ragati pandari
-
మహిళా కార్టూనిస్టు రాగతి పండరి కన్నుమూత
విశాఖపట్నం: వ్యంగ్య చిత్రాలతో తెలుగు పాఠక లోగిళ్లను దశాబ్దాలపాటు గిలిగింత లు పెట్టిన మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి(50) గురువారం విశాఖపట్నంలో మృతి చెందారు. కొద్ది నెలలుగా ఆమె ఊపిరితి త్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలే ఆమె తల్లి శాంతికుమారి మృతి చెందటంతో సోదరుడు రామరాజు, సోదరి రమాతో కలసి ఉంటున్నారు. రాగతి పం డరి 1965 జూలై 22న విశాఖపట్నంలో జన్మించారు. చదువు ఇంటి వద్దనే కొనసాగింది. చిన్న వయసులోనే పోలియో సోకటంతో ఏర్పడిన శారీరక లోపం ఆమెలో పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ఇంట్లో సాహితీ అభిమానులు ఉండటం, పుస్తకాల సాయంతో బొమ్మలు గీయటం ఆరంభించారు. బాల్యంలోనే వారపత్రికల్లో ఆమె వ్యంగ్య చిత్రాలు ప్రచురితమయ్యాయి. రాశి లోనూ, వాసిలోనూ సమానమైన కీర్తి ప్రతిష్టలను ఆర్జించిన ఏకైక మహిళా కార్టూనిస్టుగా గుర్తింపు పొందారు. మహామహులను సైతం ఆమె ప్రతిభ ముగ్ధులను చేసింది. కార్టూన్లు సాధన చేసిన తొలి రోజుల్లో తాను గీసిన చిత్రాలను ఆమె చెన్నైలో నివసించే కార్టూనిస్టు జయదేవ్‌కు పంపారు. చాలాకాలం తరువాత జయదేవ్ జవాబు రాస్తూ ఆమె కార్టూన్లను మెచ్చుకుని సలహాలు, సూచనలు చేశారు. పండరి మొదటి కార్టూన్ ఆమె ఎనిమిదో ఏటే జ్యోతి వార పత్రికలో ప్రచురితమైంది. మొదటి కార్టూన్‌కు ఆమెకు లభించిన పారితోషికం నాలుగు రూపాయలు. ఇప్పటివరకూ 16 వేలకు పైగా కార్టూన్లు గీశారు. 2005లో రచన మాస పత్రికలో వినాయక చవితి సందర్భంగా ప్రచురితమైన పండరి కార్టూన్‌కు బాపు బొమ్మ గీశారు. బాపు, జయదేవ్‌ల శిష్యురాలిగా పండరి గుర్తింపు పొందారు. 2011లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెకు ‘కళారత్న’ పురస్కారాన్ని అందచేసింది. ఆమె రెండు పుస్తకాలు కూడా రచించారు. పండరి గీసిన రెండు వందల కార్టూన్లతో కూడిన ‘నవ్వుల విందు’ పుస్తకాన్ని ప్రచురించారు. 2008 లో ‘నాగురించి నేను’ ఆత్మకథ పుస్తకాన్ని ప్రచురించారు. అవయవ దానం: మరణానంతరం తన కళ్లు, ఇతర శరీర అవయవాలను దానం చేయాలని రాగతి పండరి సంకల్పించారు. ఈ మేరకు అవయవాల సేకరణకు వీలుగా ఆమె పార్థివదేహాన్ని ఆంధ్రప్రదేశ్ శరీర దాతల సంఘం రాష్ట్ర కమిటీకి ఆమె కుటుంబసభ్యులు అప్పగించినట్లు కమిటీ ప్రతినిధులు రామ్‌ప్రభ, బాలభానులు ఒక ప్రకటనలో తెలిపారు. చంద్రబాబు, వైఎస్ జగన్ సంతాపం సాక్షి, హైదరాబాద్: కార్టూనిస్టు రాగతి పండరి మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పలు వ్యంగ్య చిత్రాలతో తెలుగు పాఠకుల అభిమానాన్ని పండరి సొంతం చేసుకున్నారని జగన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
చెదిరిన గీత
దివికేగిన కార్టూన్ క్వీన్ తొలి మహిళా కార్టూనిస్టు రాగతి పండరి జీవితం విభిన్న భావాల మిళితం. అనేక అనుభూతుల సంగమం. హృదయానికి బాధ కలిగితే విషాదం వెల్లువవుతుంది. సంతోషం అతిశయిస్తే ఆనందం పల్లవిస్తుంది. చిలిపితనం పులకింతలు పెడితే పెదాలపై నవ్వు పరవళ్లు తొక్కుతుంది. నవ్వు టానిక్‌లా పని చేస్తుంది. యాంత్రిక జీవితంలో నిరాశను కాసేపైనా తరిమి కొట్టే కిక్ ఇస్తుంది. ఈ ‘గీతా’సత్యాన్ని రాగతి పండరి చిన్ననాటనే గ్రహించారు. తన జీవితంలో తొణికిన విషాదాన్ని పక్కకు నెట్టి పదిమందికీ నవ్వుల పూలు పంచిపెడుతూ బతుకును ధన్యం చేసుకున్నారు. తామేడుస్తూ ఎందరినో ఏడ్పించే వారు ఎక్కువయ్యే లోకంలో, తాను నవ్వుతూ పదిమందిని నవ్విస్తూ ఆ రంగంలో అగ్రగణ్యురాలిగా ఖ్యాతిని సొంతం చేసుకున్నారు. వైకల్యాన్ని ఓడించి ఆహ్లాదాన్ని అందరికీ పంచి పెడుతూ హాస్య ప్రపంచాన మకుటం లేని మహారాణిగా వెలుగొందిన రాగతి పండరి అభిమానులకు విషాదం మిగిల్చి జీవితం నుంచి సెలవు తీసుకున్నారు. విశాఖపట్నం-కల్చరల్: జీవితంలో అన్ని సదుపాయాలూ ఉండి, ముందుకు దూసుకుపోయే అవకాశాలు కలిగిన వారెందరో చతికిలబడుతూ ఉంటే ఆకాశమే అవధిగా రాగతి పండరి అద్భుతాలు సాధించారు. కేవలం ఎనిమిదేళ్ల వయస్సులో ఓ పత్రికలో కార్టూన్ ప్రచురితమయ్యే స్థాయిని సాధించారంటే అందుకు ఆమె సాధన, తపన ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. జిజ్ఞాస కొద్దీ నేర్చుకుంటూ, ఆసక్తి కొద్దీ గమనిస్తూ, తనకు తానుగానే సాధన చేస్తూ ఆమె ఉన్నత లక్ష్యాల దిశగా సాగిపోయారు. పాఠశాలకు వెళ్లి చదువుకునే పరిస్థితి లేని రాగతి పండరి, ఇంట్లో సోదరి చెప్పగా చదువు నేర్చుకున్నారు. తోచినట్టు గీతలు గీసి, అలాగే బొమ్మలు సాధన చేసి, క్రమంగా పూర్తి స్థాయి కార్టూనిస్టుగా ఎదగడానికి అవసరమైన సత్తా సంపాదించారు. ప్రముఖ కార్టూనిస్టు జయదేవ్ వ్యంగ్య చిత్రాలను పత్రికల్లో చూసి, మురిసిపోయి, తానుకూడా అదే రీతిలో నేర్పు సంపాదించాలని ఆరాటపడి... అలా నిర్విరామంగా బొమ్మలు గీసి, రాతలు రాసి ఓ స్థాయికి చేరుకున్నారు. చూడగానే ‘ఇది రాగతి పండరి కార్టూన్’ అన్న గుర్తింపు వచ్చేలా నేర్పు సంపాదించారు. తెలుగునాట తొలి మహిళా కార్టూనిస్టుగా ఖ్యాతి పొందారు. దేశంలోనూ ఈ ఖ్యాతికి ఆమె అర్హురాలే. ఎన్నో కార్టూన్లు... మరెన్నో శీర్షికలు పండరి మొదటి కార్టూన్ ఎనిమిదో ఏటే జ్యోతి వార పత్రికలో ప్రచురితమైంది. మొత్తం 16 వేలకు పైగా కార్టూన్లు వేశారు. వ్యంగ్య చిత్రాలకు సంబంధించి ఆమె కర స్పర్శ సోకని ప్రక్రియ లేదు. క్లిష్టమైన రాజకీయ కార్టూన్లను సుదీర్ఘ కాలం పాటు ‘రాజకీయ చెదరంగం’ శీర్షిక కింద గీసి ఆ విధంగా కూడా తనకు అవగాహన అనల్పమని రుజువు చేసుకున్నారు. నవగ్రహం- అనుగ్రహం పేరున ఇద్దరు అమ్మాయిల కార్టూన్ ఫీచర్, శ్రీమతి పేరున మహిళామణి స్ట్రిప్ కార్టూన్.. ప్రతి పండగకు ప్రత్యేక పేజీ కార్టూన్లు.. అవీ ఇవీ అని కాకుండా నిర్విరామంగా వ్యంగ్య చిత్రాలు సృజించారు. తెలుగులో అన్ని పత్రికలకు తన వ్యంగ్య చిత్రాల వెలుగులు పంచి ఇచ్చారు. తెలుగు కార్టూన్ సామ్రాజ్యానికి ఆమె మకుటం లేని మహారాణి అని జయదేవ్ చేత ప్రశంసలు పొందారు. ‘మీవి కేవలం కార్టూన్లే కాదు.. నేటి కాలపు తెలుగు మధ్యతరగతి వారి చరిత్ర’ అని బాపు ప్రశంసలు అందుకున్నారు. ముగ్ధులైన మహారథులు.. తనంత తానుగా సాధన చేస్తూ, తప్పులు సరిదిద్దుకుంటూ ఒక్కో మెట్టే ఎక్కి ఉన్నత స్థాయికి చేరిన విశిష్టత పండరిది. అందుకే ఆమె ప్రతిభ మహామహులను సైతం ముగ్థులను చేసింది. కార్టూన్లు సాధన చేసిన మొదట్లో తాను గీసిన చిత్రాలను చెన్నైలో నివసించే కార్టూనిస్టు జయదేవ్‌కు పండరి పంపారు. ఆయన జవాబు రాస్తూ, ఆమె కార్టూన్లను మెచ్చుకోవడమే కాకుండా, అవసరమైన సలహాలు, సూచనలు చేశారు. కొంత కాలానికి ఆయన స్వయంగా విశాఖపట్నం వచ్చి తన శిష్యురాలిని అభినందించారు.. బాపు అంతటి వాడు రచన మాస పత్రికలో 2005లో ప్రచురించిన వినాయక చవితి కార్టూన్ మెచ్చుకొంటూ లేఖ రాశారు. పండరి కార్టూన్‌కు బాపు బొమ్మ గీశారు. బాధాకరం ప్రముఖ కార్టూనిస్టు రాగతి పండరి అకాల మృతికి పలువురు చిత్రకారులు సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. అచ్చమైన తెలుగు నుడికారపు హాస్యంతో కార్టూన్లు సృషించిన రాగతి పండరి చిరస్మరణీయురాలని కార్టూనిస్ట్ హరి ఒక ప్రకటనలో నివాళులర్పించారు. భార్య, భర్త, పక్కింటి వాళ్లు, ఆఫీసు... ఇలా చిన్నచిన్న విషయాలమీద చక్కటి హాస్యాన్ని పంచగలిగే శైలి ఆమెదన్నారు. తెలుగు కార్టూన్‌కి ఒక గౌరవాన్ని తీసుకొచ్చిన వారిలో ఆమె ఒకరుగా శ్లాఘించారు. మహిళా కార్టూన్లు ఎక్కువగా వేసినా మహిళలను కించపరిచేలా కార్టూన్ వేయకపోవడం పండరి ప్రత్యేకతన్నారు. తీరని లోటు ప్రముఖ కార్టూనిస్ట్ రాగతి పండరి అకాల మరణం కార్టూన్ రంగానికి తీరని లోటని చిత్రకారుడు, షిప్‌యార్డు రచయితల సంఘం, చిత్రకళా పరిషత్ సంఘ కార్యదర్శి సుంకర చలపతిరావు అన్నారు. ఆమె మృతికి చింతిస్తూ గురువారం చిత్రకళా పరిషత్ సంఘం వద్ద సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాగతి పండరి వివిధ అంశాలకు సంబంధించి సుమారు 15 వేల కార్టూన్లు గీశారని, ఆమె ప్రతిభను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కళారత్న బిరుదును ప్రదానం చేసిందన్నారు. మద్రాస్ తెలుగు అకాడమీ ఆమెను ఉగాది పురస్కారంతో గౌరవించిందన్నారు. నవ్వుల పువ్వులు ‘దగ్గర చూపా, దూరం చూపా? మీకేంటి ప్రాబ్లెం?’ అని డాక్టర్ ప్రశ్నిస్తే.. ‘ఎవరైనా పచ్చగా ఉంటే చూడలేకపోతున్నాను డాక్టర్’ అనే కడుపు మంట పేషెంట్.. ‘మా నాన్న నాకు వేరే వాడితో పెళ్లి కుదురుస్తున్నాడు.. నువ్విలాగే చూస్తూ కూచుంటావా?’ అని ప్రేయసి అంటే ‘ లేదు రాధా.. నీ పెళ్లికి తప్పక వస్తాను’ అనే కపట ప్రేమికుడు.. ‘పక్కింటి వాళ్ల పిల్లాడ్ని చేర్పించిన కాన్వెంట్లో ఇంగ్లిష్ సరిగ్గా చెప్పడం లేదల్లే ఉందండీ.. ఇంకా ఆవిడ్ని అమ్మా అనే పిలుస్తున్నాడట పాపం’ అని జాలిపడే పరభాషాభిమానీ.. ‘మా ఆవిడ నగలు ఎక్కడ దాచిందో క్లూ ఇస్తా గానీ అందులో నాకో రెండొంతులు ఇస్తావా?’ అని దొంగతోనే బేరం పెట్టే గడుసు భర్తా.. ‘ఏంటీ.. మనవాడు తీరిగ్గా కూర్చుని చదువుకుంటున్నాడూ?’ అని ఆరా తీసే భర్తకి, ‘పాపం.. వాడి సెల్ ఫోన్ పోయిందటండీ’ అని సర్ది చెప్పే జాలి భార్యా.. ఒకటా రెండా.. వందలు.. ఊహూ.. వేలు.. అవును వేలాది పాత్రలు.. లక్షలాది విలక్షణ, విభిన్న స్వభావాలు.. వ్యక్తిత్వాలు.. జీవితంలో అడుగడుగునా తారసపడే రకరకాల వైవిధ్యభరితమైన ప్రవృత్తులు.. అమాయక మాలోకాలు.. గడుసు పిండాలు.. ఇలా ఎన్నో పాత్రలు రాగతి పండరి కార్టూన్లలో ప్రాణం పోసుకొని నవ్వులు పూయించాయి. -
నవ్వుల సంతకం
రాగతి పండరి నాకు తెలిసిన కార్టూనిస్టులందరూ క్రోక్విల్ పాళీ కలాన్ని ఇండియన్ ఇంకులో ముంచి డ్రాయింగు పేపరు మీద బొమ్మలు గీసే పద్ధతినే అనుసరిస్తారు. శ్రమపడతారు. అయితే సాదాసీదా పద్ధతితో, మామూలు స్కెచ్‌పెన్‌తో ఎంతో సునాయాసంగా బొమ్మలు గీసి కార్టూన్లు సృష్టించే వ్యంగ్య చిత్రకారులు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి కార్టూనిస్టుల్లో అందెవేసిన చేయి కుమారి రాగతి పండరి. ఆమె మేధస్సుల్లో ఐడియా తట్టగానే, ఒక స్కెచ్‌పెన్‌తో మామూలు తెల్లకాగితం మీద రఫ్ గీతలు కూడా గీయకుండా మొదలుపెడుతుంది. ఐదు పది నిముషాల్లో కార్టూన్‌ను రెడీ చేస్తుంది. పదహారణాల తెలుగు హాస్యానికి తెర పట్టిస్తుంది. నవ్వుల పెనుతుఫానును సృష్టిస్తుంది. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు రాగతి పండరి తన వేలాది కార్టూన్లతో లక్షలాది పాఠకులని తన కొన ఊపిరి దాకా రంజింప చేసింది. ఆమె అంతటి గొప్ప మహిళా కార్టునిస్టు మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా కనిపించరు. ఆమె మన తెలుగు జాతికి గర్వకారణం. రాగతి పండరి కార్టూన్లు గీయడానికి ప్రారంభించిన తొలిదశలో నాకు ఉత్తరం రాసింది. ‘కార్ట్టూన్లు గీయడం ఎలా?’ అనడిగింది. అప్పట్లో నాకు తెలిసిన, నేను నేర్చుకున్న ‘ఓనమాలని’ ఆమెతో పంచుకున్నాను. అంతే! వాటితో సరిపెట్టుకుని తన అరంగేట్రాలు ప్రారంభించింది. అందరూ విస్తుపోయేలా విజృంభించింది. పండగలు, పబ్బాలు, అల్లుళ్ళు, ఆడపడుచులు, దొంగలు, పోలీసులు, ఆఫీసులు, పార్కులూ.... ఆమె తాకని సబ్జెక్టులేదు, లాగని తీగ లేదు, నడవని డొంక లేదు. స్వైర విహారమే. కార్టూనులో ఏ మూల వెదికినా తేట తెలుగుదనమే, ఏ చోట స్పృశించినా తేనెల తెలుగు మాటలే. ఆమెను ఒకే ఒకసారి, ఆమె స్వగృహంలో కలిశాను. ఆమె నాకు గురుపూజలు చేసింది. అందుకు నేను అర్హుడినా అని ఈరోజు దాకా నన్ను నేను ప్రశ్నించుకుంటాను. ఆమె ఉత్తరం రాసినా, ఫోనులో పలకరించినా తనని నా శిష్యురాలుగానే ప్రకటించుకుంటుంది. నామీద ఆమె ఎనలేని ప్రేమాభిమానాలు పెంచుకుంది. ఆమె ప్రశంసల వలయం నుంచి తప్పించుకోవాలని, ఆమెకి ఉత్తరం రాశాను. ‘‘అమ్మా... నువ్వు స్వయంకృషితో కార్ట్టూనిస్టుగా నిలదొక్కుకున్నావు. నీకు గురువు నీవే... పైగా కార్టూనింగు ఒకరు నేర్పితే అబ్బే విద్యకాదు’’ అని. అయినప్పటికీ ఆమె ఎప్పుడూ చెప్పే ఒకేమాట ‘‘జయదేవ్ గారే నా గురువు!’’- ఇందుకు నేను చాలా గర్వపడాల్సిన అవసరం ఉంది. కళాప్రపూర్ణ, అసంఖ్యాక పాఠకుల మన్ననలందుకున్న, అనేక పురస్కారాలలంకరించుకున్న తెలుగు మహిళా కార్టూనిస్టు కుమారి రాగతి పండరి గురువునవడం, ఆ గుర్తింపు నాకు లభించడం... ఒక గంట ముందు ‘సాక్షి’ పత్రిక కార్యాలయం నుంచి వచ్చిన ఫోను ద్వారా నాకు అవగతమైంది. కుమారి రాగతి పండరి గురించి ప్రస్తుతం నేను రాస్తున్న వ్యాసం నన్ను దుఃఖసాగరంలో ముంచి ఉంది. రాగతి పండరి భౌతిక కాయాన్ని విడిచి వెళ్లిపోయింది. వెళ్లిపోతూ కూడా ‘‘సాక్షి’’ పత్రిక ద్వారా, నాకు గురుకీర్తిని మరొక్కసారి ప్రకటించుకుంది. రాగతి పండరితో నేను ఫోటో దిగలేదు. ఆ అవకాశమే లభించలేదు. అయితే ఆమె నా గుండెలో తన చిత్తరువుని గట్టిగా లిఖించింది. ఆమె రాసిన ఉత్తరాలు, నా కార్టూన్ల కన్నా మిన్నగా జాగ్రత్తగా సేకరించి పెట్టుకున్నాను. ఆమె రాసిన కబుర్లు నా మనసును ఎల్లవేళలా పలకరిస్తూనే ఉంటాయి. ఆమె ఆత్మశాంతించాలని సర్వేశ్వరుడ్ని ప్రార్థిస్తూనే ఉంటాను. ఆమె పేరు ప్రఖ్యాతులు శాశ్వతంగా ఉండిపోతాయి. సందేహం లేదు. ఆ మధ్య బాపుగారు, రాగతి పండరి అడ్రసు కావాలని నన్ను ఫోనులో అడిగారు. ‘‘అవసరం లేదు సార్... రాగతి పండరి, విశాఖపట్నం అని ఉత్తరం మీద రాయండి. ఆమెకి చేరిపోతుంది’’ అన్నాను. అంతేగదా... సంతకం అక్కర్లేని కార్టూనిస్టు గురించి విన్నాము. రాగతి పండరి, అడ్రసే అక్కర్లేని కార్టూనిస్టు!! జయదేవ్ ప్రఖ్యాత కార్టూనిస్టు, చెన్నై -
మహిళా కార్టూనిస్ట్ రాగతి కన్నుమూత
-
మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి కన్నుమూత
విశాఖ: ప్రముఖ మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి(50) గురువారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆమె ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. సావిత్రిబాయ్ పూలే మోమోరియల్ ట్రస్ట్ ద్వారా రాగతి కుటుంబ సభ్యులు ఆమె అవయవాల్ని దానం చేశారు. కార్టూనిస్ట్ గా రాశిలోనూ, వాసిలోనూ సమానమైన కీర్తి ప్రతిష్టలను ఆర్జించుకున్న ఏకైక మహిళ ఆమె. అనతి కాలంలోనే తెలుగు వ్యంగ్య చిత్ర కళా రంగంలో చాలా మంచి పేరు తెచ్చుకుని, ఆ రంగంలో అగ్రగణ్యులైన బాపు, జయదేవ్, బాబు ల సరసన నిలబడగలిగిన స్థాయి చేరుకున్నది. దురదృష్టవశాత్తూ, ఈమెకు చిన్నతంలో వచ్చిన పోలియో మూలంగా శారీరకంగా చలాకీగా తిరగలేకపోయేది. అయినా మానసికంగా ఆమె ధృడంగా ఉండటంతో పలురకాల కార్టూన్లు గీసి కీర్తిని ఆర్జించారు.