్యలు చేసుకోదలచిన వారి కోసం ప్రత్యేకంగా ఒక టవర్ను కూడా నిర్మించాడు. మహిళల కోసం ప్రత్యేకంగా సెనేట్ ఏర్పాటు చేశాడు. విరివిగా నరబలులు ఇచ్చేవాడు. ఆ విధంగా తనకు నచ్చని వాళ్లను పరలోకానికి సాగనంపేవాడు. ఇతగాడి దాష్టీకాన్ని తట్టుకోలేని సెనేట్ పెద్దలు, సైన్యం బలవంతంగా ఈ ‘బాల’రాజును గద్దెదించారు. తిరుగుబాటుకు జడిసి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకుని చంపేశారు.