కెరీర్ కౌన్సెలింగ్ | Career Counseling | Sakshi
Sakshi News home page

కెరీర్ కౌన్సెలింగ్

Published Sun, Apr 27 2014 10:44 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

కెరీర్ కౌన్సెలింగ్ - Sakshi

కెరీర్ కౌన్సెలింగ్

నేను పదో తరగతి పూర్తి చేశాను. అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ లో చేరాలనుకుంటున్నాను. ఎంపిక ఏ విధంగా ఉంటుంది? కోర్సు పూర్తయ్యాక ఉండే అవకాశాలను వివరించండి?
 
పదో తరగతి పూర్తి చేసినవారికి చక్కని అవకాశం.. అగ్రికల్చరల్ పాలిటెక్నిక్. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి నిష్ణాతులైన సిబ్బంది అవసరం. ఉన్నత విద్యను అభ్యసించలేని గ్రామీణ ప్రాంత యువకులు స్వయంఉపాధిని పొందాలనే ఉద్దేశంతో అగ్రికల్చర్ కోర్సులను ప్రవేశపెట్టారు. ఇందులో రెండేళ్ల అగ్రికల్చర్, విత్తన సాంకేతిక పరిజ్ఞానం (సీడ్ టెక్నాలజీ), మూడేళ్ల అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి. మన రాష్ట్రంలో ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ వ్యవసాయ సంబంధమైన కోర్సులను అందిస్తోంది. ఈ యూనివర్సిటీకి అనుబంధంగా రాష్ట్రవ్యాప్తంగా అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి.
 
అర్హత: కనీసం 5.0 గ్రేడ్ పాయింట్ (ఎస్సీ, ఎస్టీ, శారీరక వికలాంగులకు 4.0 గ్రేడ్ పాయింట్)తో పదో తరగతి ఉత్తీర్ణత. విద్యార్థులు తమ పదేళ్ల విద్యా కాలంలో కనీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలి. ఇంటర్మీడియెట్, అంతకంటే ఎక్కువ చదివినవారు అర్హులు కాదు.
 ఎంపిక: పదో తరగతిలో గ్రేడ్ పాయింట్ ఆధారంగా.
 వయోపరిమితి: నిర్దేశిత తేదీ నాటికి 15-22 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
 
సీట్లు: దాదాపు 23 ప్రభుత్వ, 22 ప్రైవేటు కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో అగ్రి పాలిటెక్నిక్ (ప్రభుత్వ సీట్లు- 675, ప్రైవేటు సీట్లు-840), విత్తన సాంకేతిక పరిజ్ఞానం (ప్రభుత్వ సీట్లు - 85, ప్రైవేటు సీట్లు - 150), అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ (ప్రభుత్వ సీట్లు - 30, ప్రైవేటు సీట్లు - 150).
 
ఉన్నత విద్య:

అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, విత్తన సాంకేతిక పరిజ్ఞానం కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులు నాలుగేళ్ల బీఎస్సీ (అగ్రికల్చర్) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే అగ్రిసెట్ రాయొచ్చు. వయసు నిర్దేశిత తేదీనాటికి 17 ఏళ్లపైన ఉండాలి. గరిష్టంగా 22 ఏళ్లు మించరాదు. మొత్తం 93 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. బీఎస్సీ (అగ్రి) పూర్తయ్యాక ఎంఎస్సీ (అగ్రి), పీహెచ్‌డీ కూడా పూర్తి చేయొచ్చు.
 
ఉద్యోగావకాశాలు:

మన దేశం ప్రధానంగా వ్యవసాయాధారిత దేశం. పారిశ్రామికంగా దేశం పురోగమిస్తున్నప్పటికీ ఇప్పటికీ దేశ జనాభాలో 70 శాతం మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగం ఆధునికతను సంతరించుకుంటోంది. చీడపీడలను తట్టుకోగలిగి, ఎక్కువ దిగుబడినిచ్చే వంగడాలను వాడుతున్నారు. అంతేకాకుండా వ్యవసాయ పనుల్లో యంత్రాల వాడకం కూడా ఎక్కువైంది. ఈ నేపథ్యంలో సంబంధిత వ్యవసాయ పరికరాలు, విత్తన పరిజ్ఞానంపై అవగాహన ఉన్న నిపుణుల అవసరం ఏర్పడుతోంది. వ్యవసాయ రంగంలో అపార వృద్ధిని గమనించిన బహుళజాతి సంస్థలు కూడా సొంత వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు గ్రామీణాభివృద్ధికి.. అందులోనూ వ్యవసాయాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాయి. వీటన్నింటిలో వివిధ హోదాల్లో అవకాశాలుంటాయి. విత్తన కంపెనీలు కూడా వీరిని నియమించుకుంటున్నాయి. కాబట్టి వ్యవసాయ కోర్సులు పూర్తిచేసినవారికి మంచి అవకాశాలున్నాయని చెప్పొచ్చు. సొంత వ్యవసాయ భూమి ఉన్నవారికి ఈ కోర్సు ఎంతో ఉపయోగపడుతుంది.
 
అయితే ఉన్నతవిద్యపరంగా కేవలం బీఎస్సీ అగ్రిలో 93 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంటే ప్రతిఏటా దాదాపు 1900 మంది పాలిటెక్నిక్ అగ్రికల్చర్, సీడ్ టెక్నాలజీలలో కోర్సులు పూర్తిచేస్తే బీఎస్సీలో ఉన్న సీట్లు అతి స్వల్పం. బీఎస్సీ అగ్రిలో సీటురానివారు ఉన్నత విద్య చదివే అవకాశం లేదు. ఇంటర్‌లో మాత్రమే చేరే అవకాశం ఉంది. అగ్రికల్చర్ ఇంజనీరింగ్‌లో చేరినవారికి గ్రాడ్యుయేషన్ చేసే అవకాశం ఇంకా కల్పించలేదు. పాలిటెక్నిక్ స్థాయిలో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ప్రైవేటు రంగంలోనే ఉంటాయి. వీటిని విద్యార్థులు గుర్తుంచుకోవాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement