
ఒక మంత్రం పట్టునివ్వాలంటే ఆ మంత్రాన్ని జపించవలసిన విధానం ఏమిటి?
ఈ విషయాన్ని భగవద్గీత బాగా వివరించి చెప్పింది. మనసుకి ఏ ఆందోళనా, తొందరా లేని కాలాన్ని నిర్ణయించుకుని, మనం జపం చేస్తున్నంతసేపూ మననెవరూ పలకరించ(లే)ని తీరు ఏర్పాట్లున్న ప్రదేశంలో ఎంతసేపు మననాన్ని చేయగలమో అంతసేపు మననం చేయడం సరైన పద్ధతి. అలా మంత్రమననం చేసినదే లెక్కకి వస్తుంది. ఇటు అక్షమాలని తిప్పుతూ అన్నిటినీ పరిశీలిస్తూ ఎదుటివారి మాటలకి కళ్లతో నవ్వుతో ప్రతిస్పందిస్తూ మౌనంగా చేస్తూన్న జపం– మంచి కాలక్షేపానికి (సమయాన్ని వ్యయం చేయడానికి) పనికొస్తుంది. (శుచౌ దేశే...)
ఏ దేవుణ్ణి ఎప్పుడు స్మరించాలి?
ఉదయం వేళలో మనం శ్రీహరి శ్రీహరి అంటూ విష్ణువునే స్మరించాలి. మన పోషకత్వాన్ని నిర్వహించేది విష్ణువు గనుక ఉదయం లేవగానే ఆయన్ని స్మరిస్తే మన నిత్యజీవితం సాఫీగా సాగిపోతుంది. సూర్యాస్తమయ సమయంలో శివుని స్మరించాలి. అలాచేస్తే మన నిత్యజీవితంలో సమతుల్యత లభిస్తుంది. హర శబ్దానికి హరించువాడని అర్ధం ఆయన్ని సాయం సమయాల్లో ధ్యానిస్తే మన పాపాల్ని అన్నింటినీ హరింపచేస్తాడు.
‘‘ప్రదోషే హరిం న పశ్యాత్ నృసింహం రాఘవం వినా’’ విష్ణువు నృసింహావతారం ఎత్తింది సాయం సంధ్యా సమయంలోనే గనుక నృసింహునకు మినహాయింపు. ఇక రాముని విషయానికొస్తే ‘రమయతీతి రామః’’ –ప్రజలను రంజింప చేసే వాడు కనుక రాముని ఎల్లవేళలా స్మరించవలసిందే.
పక్షానికి ఒకసారి సంభవించే మహాప్రదోష కాలంలో శివదర్శనం, శివనామ జపం మనకు అమిత ప్రయోజనకరం. సాయంసంధ్యసమయంలో ఉన్న త్రయోదశి తిధినాటి ప్రదోష కాలమే మహాప్రదోషమవుతుంది. ఆనాడు ఉదయం ద్వాదశి తిధి ఉన్నా ఇబ్బంది లేదు. కనుక ప్రదోషకాలం అన్ని విధాలా శుభప్రదమైంది, పవిత్రమైనది అని ఎంచి అర్ధనారీశ్వరుని ధ్యానించి మనం తరించాలి.
Comments
Please login to add a commentAdd a comment