యాక్సిడెంట్‌లో జననాంగాలకు దెబ్బలు... దాంపత్య జీవితానికి విఘాతమా?
నా వయసు 26 ఏళ్లు. ఇటీవల ఒక యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డాను. ఆ సమయంలో జననాంగాల వద్ద దెబ్బ బలంగా తగిలింది. రెండు వృషణాలకూ, పురుషాంగానికి దెబ్బలు తగిలాయి. పురుషాంగం నుంచి రక్తస్రావం కూడా అయ్యింది. దాంతో మూత్రవిసర్జన కూడా చేయలేకపోయాను. డాక్టర్లు బొడ్డు వద్ద పైప్ వేసి మూత్రాన్ని బయటకు తీశారు. మూత్రనాళం డ్యామేజ్ కావడం వల్ల సర్జరీ అవసరమని చెబుతున్నారు. ఈ దెబ్బల వల్ల భవిష్యత్తులో నాకు సెక్స్ పవర్ పోతుందా? నేను నార్మల్‌గా సెక్స్ చేయగలుగుతానో లేదో అని నాకు చాలా ఆందోళనగా ఉంది. తగిన సలహా ఇవ్వండి.
- ఆర్.కె.ఆర్. రాజమండ్రి
మూత్రనాళం దెబ్బతినడాన్ని యురెథ్రల్ ఇంజ్యూరీ అంటారు. మూత్రనాళం ఏమేరకు దెబ్బతిన్నది అన్న విషయాన్ని ‘రెట్రోగ్రేడ్ యురెథ్రోగ్రామ్’ అనే పరీక్షతో నిర్ధారణ చేస్తారు. ఒకవేళ మూత్రనాళం పూర్తిగా దెబ్బతింటే యాక్సిడెంట్ అయిన ఆరువారాల తర్వాత ఆపరేషన్ చేసి మూత్రనాళాన్ని మళ్లీ పునరుద్ధరిస్తారు. ఈ సర్జికల్ ప్రక్రియను యురెథ్రోప్లాస్టీ అంటారు. మీకు అంగస్తంభన లోపం రావడం అన్నది మీకు తగిలిన దెబ్బ వల్లగానీ, లేదా సర్జరీ వల్లగానీ సంభవించడం చాలా అరుదు. కాబట్టి మీరు నిశ్చింతగా ఆపరేషన్ చేయించుకోండి. ఆశావహ దృక్పథంతో ఉండండి.
నాకు 45 ఏళ్లు. సెక్స్ చేయడంలో సమస్య లేదు. కాకపోతే ఈమధ్య పురుషాంగం మీద ఉన్న చర్మం చివరిభాగం ఒరుసుకుపోయి, చిన్న చిన్న పగుళ్లు ఏర్పడుతున్నాయి. దీనివల్ల చర్మం ఫ్రీగా వెనక్కు రావడం లేదు. దాంతో సెక్స్ సమయంలో నొప్పిగా ఉంది. మూత్రం మాత్రం సాఫీగానే వస్తోంది. ఇలా తరచూ జరుగుతోంది. తగిన సలహా ఇవ్వండి.
- జీ.డి.ఆర్.ఎమ్., ఉయ్యూరు
పురుషాంగం చివరి భాగంలో ఉన్న చర్మం ఇలా ఒరుసుకుపోతూ ఉంటే మొదట రక్తంలో చక్కెర పాళ్లను తెలుసుకోవాలి. మీరు చెబుతున్న లక్షణానికి... షుగర్, మీ భాగస్వామికి ఇన్ఫెక్షన్ ఉండటం, లేదా మీకు అనేక మందితో సెక్స్ సంబంధాలు ఉండటం, మీరు వ్యక్తిగత పరిశుభ్రత సరిగా పాటించకపోవడం వంటివి ప్రధానమైన కారణాలు. ఒకవేళ మీకు షుగర్ ఉన్నట్లుగా రిపోర్టు వస్తే చక్కెర నియంత్రణ కోసం అవసరమైన మందులు వాడుతూ, రక్తంలో చక్కెర పాళ్లు ఎప్పుడూ నియంత్రణలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ భాగస్వామి, మీరు ఒకసారి పరీక్ష చేయించుకొని స్థానికంగా ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయేమో తెలుసుకొని తగిన యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్ మందులు వాడండి. మీ లక్షణాలు తగ్గిన తర్వాత సున్తీ చేయించుకుంటే ఈ సమస్య మళ్లీ మళ్లీ రాకుండా ఉంటుంది. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని యూరాలజిస్ట్‌ను సంప్రదించండి.
డాక్టర్ వి. చంద్రమోహన్
యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్,
ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్‌బి, హైదరాబాద్
యాండ్రాలజీ కౌన్సెలింగ్
Published Sun, Jul 12 2015 11:05 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement