తొలిగడప | Encapsulate the history of the world | Sakshi
Sakshi News home page

తొలిగడప

Published Wed, Jan 21 2015 12:15 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM

తొలిగడప

తొలిగడప

టూకీగా ప్రపంచ చరిత్ర    
 
భూగోళం మరింత చల్లబడింది. వేడి పెనంలాటి నేల చీకటి వేళల్లో గోరువెచ్చగా మారిన వాతావరణంలో ‘మీసోజోయిక్’ యుగం - అంటే ‘మధ్యంతర’ యుగం మొదలయింది. సుమారు 22కోట్ల సంవత్సరాల నాడు ప్రారంభమైన ఈ యుగం దాదాపు పదనాలుగున్నర కోట్ల సంవత్సరాలు కొనసాగింది.
 
అదివరకటి యుగం చిట్టచివరి దశలో పొడజూపిన ‘రెప్టైల్’ తరగతి జంతువుల విస్తృతి మధ్యంతరయుగంలో విజృంభించడంతో దీన్ని ‘గోల్డన్ ఏజ్ ఆఫ్ రెప్టైల్స్’ - అంటే ‘సరీసృపాల స్వర్ణయుగం’గా అభివర్ణించారు. ఆ వివరాలకు వెళ్ళేముందు సరీసృపాల స్వభావాన్ని స్థూలంగా కొంత తెలుసుకుందాం.

 వెన్నెముక కలిగిన జంతువులు ఉనికిలోకి వచ్చిన తొలిదశ జీవుల్లో చేప, కప్ప, తొండలను తీసుకుంటే, అవి వేరు వేరు తరగతులకు చెందినవే గాక, పరిణామక్రమంలో ఒకదానికంటే మరొకటి ఎగువస్థాయి లక్షణాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. చేప ఎట్టిపరిస్థితుల్లోనూ నీటిని వదలి బ్రతకలేదు. సంతానోత్పత్తి విధానాన్ని పరిశీలిస్తే, చేపకు ఉండేది అండాశయమేగానీ గర్భాశయంగాదు. అందువల్ల, ఆడ చేప మగబీజకణాలను కడుపులోకి తీసుకోలేదు. సంగమించే సమయంలో ఆడచేప విడుదల చేసే గుడ్లూ, మగచేప విడుదల చేసే రేతస్సూ, వాటి శరీరాలకు వెలుపలిగా, అంటే నీటిలో సంయోగమై పిండం ఏర్పడుతుంది.

కప్ప ‘ఉభయచరం.’ నేలమీద జీవిస్తుంది గానీ, గుడ్లు పెట్టే సమయం రాగానే అది ఎన్ని తిప్పలైనా పడి నీటిగుంట చేరుకోవలిసిందే. ఎందుకంటే, చేపకు మల్లే కప్పకు గూడా గర్భాశయం ఏర్పడకపోవడంతో, దాని గుడ్లకు మగబీజకణాలతో సంయోగం నీటిలోనే జరగాలిగాబట్టి. తొలిదశలో కప్పపిల్లలు నీటిలోనే జీవిస్తూ, చేపల్లాగే మొప్పలతో ప్రాణవాయువును గ్రహిస్తాయి. ఊపిరితిత్తులు ఎదిగిన తరువాత వాటి జీవితం ఒడ్డుమీదికి మారుతుంది.

సరీసృపం తరగతికి చెందిన తొండకు అండాశయంతోపాటు గర్భాశయం కూడా ఉంటుంది. తొక్కిళ్ళు పడినప్పుడు మగజీవి రేతస్సును ఆడజీవి తన గర్భంలోకి గ్రహిస్తుంది. ఆడ మగ బీజకణాల సంయోగం గర్భాశయంలో జరిగి, చుట్టూ దళసరి రక్షకపటలం ఏర్పడేవరకు గుడ్డును ఇది తన గర్భంలోనే ఉంచుకుంటుంది. ఆ తరువాత, పొదిగేందుకు అనుకూలమైన వెచ్చని నేలలో గుడ్లను దించి, వాటి రక్షణ కోసం తనకు చేతనయిన జాగ్రత్తలు తీసుకుంటుంది. దీని సంతానోత్పత్తి విధానానికి నీటితో సంబంధం తెగిపోయింది.
 ఉదాహరణ కోసం మనకు బాగా పరిచయమున్న జంతువుల నుండి తరగతికి ఒకటిగా ఎన్నుకున్నాం గాని, మొత్తంగా చూస్తే ఏ తరగతికి ఆ తరగతిలో ఇంచుమించు ఒకేలా బతికే జీవులు వేలసంఖ్యలో ఉంటాయి. ఒక్క చేపల్లోనే ప్రస్తుతం మనకు తెలిసినవి దాదాపు 20,000 కులాలు. ఉభయచరాల్లో 6,500 రకాలు తెలుస్తుండగా, సరీసృపాల్లో బల్లులూ, తొండలూ, పాములూ, తాబేళ్ళూ, మొసళ్ళవంటి జాతులే అనేకం ఉన్నాయి. ఒక్కొక్క జాతికి తిరిగి బోలెడన్ని కులాలు; తాబేళ్ళలో 300 కులాలు కనిపిస్తుండగా, తొండలూ పాములవంటి ప్రాణుల్లో 7,900 కులాలు తేలుతున్నాయి.

‘పైకస్’ తరగతికి చెందిన చేప, ఉభయచరాల్లో కప్ప, రెప్టైల్స్‌లో తొండల మధ్య నుండే తేడాలు కొన్నింటిని తెలుసుకున్నాక, వాటిల్లో కనిపించే ఒక సామాన్య లక్షణాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. గుడ్లను పెట్టేందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసుకోవడం ఈ జీవులన్నిట్లో కనిపించే సామాన్య లక్షణం. ఆ ప్రేరణకు కారణమైంది మెదడు. కపాలంగా ఏర్పడిన తల ఎముకలూ, ‘మెదడు’ అనదగిన మాంసభాగం తొట్టతొలిగా కనిపించేది చేపల్లో. వానపాములాంటి వెన్నెముకలేని జీవుల్లో మెదడులా ఏర్పడిన కేంద్రాలు కనిపించినా, అవి కేవలం నాడీకణాల సముదాయం మాత్రమే. ఆలోచనలు కలిగించగల ‘గ్రే మేటర్’- అంటే ‘బూడిదరంగు పదార్థం’ ఆ తరహా జీవులకు ఉండదు. అతి చిన్న మోతాదులో బూడిదరంగు పదార్థం వెన్నెముక ఏర్పడిన ప్రాణులతో మొదలౌతుంది. పరిణామదశ స్థాయి పెరిగేకొద్దీ దాని మోతాదు పెరుగుతుంది.

మెదడంటే మానవునికున్న ‘పెద్దమెదడు’ సామర్థ్యంతో పోల్చుకునేందుకు వీలయ్యేంతది కాదు. మనిషితో పోల్చదగిన మెదడుండేది మరో మనిషికేగాని, మరే జంతువూ సాటి రాదు. మనం మాట్లాడుకున్న ప్రాణులకుండే మెదడు అత్యంత ప్రాథమికమైంది. ఇంద్రియాల నుండి సంకేతాలు స్వీకరించడం, వాటిని విశ్లేషించుకుని అవసరానికి తగినట్టు శరీరభాగాలను ప్రేరేపించడం వరకే దాని పరిమితి. జంతువుల్లో కనిపించే చర్యలు ‘ఉద్రేక’ జనితాలే తప్ప, ఆలోచనా జనితాలు కాకపోవడానికి కారణం ఇదే. చేప వంటి జీవులకు నిద్రతో అవసరం కలుగకపోవడానికి కారణం కూడా ఇదే. ‘నిద్ర’ అనేది ప్రధానంగా పెద్దమెదడు తీసుకునే విశ్రాంతి. గుండె, ఊపిరితిత్తులూ, మూత్రపిండాలూ, కాలేయం తదితర అవయవాలన్నీ మెలకువలో ఎలా పనిచేస్తాయో నిద్రలోనూ అదేవిధంగా పని చేస్తుంటాయి. మెదడు విశ్రాంతిలో ఉందిగాబట్టి, కండరాలకు ‘సంకల్పిత’ చర్యలు మాత్రమే ఉండవు; ఇంద్రియాలకు చురుకుదనం మందగిస్తుంది. చూపుతో అవసరం లేనందున రెప్పలు మూసుకుపోతాయి. ఈ యోగమంతా పెద్దమెదడు తీసుకునే విశ్రాంతికి అనుబంధం. అలసిపోయేందుకు మెదడేలేని జీవుల్లో నిద్రగా చెప్పుకునే స్థితే సంభవించదు. బహుశా అందుకేనేమో, మనిషితో పోలిస్తే నిద్రకు అవసరమయ్యే సమయం మిగతా ఏ జంతువుకైనా తక్కువే ఉంటుంది.

సరీసృపాల తరగతికి చెందిన జీవులను ‘కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్’- అంటే ‘చల్లనెత్తురు జంతువులు’ అంటారు. వాస్తవానికి చేప, కప్ప తరగతులకు చెందిన జీవుల్లోగూడా వేడిరక్తం ఉండదు. శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే వ్యవస్థ ఆ జీవులకు ఏర్పడలేదు. వేడిని గ్రహించాలన్నా, తగ్గించుకోవాలన్నా అవి పరిసరాల మీద ఆధారపడతాయి. లోతులు మార్చుకుంటూ చేప ఆ అవసరాలను పూడ్చుకుంటుంది; వెచ్చదనం కోసం ఎండనూ, చల్లదనం కోసం నీటినీ ఉభయచరాలు ఉపయోగించుకుంటాయి;
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement