Dropbox
-
68 మిలియన్ల యూజర్ ఐడీలు చోరీ
వాషింగ్టన్ : యూజర్ అకౌంట్ల చోరీ, లీకేజీల లొల్లితో కంపెనీలు తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. తాజాగా మరో క్లౌడ్ ఆధారిత డేటా స్టోరేజ్ కంపెనీ డ్రాప్‌బాక్స్ తన యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు లీకైనట్టు వెల్లడించింది. దాదాపు 68 మిలియన్ క్లయింట్ల ఐడీలు, పాస్వర్డ్లు నాలుగేళ్ల క్రితం చోరీకి గురయ్యాయని, తాజాగా అవి ఇంటర్నెట్లో లీకైనట్టు డ్రాప్‌బాక్స్ తెలిపింది. అయితే ఏ యూజర్ అకౌంట్లు హ్యక్ అయ్యాయో తెలుపలేదు. అకౌంట్ల పాస్‌వర్డ్‌ల రీసెట్ చేసుకోవాలని కంపెనీ యూజర్లకు సూచించింది. రెండు వారాల క్రితమే కంపెనీ 68 మిలియన్ యూజర్ల ఆధారాలు ఆన్లైన్లో పోస్టు అయినట్టు కనుగొంది. అయితే ఈ పని ఎవరు చేసిందన్నది ఇంకా వెల్లడించలేదు. యూజర్ ఐడీల, పాస్‌వర్డ్‌ల చోరీపై చింతిస్తున్నామని, ఈ ఘటనకు తాము యూజర్లకు క్షమాపణ చెప్పుకుంటున్నట్టు కంపెనీ ఈ-మెయిల్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని తెలిపింది. 2012లో ఈ అకౌంట్ల చోరీ జరిగిందని, అప్పటి ఈమెయిల్ యూజర్లు ఈ బారీన పడినట్టు తాము విశ్వసిస్తున్నట్టు పేర్కొంది. 2012 నుంచి పాస్‌వర్డ్‌లను అప్డేట్ చేసుకోని వారు వెంటనే రీసెట్ చేసుకోవాలని సూచించింది. 2012 ముందునుంచి తమ సర్వీసులను వినియోగించుకుంటూ, ఒకే పాస్వర్డ్ వాడుతున్న యూజర్లను డ్రాప్‌బాక్స్ హెచ్చరించింది. వెంటనే తమ అకౌంట్ రక్షణ కోసం పాస్వర్డ్ మార్చుకోవాలని తెలిపింది. -
అందరి సౌకర్యం ఆ ఆలోచన
ప్రపంచ వ్యాప్తంగా 1990ల నాటి సామాజిక పరిస్థితులు ఎక్కువమంది వ్యాపారవేత్తలను తయారు చేస్తే, 21 వ శతాబ్దం నాటి పరిస్థితులు ఎక్కువమందిని ఉద్యోగస్థులుగా తయారు చేశాయి. అవకాశాలు అంతగా లేని ఆ రోజుల్లో సొంతంగా ఉపాధి సంపాదించుకోవడంపై ఎక్కువమంది దృష్టి పెడితే, అవకాశాలు విస్తృతమైన ఈ రోజులు చాలా మందిని ఉద్యోగానికి పరిమితం చేస్తున్నాయి. అలా 1990ల నాటి ఆలోచనతీరుకు అనుగుణంగా వ్యాపారవేత్తగా ఎదగాలనే తపనతో ప్రస్థానాన్ని ప్రారంభించి 21వ శతాబ్దంలో గొప్ప వ్యాపార వేత్త అయిన వారిలో డ్రివ్ హోస్టన్ ఒకరు.ఇంకోరకంగా పరిచయం చేయాలంటే క్లౌడ్కంప్యూటింగ్ సర్వీస్‌గా మనందరికి సౌలభ్యాన్ని అందిస్తున్న ‘డ్రాప్‌బాక్స్’ ఫౌండర్ ఈయన. ఆ సేవ ద్వారా ‘యంగెస్ట్ బిలియనీర్’ గా ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించిన వ్యక్తి. కంప్యూటర్ సైన్స్ డిగ్రీ మాత్రమే ఆస్తిగా ప్రస్థానం ప్రారంభించాడు డ్రివ్. డిగ్రీ పూర్తయినప్పటి నుంచి ఏ రోజూ ఉద్యోగం ఆలోచన చేయలేదట. ప్రపంచానికి టెక్నాలజీ రూపంలో ఏదో ఒక బహుమతి ఇవ్వాలి... అనేదే అతడి తపన. గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యాక నూతన టెక్నాలజీని ఆవిష్కరించి దాన్ని వ్యాపారమార్గంగా మార్చుకోవాలనే ఆలోచనతోనే ముందుకు సాగాడు డ్రివ్. డ్రాప్‌బాక్స్ కన్నా మునుపు ఎన్నో ప్రయత్నాలు చేశాడు డ్రివ్. అయితే ప్రతిదీ ఎదురుదెబ్బగానే మిగిలింది. 1997లో డ్రివ్ తొలి వ్యాపారప్రయత్నం చేశాడు. అయితే అది ఎవరినీ ఆకట్టుకోలేకపోయింది. ఆ నిరాశలోనే నవ్యతపూర్వకమైన ‘డ్రాప్‌బాక్స్’ ఆలోచన వచ్చింది. అయితే ఆ నాటికి ప్రపంచానికి డ్రాప్‌బాక్స్ అవసరం లేకపోయింది. కానీ 2007నాటికి డ్రాప్‌బాక్స్ ప్రాధాన్యం ప్రపంచానికి తెలిసొచ్చింది. దీంతో ఒక్కసారిగా డ్రివ్ హీరో అయ్యాడు. అతడి సంపద అమాంతం పెరిగిపోయింది. ఈ అమెరికన్ ఒక అధునాతమైన, నవ్యటెక్నాలజీ ఆవిష్కర్తగా ఎదిగాడు. దాన్నే వ్యాపారంగా మార్చుకొని అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సంపాదించుకొన్నాడు. ప్రస్తుతం ఫోర్బ్స్ జాబితాలో యువ బిలియనీర్లలో ఒకడిగా నిలిచాడు. క్లౌడ్ కంప్యూటింగ్ విషయంలో డ్రాప్‌బాక్స్ కన్నా ముందు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అయితే అవేవీ అంత విజయవంతం కాలేదు. అదనుచూసి పదునైన ఐడియాతో దూసుకుపోవడం డ్రివ్కు సాధ్యం అయ్యింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్లమంది ‘డ్రాప్‌బాక్స్’ యూజర్లున్నారు. డ్రివ్ మదిలోని ఆలోచన అంతమందికి సౌకర్యంగా మారింది.