శిష్యవాత్సల్యం | Devotional information | Sakshi
Sakshi News home page

శిష్యవాత్సల్యం

Published Sun, Sep 17 2017 12:59 AM | Last Updated on Tue, Sep 19 2017 4:39 PM

శిష్యవాత్సల్యం

శిష్యవాత్సల్యం

బిడ్డలు మంచివారయినా, చెడ్డవారయినా ఆస్తిని మాత్రం తల్లిదండ్రులు వారికే ఇస్తారు. కానీ గురువొక్కడే తన శిష్యులకు ఇస్తాడు. గురువుగారి శరీరం పడిపోయిన తరువాత ఆయన ఆస్తి – అంటే రామాయణం, భారతం, భాగవతం, భక్తి, జ్ఞానం, వైరాగ్యం, ప్రబోధం, అనుష్ఠానం, ధర్మం... ఇవన్నీ నమ్ముకున్న శిష్యుడికి వెళ్ళిపోతాయి. యోగ్యుడు కాకపోతే కొడుక్కు కూడా వెళ్ళవు. తనని అంటిపెట్టుకుని తిరిగాడు కాబట్టి అంతటి గొప్పవిద్యను గురువు శిష్యుడికి ఇవ్వగలడు. శిష్యుడికి వశవర్తియై పరమేశ్వరుడి అనుగ్రహం కూడా శిష్యుడికి ఇప్పించగలడు.

వైష్ణవ సంప్రదాయంలో ’యథోక్తకారీ’ అని ఒక అద్భుత విశేషం ఉంది. కాంచీపురంలోని ఒక దేవాలయంలో విష్ణుపెరుమాళ్‌ శేషశయనం మీద ఉంటాడు. ఈ సంప్రదాయానికి చెందిన ఆళ్వారుల్లో ఒకరయిన భక్తిసారులు విష్ణుమూర్తిని సేవిస్తూ ఉండేవారు. బ్రహ్మచారిగా ఉన్న అలాంటి భక్తిసారులను ఒక దంపతుల జంట సేవిస్తూ ఉండేది. ఆయనకు తెచ్చిన ఆవుపాలు ఆయన తాగగా మిగిలినవి ప్రసాదంగా సేవిస్తూ ఉండేవారు. వారికి కణికణ్ణన్‌ అని ఒక కుమారుడు పుట్టాడు.

అదే దేవాలయంలో వృద్ధురాలయిన ఒక గూనిస్త్రీ రోజంతా తుడిచి కడిగి వెళ్ళిపోతూ ఉండేది. అది చూసిన కణికణ్ణన్‌ ఆమెకు గూని లేకపోతే మరింత ఎక్కువ సేవచేసేది కదా అనుకుని గురువుగారివంక చూసాడు. ఆయన అనుగ్రహం పొందిన శిష్యుడు వెళ్ళి ఆమె గూనిని ముట్టుకోగానే ఆమె వైకల్యం పోయి నవయవ్వనంతో చక్కటి సౌందర్యవతిగా మారిపోయింది. వృద్ధుడయిన ఆ దేశపు రాజుకు ఈ విషయం తెలిసి కణికణ్ణన్‌ను పిలిపించి తన వృద్ధాప్యాన్ని కూడా తొలగించమన్నాడు. గూనిస్త్రీలో వచ్చిన మార్పు తన గొప్పదనం వల్ల కాదనీ, కేవలం తన గురువుగారి అనుగ్రహం వల్లమాత్రమే సాధ్యమైందని ఎంత చెప్పినా వినకుండా రాజు కణికణ్ణన్‌కు దేశ బహిష్కరణ శిక్ష విధించాడు.

కణికణ్ణన్‌ నేరుగా గురువుగారి దగ్గరకు వచ్చి జరిగింది చెప్పి దేశం విడిచి వెళ్ళిపోతున్నానన్నాడు. వెంటనే భక్తిసారులు లేచి శేషశయనం మీద ఉన్న స్వామివారిని ఉద్దేశించి ‘‘కణికణ్ణన్‌వెళ్ళి పోతున్నాడు’’ అన్నాడు. అంతే చెప్పాడు. స్వామివారు దిగ్గున లేచి ‘కణికణ్ణన్‌ ఎక్కడికెడితే మనమూ అక్కడికే వెడదాం పద’ అంటూ ముందుకు నడిచాడు. కణికణ్ణన్‌ముందు, ఆయన వెనుక భక్తిసారులు, వారి వెనుక స్వామి వెళ్ళిపోతూ మార్గమధ్యంలో ఆ రాత్రికి పాలార్‌నది ఒడ్డున బస చేశారు.

విష్ణువు వక్షస్థలంలో కొలువై ఉండే లక్ష్మి కూడా కాంచీపురాన్ని వదిలిపెట్టడంతో ’నగరేషు కాంచి’గా పేరొందిన ఆ నగరం వెలవెలాపోయి ప్రజలు గగ్గోలు పెట్టడంతో విషయం తెలుసుకున్న రాజు పరుగున వెళ్ళి క్షమించమంటూ స్వామివారి పాదాలమీద పడ్డాడు.’నా భక్తుడు రమ్మంటే ఆయన వెంట వచ్చేసాను’ అంటూ స్వామి భక్తిసారులను చూపాడు. భక్తిసారుల దగ్గరకు వెళ్ళి ప్రాధేయపడ్డాడు రాజు. కణికణ్ణన్‌ వెళ్ళిపోతుంటే ఆయన్ని అనుసరించానంతే అన్నాడు భక్తిసారులు. రాజువెళ్ళి ఆయనను అర్థించగా కరుణించిన కణికణ్ణన్‌’తప్పు ఒప్పుకున్నావుగా చాలు, పద’ అని కంచివైపు తిరుగుముఖం పట్టాడు. భక్తిసారులు చూసి ’కణికణ్ణన్‌ వెళ్ళిపోతున్నాడు’ అని చెప్పడంతో స్వామివారు అలాగే అంటూ బయల్దేరారు.

ముందు కణికణ్ణన్, వెనుక భక్తిసారులు, వారి వెనుక స్వామివారు తిరిగి కంచి దేవాలయానికి చేరుకున్నారు. ‘యథా ఉక్తకారీ’ అంటే ఎలా గురువుగారు చెప్పారో అలా చేసిన పరమాత్ముడు’ అని–అదే ఇప్పుడు కంచిలో ఉన్న యథోక్తకారి దేవాలయం. గురువుకు ఉండే శిష్య వాత్సల్యం పరమేశ్వరుడిని కూడా శాసిస్తుందని చెప్పడానికి ఈ దేవాలయం ఒక నిదర్శనంగా కనబడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement