ఏలూరు శివారులో బౌద్ధ స్థూప స్తంభాలు
శాతవాహనుల కాలం నాటివని అంచనా
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పరిసరాల్లో ఒకప్పుడు బౌద్ధం విలసిల్లిందనేందుకు బలమైన ఆధారాలు మరోసారి వెలుగు చూశాయి. వట్లూరు గ్రామ శివారులో బౌద్ధ స్థూపానికి చెందిన ఆయక స్తంభాలు, శిలామంటప స్తంభాలు బయటపడ్డాయి. శాతవాహనుల కాలానికి చెందినవిగా భావిస్తున్న ఈ స్థూప స్తంభాలు బౌద్ధస్థావరానికి చెందినవై ఉంటాయని భావిస్తున్నారు. ఏలూరు శివారులోని వట్లూరు గ్రామంలో ఇటీవల చెరువుకట్టకు మరమ్మతు చేస్తుండగా ఆరు స్తంభాలు బయటపడ్డాయి.
అడుగుభాగంలో అర్ధపద్మం, మధ్యలో పూర్ణపద్మం ఆకృతులు, వాటి చుట్టూ చూడముచ్చటైన నగిషీలు చెక్కి ఉన్నాయి. వీటిని గ్రామస్థులు స్థానిక భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద భద్రపరిచారు.