చెదిరిన గీత | first woman cartoonist ragati pandari is died | Sakshi
Sakshi News home page

చెదిరిన గీత

Published Fri, Feb 20 2015 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM

first woman cartoonist ragati pandari is died

దివికేగిన కార్టూన్ క్వీన్
 తొలి మహిళా కార్టూనిస్టు  రాగతి పండరి

 
 
జీవితం విభిన్న భావాల మిళితం. అనేక అనుభూతుల సంగమం. హృదయానికి బాధ కలిగితే విషాదం వెల్లువవుతుంది. సంతోషం అతిశయిస్తే ఆనందం పల్లవిస్తుంది. చిలిపితనం పులకింతలు పెడితే పెదాలపై నవ్వు పరవళ్లు తొక్కుతుంది. నవ్వు టానిక్‌లా పని చేస్తుంది. యాంత్రిక జీవితంలో నిరాశను కాసేపైనా తరిమి కొట్టే కిక్ ఇస్తుంది.

ఈ ‘గీతా’సత్యాన్ని రాగతి పండరి చిన్ననాటనే గ్రహించారు. తన జీవితంలో తొణికిన విషాదాన్ని పక్కకు నెట్టి పదిమందికీ నవ్వుల పూలు పంచిపెడుతూ బతుకును ధన్యం చేసుకున్నారు. తామేడుస్తూ ఎందరినో ఏడ్పించే వారు ఎక్కువయ్యే లోకంలో, తాను నవ్వుతూ పదిమందిని నవ్విస్తూ ఆ రంగంలో అగ్రగణ్యురాలిగా ఖ్యాతిని సొంతం చేసుకున్నారు. వైకల్యాన్ని ఓడించి ఆహ్లాదాన్ని అందరికీ పంచి
 పెడుతూ హాస్య ప్రపంచాన మకుటం లేని మహారాణిగా వెలుగొందిన రాగతి పండరి అభిమానులకు విషాదం మిగిల్చి జీవితం నుంచి సెలవు తీసుకున్నారు.
 
విశాఖపట్నం-కల్చరల్:  జీవితంలో అన్ని సదుపాయాలూ ఉండి, ముందుకు దూసుకుపోయే అవకాశాలు కలిగిన వారెందరో చతికిలబడుతూ ఉంటే ఆకాశమే అవధిగా రాగతి పండరి అద్భుతాలు సాధించారు. కేవలం ఎనిమిదేళ్ల వయస్సులో ఓ పత్రికలో కార్టూన్ ప్రచురితమయ్యే స్థాయిని సాధించారంటే అందుకు ఆమె  సాధన, తపన ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. జిజ్ఞాస కొద్దీ నేర్చుకుంటూ, ఆసక్తి కొద్దీ గమనిస్తూ, తనకు తానుగానే సాధన చేస్తూ ఆమె ఉన్నత లక్ష్యాల దిశగా సాగిపోయారు. పాఠశాలకు వెళ్లి చదువుకునే పరిస్థితి లేని రాగతి పండరి, ఇంట్లో సోదరి చెప్పగా చదువు నేర్చుకున్నారు. తోచినట్టు గీతలు గీసి, అలాగే బొమ్మలు సాధన చేసి, క్రమంగా పూర్తి స్థాయి కార్టూనిస్టుగా ఎదగడానికి అవసరమైన సత్తా సంపాదించారు. ప్రముఖ కార్టూనిస్టు జయదేవ్ వ్యంగ్య చిత్రాలను పత్రికల్లో చూసి, మురిసిపోయి, తానుకూడా అదే రీతిలో నేర్పు సంపాదించాలని ఆరాటపడి... అలా నిర్విరామంగా బొమ్మలు గీసి, రాతలు రాసి ఓ స్థాయికి చేరుకున్నారు. చూడగానే ‘ఇది రాగతి పండరి కార్టూన్’ అన్న గుర్తింపు వచ్చేలా నేర్పు సంపాదించారు. తెలుగునాట తొలి మహిళా కార్టూనిస్టుగా ఖ్యాతి పొందారు. దేశంలోనూ ఈ ఖ్యాతికి ఆమె అర్హురాలే.
 
ఎన్నో కార్టూన్లు... మరెన్నో శీర్షికలు

పండరి మొదటి కార్టూన్ ఎనిమిదో ఏటే జ్యోతి వార పత్రికలో ప్రచురితమైంది. మొత్తం 16 వేలకు పైగా  కార్టూన్లు వేశారు. వ్యంగ్య చిత్రాలకు సంబంధించి ఆమె కర స్పర్శ సోకని ప్రక్రియ లేదు. క్లిష్టమైన రాజకీయ కార్టూన్‌లను సుదీర్ఘ కాలం పాటు ‘రాజకీయ చెదరంగం’ శీర్షిక కింద గీసి ఆ విధంగా కూడా తనకు అవగాహన అనల్పమని రుజువు చేసుకున్నారు. నవగ్రహం- అనుగ్రహం పేరున ఇద్దరు అమ్మాయిల కార్టూన్ ఫీచర్, శ్రీమతి పేరున మహిళామణి స్ట్రిప్ కార్టూన్.. ప్రతి పండగకు ప్రత్యేక పేజీ కార్టూన్లు.. అవీ ఇవీ అని కాకుండా నిర్విరామంగా వ్యంగ్య చిత్రాలు సృజించారు. తెలుగులో అన్ని పత్రికలకు తన వ్యంగ్య చిత్రాల వెలుగులు పంచి ఇచ్చారు. తెలుగు కార్టూన్ సామ్రాజ్యానికి ఆమె మకుటం లేని మహారాణి అని జయదేవ్ చేత ప్రశంసలు పొందారు. ‘మీవి కేవలం కార్టూన్లే కాదు.. నేటి కాలపు తెలుగు మధ్యతరగతి వారి చరిత్ర’ అని బాపు ప్రశంసలు అందుకున్నారు.
 
ముగ్ధులైన మహారథులు..

 
తనంత తానుగా సాధన చేస్తూ, తప్పులు సరిదిద్దుకుంటూ ఒక్కో మెట్టే ఎక్కి ఉన్నత స్థాయికి చేరిన విశిష్టత పండరిది. అందుకే ఆమె ప్రతిభ మహామహులను సైతం ముగ్థులను చేసింది. కార్టూన్లు సాధన చేసిన మొదట్లో తాను గీసిన చిత్రాలను చెన్నైలో నివసించే కార్టూనిస్టు జయదేవ్‌కు పండరి పంపారు. ఆయన జవాబు రాస్తూ, ఆమె కార్టూన్లను మెచ్చుకోవడమే కాకుండా, అవసరమైన సలహాలు, సూచనలు చేశారు. కొంత కాలానికి ఆయన స్వయంగా విశాఖపట్నం వచ్చి తన శిష్యురాలిని అభినందించారు.. బాపు అంతటి వాడు రచన మాస పత్రికలో 2005లో ప్రచురించిన వినాయక చవితి కార్టూన్ మెచ్చుకొంటూ లేఖ రాశారు. పండరి కార్టూన్‌కు బాపు బొమ్మ గీశారు.
 
బాధాకరం


 ప్రముఖ కార్టూనిస్టు రాగతి పండరి అకాల మృతికి పలువురు చిత్రకారులు సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. అచ్చమైన తెలుగు నుడికారపు హాస్యంతో కార్టూన్లు సృషించిన రాగతి పండరి చిరస్మరణీయురాలని కార్టూనిస్ట్ హరి ఒక ప్రకటనలో నివాళులర్పించారు. భార్య, భర్త, పక్కింటి వాళ్లు, ఆఫీసు... ఇలా చిన్నచిన్న విషయాలమీద చక్కటి హాస్యాన్ని పంచగలిగే శైలి ఆమెదన్నారు. తెలుగు కార్టూన్‌కి ఒక గౌరవాన్ని తీసుకొచ్చిన వారిలో ఆమె ఒకరుగా శ్లాఘించారు. మహిళా కార్టూన్లు ఎక్కువగా వేసినా మహిళలను కించపరిచేలా  కార్టూన్ వేయకపోవడం పండరి ప్రత్యేకతన్నారు.  
 
తీరని లోటు

 ప్రముఖ కార్టూనిస్ట్ రాగతి పండరి అకాల మరణం కార్టూన్ రంగానికి తీరని లోటని చిత్రకారుడు, షిప్‌యార్డు రచయితల సంఘం, చిత్రకళా పరిషత్ సంఘ కార్యదర్శి సుంకర చలపతిరావు అన్నారు. ఆమె మృతికి చింతిస్తూ గురువారం చిత్రకళా పరిషత్ సంఘం వద్ద సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాగతి పండరి వివిధ అంశాలకు సంబంధించి సుమారు 15 వేల కార్టూన్లు గీశారని, ఆమె ప్రతిభను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కళారత్న బిరుదును ప్రదానం చేసిందన్నారు. మద్రాస్ తెలుగు అకాడమీ ఆమెను ఉగాది పురస్కారంతో గౌరవించిందన్నారు.
 
నవ్వుల పువ్వులు
 
‘దగ్గర చూపా, దూరం చూపా? మీకేంటి ప్రాబ్లెం?’ అని డాక్టర్ ప్రశ్నిస్తే.. ‘ఎవరైనా పచ్చగా ఉంటే చూడలేకపోతున్నాను డాక్టర్’ అనే కడుపు మంట పేషెంట్.. ‘మా నాన్న నాకు వేరే వాడితో పెళ్లి కుదురుస్తున్నాడు.. నువ్విలాగే చూస్తూ కూచుంటావా?’ అని ప్రేయసి అంటే ‘ లేదు రాధా.. నీ పెళ్లికి తప్పక వస్తాను’ అనే కపట ప్రేమికుడు.. ‘పక్కింటి వాళ్ల పిల్లాడ్ని చేర్పించిన కాన్వెంట్‌లో ఇంగ్లిష్ సరిగ్గా చెప్పడం లేదల్లే ఉందండీ.. ఇంకా ఆవిడ్ని అమ్మా అనే పిలుస్తున్నాడట పాపం’ అని జాలిపడే పరభాషాభిమానీ.. ‘మా ఆవిడ నగలు ఎక్కడ దాచిందో క్లూ ఇస్తా గానీ అందులో నాకో రెండొంతులు ఇస్తావా?’ అని దొంగతోనే బేరం పెట్టే గడుసు భర్తా.. ‘ఏంటీ.. మనవాడు తీరిగ్గా కూర్చుని చదువుకుంటున్నాడూ?’ అని ఆరా తీసే భర్తకి, ‘పాపం.. వాడి సెల్ ఫోన్ పోయిందటండీ’ అని సర్ది చెప్పే జాలి భార్యా..
 ఒకటా రెండా.. వందలు.. ఊహూ.. వేలు.. అవును వేలాది పాత్రలు.. లక్షలాది విలక్షణ, విభిన్న స్వభావాలు.. వ్యక్తిత్వాలు.. జీవితంలో అడుగడుగునా తారసపడే రకరకాల వైవిధ్యభరితమైన ప్రవృత్తులు.. అమాయక మాలోకాలు.. గడుసు పిండాలు.. ఇలా ఎన్నో పాత్రలు రాగతి పండరి కార్టూన్లలో ప్రాణం పోసుకొని నవ్వులు పూయించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement