
మొక్కజొన్న కండె హెల్దీ టైమ్‌పాస్
గుడ్ ఫుడ్
సరదాగా బయటకు వెళ్లినప్పుడో లేదా ఎక్కడైనా టైమ్‌పాస్ కోసం ఏదైనా నమలాలనుకున్నప్పుడు మొక్కజొన్న కండెలు తినడం చాలామంది చేసే పనే. అయితే దాన్ని ఏదో టైంపాస్ కోసం అన్నట్లుగా తేలిగ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మొక్కజొన్న కండెలతోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అందుకే అలా అలా సరదాగా సమయం గడపుతూ, టైంపాస్ చేస్తున్న సమయంలోనే ఆరోగ్యాన్ని అవెలా సమకూరుస్తుంటాయో తెలుసుకుందాం.
∙ మొక్కజొన్నలో డయటరీ ఫైబర్ (పీచు పదార్థాలు) చాలా ఎక్కువ. వాటిలోని సాల్యుబుల్ ఫైబర్ మలం మృదువుగా వచ్చేలా చేస్తుంది. అందుకే అవి జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు మలబద్దకాన్ని నివారిస్తాయి.
∙ ఒక కప్పు మొక్కజొన్న గింజల్లో 18.4 శాతం డయటరీ ఫైబర్ ఉండటం వల్ల మొలలు (పైల్స్) సమస్యను నివారిస్తాయి. పెద్ద పేగు క్యాన్సర్‌కూ నివారణగా పనిచేస్తాయి. అంతేకాదు నీళ్ల విరేచనాలు, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి.
∙ ఐరన్ లోపాలను అధిగమించేలా చేసి రక్తహీనతను తగ్గిస్తాయి. కొత్త రక్తకణాలు పుట్టేందుకు మొక్కజొన్న బాగా దోహదపడుతుంది.
∙ మొక్కజొన్నలో ఖనిజలవణాలైన ఫాస్ఫరస్, మెగ్నీషయమ్, మ్యాంగనీస్, ఐరన్, కాపర్ పాళ్లు చాలా ఎక్కువ. అంతేకాదు... అరుదైన సెలీనియమ్ పాళ్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఫాస్ఫరస్ ఎదుగుదలకూ, ఎముకల ఆరోగ్యానికి బాగా దోహదపడుతుంది. మెగ్నీషియమ్ మంచి గుండె ఆరోగ్యంతో, ఎముకలకు బలాన్నిస్తుంది.
. దీని పసుపుపచ్చ రంగు కెరటనాయిడ్స్ పుష్కలంగా ఉండటానికి సూచన. ఇందులో విటమిన్–ఏ ను సమకూర్చేందుకు అవసరమైన బీటా–కెరటిన్ ఉంటుంది. అందుకే మొక్కజొన్న చూపును మెరుగుపరచడంతో పాటు వయసు పెరిగే కొద్దీ వచ్చే మాక్యులార్ డీజనరేషన్ వంటి కంటిజబ్బులను నివారిస్తుంది.
∙మొక్కజొన్నలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ–ర్యాడికల్స్‌ను నిర్వీర్యం చేసే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నందున అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది.