
దురహంకారం దుష్టుల లక్షణం!
పర్షియా చక్రవర్తి హామాను అనే అధికారిని తన రాజ్యానికి ప్రధానమంత్రిని చేయగా ఒక చక్రవర్తి మినహా ఆ రాజ్యప్రజలంతా అతనికి సాగిలపడ్డారు. కాని దేవునికి మాత్రమే సాగిలపడే యూదుడైన మొర్దెకై అనే వ్యక్తి మాత్రం సాగిలపడటంలేదని రాజభటులు హామానుకు తెలిపారు. అందుకు ఉగ్రుడైన హామాను మొర్దెకైనే కాదు, పర్షియాలోని అతని జనులైన యూదులందరి సంహారానికి కుట్ర పన్నాడు. కాని దేవుని ప్రమేయంతో ఎస్తేరురాణి జోక్యం వల్ల జరిగిన అనూహ్య పరిణామాల్లో, తాను సంహరిద్దామనుకున్న మొర్దెకైనే చక్రవర్తి ఆజ్ఞానుసారం హామాను సన్మానించవలసి వచ్చింది.
ఎస్తేరు రాణి స్వజనమైన యూదుల సంహారానికి హామాను చేసిన కుట్ర బట్టబయలై, హామానును అతని కుమారులను ఉరి తీయమని చక్రవర్తి ఆజ్ఞ ఇచ్చాడు. అంతకాలం అహంకారంతో విర్రవీగిన హామానును, అతని కుమారులను ఉరితీయమని చక్రవర్తి ఆజ్ఞ ఇచ్చాడు. అంతకాలం అహంకారంతో విర్రవీగిన హాహాను చివరికి ప్రాణరక్షణ కోసం ఎస్తేరు కాళ్లు పట్టుకోవడానికి కూడా దిగజారవలసి వచ్చింది. ఈలోగా రాజభటులు వచ్చి మొర్దెకైని ఉరి తీసేందుకు హామాను ఎల్తైన ఉరికొయ్య సిద్ధం చేశాడని చెబితే అదే కొయ్యకు హామానును ఉరి తీయమని చక్రవర్తి ఆజ్ఞ ఇచ్చాడు.
స్వాభిమానులకు, అహంకారులకు ఎప్పుడూ వైరమే! విచిత్రమేమిటంటే మొర్దెకై సాగిలపడటం లేదని హామానుకు చాడీలు చెప్పిన రాజభటులే, మొర్దెకైని ఉరి తీసేందుకు హామాను ఎల్తైన ‘కొయ్య’ సిద్ధం చేశాడని చక్రవర్తికే చాడీలు చెప్పారు. అహంకారుల చుట్టూ చాడీలు చెప్పేవాళ్లు, చెంచాలు పోగవుతారని, అహంకారులు బలహీనులైన మరుక్షణం వాళ్లంతా శత్రుపక్షంలో చేరిపోతారని వేరుగా చెప్పాలా? లక్షలమంది సాగిలపడుతూండగా ఒక్క వ్యక్తి సాగిలపడకపోతే పోయేదేముందన్న విశాలమైన ఆలోచన లేకుండా, సాగిలపడని ఒక్కరి కోసం లక్షలమంది సంహారానికి కుట్ర చేసిన ‘దుష్టస్వభావమే’ హామానును అంతం చేసింది. అనుకోకుండా అందలమెక్కిన అనర్హులకే అహంకారం అనే జబ్బు చేస్తుంది. వారిని అభద్రతా భావనకు, తమ నీడను కూడా తామే నమ్మలేనంతటి అశాంతికి గురి చేస్తుంది.
కుట్రలు, కుతంత్రాలే జీవితంగా మారి అహంకారులు అందరిని శత్రువులను చేసుకుంటారు. క్రోధానికి బానిసలై ఆలోచనాశక్తి లోపించగా వినాశనం వారిని తరుముకొస్తుంది. అహంకారానిది, భ్రష్టత్వానిక ఆలుమగల అన్యోన్య దాంపత్యం. అహంకారులు నిజానికి పరమ పిరికి వారన్నది మానసిక శాస్త్రవేత్తల విశ్లేషణ. అహంకారంతో బాగుపడ్డవాడు, సాత్వికుడై చెడిపోయినవాడు లేడన్నది అటు బైబిల్, ఇటు చరిత్ర కూడా చెప్పే తిరుగులేని సత్యం! ఐదడుగులు కూడా లేని స్వాభిమాని దావీదు, దున్నపోతులా ఉన్న ఏడడుగుల అహంకారి గొల్యాతును మట్టి కరిపించడం సత్యానికి, సాత్వికులకు దేవుడిచ్చిన విజయం.
– రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్