బుద్ధం.. శరణం.. చందవరం
రామాలయం, శివాలయం తదితర ఆలయాలు ప్రతి ఊళ్లో కనిపిస్తాయి. కానీ, బౌద్ధారామాలు దేశంలో చాలా తక్కువ. ఆంధ్రరాష్ట్రంలో మరీ తక్కువ. అలాంటి అరుదైన బౌద్ధారామం ఒకటి ప్రకాశం జిల్లాలో ఉంది. ప్రకాశం జిల్లా దొనకొండ మండలానికి చెందిన ఈ గ్రామం పేరు చందవరం. ఈ గ్రామం గొప్ప బౌద్ధారామంగా ప్రసిద్ధి చెందింది. కర్నూలు-గుంటూరు రాష్ట్ర రహదారిలో త్రిపురాంతకం మండలం వెల్లంపల్లికి 7 కిలోమీటర్ల దూరాన గుండ్లకమ్మ నది ఒడ్డున వెలసిన ఈ బౌద్ధారామం అతి ప్రాచీనమైనది. చందవరం ఒంగోలు నుంచి 75 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది.
కొండపైన బౌద్ధారామం...
రాష్ట్రంలోనే ప్రసిద్ధిచెందిన ఈ బౌద్ధారామాన్ని చందవరం బౌద్ధస్థూపం అని కూడా పిలుస్తుంటారు. 1965లో పురావస్తుశాఖ వారు జరిపిన తవ్వకాల్లో ఈ బౌద్ధ స్థూపం బయటపడింది. ఈ చందవరం స్థూపం క్రీస్తుశకం ఒకటి లేదా రెండు శతాబ్దాల నాటిదని తెలుస్తోంది. ఈ స్థూపం లభ్యమైన తర్వాత నాలుగు సార్లు తవ్వకాలు సాగించారు. ఆ తవ్వకాల్లో 15 పెద్ద స్థూపాలు, వందలాది చిన్న స్థూపాలు దొరికాయి. 1972లో రాష్ట్రపురావస్తుశాఖ ఈ ప్రాంతంలో నాలుగు దఫాలుగా తవ్వకాలు జరిపితే అనేక వందల చిన్నస్థూపాలు, 15 పెద్దస్థూపాలు బయల్పడ్డాయి. ఇక్కడ ఉన్న బౌద్ధ స్థూపం దాదాపు 200 అడుగుల ఎత్తుగల కొండపై ఉంది. ఈ స్థూపం చుట్టుకొలత దాదాపు 120 అడుగులు, 30 అడుగుల ఎత్తులో ఉంది.
నాటి విశ్రాంతి మందిరాలు..
బౌద్ధస్థూపం ఉత్తరాన ఉన్న ద్వారంలో ధ్యాన నిమగ్నుడైన బుద్ధుని పాలరాతి శిల్పం ప్రతిష్టించి ఉంది. బౌద్ధుల పగోడాను తలపించే నిర్మాణపు పునాదులు కూడా ఇక్కడ లభించాయి. బౌద్ధ భిక్షులు విశ్రాంతి తీసుకునే మందిరాల పునాదులూ ఈ ప్రాంతంలో ఉన్నాయి. గుండ్లకమ్మ నది పక్కన గల ఎత్తయిన కొండపైన బౌద్ధస్థూపం ఉన్న ప్రాంతాన్ని సింగరాకొండ అని కూడా అంటారు. ఇది రెండంతస్తుల స్థూపం. దక్షిణ భారత దేశంలో ఇలా ఉన్న ఏకైక స్థూపం ఇదే! ఇక్కడ ఒక మ్యూజియం నిర్మాణంలో ఉంది. ఈ కొండ మీద శిల్పాలను ప్రస్తుతం చందవరం మండల కార్యాలయంలో భద్రపరిచారు.
బౌద్ధమతం క్రమంగా క్షీణించడంతో ఇక్కడి బౌద్ధారామాలను కూలగొట్టి, అందులోని శిల్పాలు, రాళ్లు, మట్టి మొదలైనవాటిని చందవరంలోనే ఉన్న మహాబలేశ్వర ఆలయనిర్మాణానికి ఉపయోగించి ఉంటారని నిపుణుల అంచనా!
ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతవాసులే కాకుండా సుదూర ప్రాంతాల నుండి పర్యాటకులు ఈ అమూల్యమైన చందవరం బౌద్ధ స్థూపాన్ని దర్శించుకునేందుకు వస్తుంటారు. సాంచీ స్థూపాన్ని పోలి ఉండే చందవరం బౌద్ధ స్థూపం, గండికోట నది, చందవరం పర్వతంపై ఉన్న మరో స్థూపం ఇక్కడ చూడదగినవి.
దూపాడు బౌద్ధ స్థూపం
చందవరానికి మూడు మైళ్ల దూరంలో దూపాడు బౌద్ధ స్థూపం ఉంది. ఇది బాగా శిథిలం అయింది. స్థానికంగా దీనిని ద్వీపగడ్డ అని కూడా అంటారు. స్థూపం పైభాగంలో లోతైన రంధ్రం ఉంది. పురావస్తు శాఖ వారి తవ్వకపు గుర్తులు ఉన్నాయి. స్థానికులు దీనిని కోటదిబ్బ అని కూడా అంటారు. ఇదే జిల్లాలో చిన్న గంజాంలో కూడా ఒక బౌద్ధ స్థూపం ఉన్నట్టు ఇటీవల గుర్తించారు.
చందవరం ఇలా చేరుకోవచ్చు...
ఒంగోలు నుంచి రోడ్డుమార్గాన చందవరం చేరుకోవచ్చు. దొనకొండ నుండి చందవరం 14 కి.మీ. ఉంటుంది. దొనకొండ నుంచి ప్రైవేట్ వాహన సౌలభ్యమూ ఉంది.
- ఎన్.వేదాద్రి, ఎస్.జి.టి టీచర్, తెనాలి