అందరి సౌకర్యం ఆ ఆలోచన | Everyone   Ideen om anlegget som | Sakshi
Sakshi News home page

అందరి సౌకర్యం ఆ ఆలోచన

Published Wed, Apr 9 2014 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 5:45 AM

అందరి  సౌకర్యం ఆ ఆలోచన

అందరి సౌకర్యం ఆ ఆలోచన

ప్రపంచ వ్యాప్తంగా 1990ల నాటి సామాజిక పరిస్థితులు ఎక్కువమంది వ్యాపారవేత్తలను తయారు చేస్తే, 21 వ శతాబ్దం నాటి పరిస్థితులు ఎక్కువమందిని ఉద్యోగస్థులుగా తయారు చేశాయి. అవకాశాలు అంతగా లేని ఆ రోజుల్లో సొంతంగా ఉపాధి సంపాదించుకోవడంపై ఎక్కువమంది దృష్టి పెడితే, అవకాశాలు విస్తృతమైన ఈ రోజులు చాలా మందిని ఉద్యోగానికి పరిమితం చేస్తున్నాయి. అలా 1990ల నాటి ఆలోచనతీరుకు అనుగుణంగా వ్యాపారవేత్తగా ఎదగాలనే తపనతో ప్రస్థానాన్ని ప్రారంభించి 21వ శతాబ్దంలో గొప్ప వ్యాపార వేత్త అయిన వారిలో డ్రివ్ హోస్టన్ ఒకరు.ఇంకోరకంగా పరిచయం చేయాలంటే క్లౌడ్‌కంప్యూటింగ్ సర్వీస్‌గా మనందరికి సౌలభ్యాన్ని అందిస్తున్న ‘డ్రాప్‌బాక్స్’ ఫౌండర్ ఈయన. ఆ సేవ ద్వారా ‘యంగెస్ట్ బిలియనీర్’ గా ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించిన వ్యక్తి.

 కంప్యూటర్ సైన్స్ డిగ్రీ మాత్రమే ఆస్తిగా ప్రస్థానం ప్రారంభించాడు డ్రివ్.  డిగ్రీ పూర్తయినప్పటి నుంచి ఏ రోజూ ఉద్యోగం ఆలోచన చేయలేదట. ప్రపంచానికి టెక్నాలజీ రూపంలో ఏదో ఒక బహుమతి ఇవ్వాలి... అనేదే అతడి తపన. గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యాక నూతన టెక్నాలజీని ఆవిష్కరించి దాన్ని వ్యాపారమార్గంగా మార్చుకోవాలనే ఆలోచనతోనే ముందుకు సాగాడు డ్రివ్.  డ్రాప్‌బాక్స్ కన్నా మునుపు ఎన్నో ప్రయత్నాలు చేశాడు డ్రివ్. అయితే ప్రతిదీ ఎదురుదెబ్బగానే మిగిలింది. 1997లో డ్రివ్ తొలి వ్యాపారప్రయత్నం చేశాడు. అయితే అది ఎవరినీ ఆకట్టుకోలేకపోయింది. ఆ నిరాశలోనే నవ్యతపూర్వకమైన ‘డ్రాప్‌బాక్స్’ ఆలోచన వచ్చింది. అయితే ఆ నాటికి ప్రపంచానికి డ్రాప్‌బాక్స్ అవసరం లేకపోయింది.

 కానీ 2007నాటికి డ్రాప్‌బాక్స్ ప్రాధాన్యం ప్రపంచానికి తెలిసొచ్చింది. దీంతో ఒక్కసారిగా డ్రివ్ హీరో అయ్యాడు. అతడి సంపద అమాంతం పెరిగిపోయింది. ఈ అమెరికన్ ఒక అధునాతమైన, నవ్యటెక్నాలజీ ఆవిష్కర్తగా ఎదిగాడు. దాన్నే వ్యాపారంగా మార్చుకొని అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సంపాదించుకొన్నాడు. ప్రస్తుతం ఫోర్బ్స్ జాబితాలో యువ బిలియనీర్లలో ఒకడిగా నిలిచాడు.

 క్లౌడ్ కంప్యూటింగ్ విషయంలో డ్రాప్‌బాక్స్ కన్నా ముందు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అయితే అవేవీ అంత  విజయవంతం కాలేదు. అదనుచూసి పదునైన ఐడియాతో దూసుకుపోవడం డ్రివ్‌కు సాధ్యం అయ్యింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్లమంది ‘డ్రాప్‌బాక్స్’ యూజర్లున్నారు. డ్రివ్ మదిలోని ఆలోచన అంతమందికి సౌకర్యంగా మారింది.
 
 

Advertisement
Advertisement