నవ్వుల సంతకం
రాగతి పండరి
నాకు తెలిసిన కార్టూనిస్టులందరూ క్రోక్విల్ పాళీ కలాన్ని ఇండియన్ ఇంకులో ముంచి డ్రాయింగు పేపరు మీద బొమ్మలు గీసే పద్ధతినే అనుసరిస్తారు. శ్రమపడతారు. అయితే సాదాసీదా పద్ధతితో, మామూలు స్కెచ్‌పెన్‌తో ఎంతో సునాయాసంగా బొమ్మలు గీసి కార్టూన్లు సృష్టించే వ్యంగ్య చిత్రకారులు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి కార్టూనిస్టుల్లో అందెవేసిన చేయి కుమారి రాగతి పండరి. ఆమె మేధస్సుల్లో ఐడియా తట్టగానే, ఒక స్కెచ్‌పెన్‌తో మామూలు తెల్లకాగితం మీద రఫ్ గీతలు కూడా గీయకుండా మొదలుపెడుతుంది. ఐదు పది నిముషాల్లో కార్టూన్ను రెడీ చేస్తుంది. పదహారణాల తెలుగు హాస్యానికి తెర పట్టిస్తుంది. నవ్వుల పెనుతుఫానును సృష్టిస్తుంది. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు రాగతి పండరి తన వేలాది కార్టూన్లతో లక్షలాది పాఠకులని తన కొన ఊపిరి దాకా రంజింప చేసింది. ఆమె అంతటి గొప్ప మహిళా కార్టునిస్టు మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా కనిపించరు. ఆమె మన తెలుగు జాతికి గర్వకారణం.
రాగతి పండరి కార్టూన్లు గీయడానికి ప్రారంభించిన తొలిదశలో నాకు ఉత్తరం రాసింది. ‘కార్ట్టూన్లు గీయడం ఎలా?’ అనడిగింది. అప్పట్లో నాకు తెలిసిన, నేను నేర్చుకున్న ‘ఓనమాలని’ ఆమెతో పంచుకున్నాను. అంతే! వాటితో సరిపెట్టుకుని తన అరంగేట్రాలు ప్రారంభించింది. అందరూ విస్తుపోయేలా విజృంభించింది. పండగలు, పబ్బాలు, అల్లుళ్ళు, ఆడపడుచులు, దొంగలు, పోలీసులు, ఆఫీసులు, పార్కులూ.... ఆమె తాకని సబ్జెక్టులేదు, లాగని తీగ లేదు, నడవని డొంక లేదు. స్వైర విహారమే. కార్టూనులో ఏ మూల వెదికినా తేట తెలుగుదనమే, ఏ చోట స్పృశించినా తేనెల తెలుగు మాటలే.
ఆమెను ఒకే ఒకసారి, ఆమె స్వగృహంలో కలిశాను. ఆమె నాకు గురుపూజలు చేసింది. అందుకు నేను అర్హుడినా అని ఈరోజు దాకా నన్ను నేను ప్రశ్నించుకుంటాను. ఆమె ఉత్తరం రాసినా, ఫోనులో పలకరించినా తనని నా శిష్యురాలుగానే ప్రకటించుకుంటుంది. నామీద ఆమె ఎనలేని ప్రేమాభిమానాలు పెంచుకుంది. ఆమె ప్రశంసల వలయం నుంచి తప్పించుకోవాలని, ఆమెకి ఉత్తరం రాశాను. ‘‘అమ్మా... నువ్వు స్వయంకృషితో కార్ట్టూనిస్టుగా నిలదొక్కుకున్నావు. నీకు గురువు నీవే... పైగా కార్టూనింగు ఒకరు నేర్పితే అబ్బే విద్యకాదు’’ అని. అయినప్పటికీ ఆమె ఎప్పుడూ చెప్పే ఒకేమాట ‘‘జయదేవ్ గారే నా గురువు!’’- ఇందుకు నేను చాలా గర్వపడాల్సిన అవసరం ఉంది. కళాప్రపూర్ణ, అసంఖ్యాక పాఠకుల మన్ననలందుకున్న, అనేక పురస్కారాలలంకరించుకున్న తెలుగు మహిళా కార్టూనిస్టు కుమారి రాగతి పండరి గురువునవడం, ఆ గుర్తింపు నాకు లభించడం... ఒక గంట ముందు ‘సాక్షి’ పత్రిక కార్యాలయం నుంచి వచ్చిన ఫోను ద్వారా నాకు అవగతమైంది. కుమారి రాగతి పండరి గురించి ప్రస్తుతం నేను రాస్తున్న వ్యాసం నన్ను దుఃఖసాగరంలో ముంచి ఉంది. రాగతి పండరి భౌతిక కాయాన్ని విడిచి వెళ్లిపోయింది. వెళ్లిపోతూ కూడా ‘‘సాక్షి’’ పత్రిక ద్వారా, నాకు గురుకీర్తిని మరొక్కసారి ప్రకటించుకుంది.
రాగతి పండరితో నేను ఫోటో దిగలేదు. ఆ అవకాశమే లభించలేదు. అయితే ఆమె నా గుండెలో తన చిత్తరువుని గట్టిగా లిఖించింది. ఆమె రాసిన ఉత్తరాలు, నా కార్టూన్ల కన్నా మిన్నగా జాగ్రత్తగా సేకరించి పెట్టుకున్నాను. ఆమె రాసిన కబుర్లు నా మనసును ఎల్లవేళలా పలకరిస్తూనే ఉంటాయి.
ఆమె ఆత్మశాంతించాలని సర్వేశ్వరుడ్ని ప్రార్థిస్తూనే ఉంటాను. ఆమె పేరు ప్రఖ్యాతులు శాశ్వతంగా ఉండిపోతాయి. సందేహం లేదు. ఆ మధ్య బాపుగారు, రాగతి పండరి అడ్రసు కావాలని నన్ను ఫోనులో అడిగారు. ‘‘అవసరం లేదు సార్... రాగతి పండరి, విశాఖపట్నం అని ఉత్తరం మీద రాయండి. ఆమెకి చేరిపోతుంది’’ అన్నాను. అంతేగదా... సంతకం అక్కర్లేని కార్టూనిస్టు గురించి విన్నాము. రాగతి పండరి, అడ్రసే అక్కర్లేని కార్టూనిస్టు!!
జయదేవ్ ప్రఖ్యాత కార్టూనిస్టు, చెన్నై