
ఒకదాని తర్వాత ఒకటిగా మలబద్దకం – విరేచనాలు
నా వయసు 37 ఏళ్లు. ఒక్కోసారి తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు మలబద్దకం, విరేచనం ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నాయి. తేన్పులు, కడుపు ఉబ్బరం వికారం, తలనొప్పి, ఆందోళన ఉన్నాయి .దయచేసి నా సమస్య ఏమిటి? నా సమస్యకు హోమియోలో చికిత్స ఉందా? – జె. నరేశ్‌కుమార్, నేలకొండపల్లి
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యకు నిర్దిష్టమైన కారణం తెలియదు. అయితే... ∙జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు ∙దీర్ఘకాల జ్వరాలు ’ మానసిక ఆందోళన ∙కుంగుబాటు ∙ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్‌వాడటం ∙జన్యుపరమైన కారణలు ∙చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్‌కు దోహదం చేస్తుంటాయి. మీరు చెప్పిన లక్షణాలతో పాటు కొందరిలో నొప్పి లేకుండా కూడా ఐబీఎస్ వస్తుండవచ్చు. వీళ్లలో చాలా వేగంగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేస్తూనే టాయెలెట్‌కు వెళ్లాల్సివస్తుంది. ఐబీఎస్ క్యాన్సర్‌కు దారితీయదు. ప్రాణాంతకమూ కాదు. అయితే చాలా ఇబ్బంది పెడుతుంది.
దీని నిర్ధారణకు నిర్దిష్టమైన పరీక్ష అంటూ ఏదీ లేదు. కాకపోతే రోగి లక్షణాలను బట్టి, రోగి కడుపులో ఏవైనా పరాన్నజీవులు ఉన్నాయా లేదా, చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నాయా అనే కొన్ని అంశాల ఆధారంగా దీన్ని చాలా నిశిత పరిశీలనతో వ్యాధి నిర్ధారణ చేస్తారు. దాంతోపాటు మలపరీక్ష, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అబ్డామిన్, ఎండోస్కోపీ, హైడ్రోజెన్ బ్రీత్ టెస్ట్ వంటి పరీక్షలు ఈ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి.
వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు: ∙పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ∙ఒత్తిడిని నివారించుకోవాలి ∙పొగతాగడం, మద్యంపానం అలవాట్లను పూర్తిగా మానుకోవాలి ∙రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి.
చికిత్స: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. కాన్‌స్టిట్యూషనల్ సిమిలియమ్ ద్వారా చికిత్స చేసి, సమస్యను చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు.
డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్
పొద్దున్నే కీళ్లు పట్టేస్తున్నాయి... ఎందుకిలా?
నా వయసు 37 ఏళ్లు. నేను పదేళ్లగా కీళ్లనొప్పుల సమస్యతో బాధపడుతున్నాను. పొద్దున్న లేవగానే కీళ్లన్నీ పట్టేసి జ్వరం వచ్చినట్లుగా ఉండి, మధ్యాహ్నానికి ఉపశమనం ఉంటోంది. ఈఎస్‌ఆర్ పెరిగి ఆర్‌ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చిందన్నారు. ఈ కీళ్లనొప్పులకు హోమియోలో చికిత్స ఉందా? – కె. రమణి, మదనపల్లె
మీకు వచ్చిన వ్యాధిని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఇది ఆటోఇమ్యూన్ వ్యాధుల్లో ఒకరక. మన శరీరం వ్యాధుల బారిన పడకుండా కాపాడటానికి, వాటితో పోరాడటానికి ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఆ రక్షణ వ్యవస్థ పొరబడి తన సొంత శరీరంపైనే దాడి చేస్తే వచ్చే సమస్యల్లో ఇది ఒకటి. ఈ వ్యాధి శరీరంలోని ఇరుపక్కలా సమాంతరంగా వ్యాప్తి చెందుతుంది. కీళ్లు తీవ్రమైన వాపునకు గురికావడంతో వాటి కదలికలు పూర్తిగా స్తంభిస్తాయి. దాంతో కీళ్లు వైకల్యానికి గురికావడం జరుగుతుంది. కీళ్లనొప్పులు, వాపు, కీళ్లు పట్టివేయడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. కీళ్ల మాత్రమే కాకుండా కళ్లు, నోరు, ఊపిరితిత్తులకు వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఒక్కోసారి ఒకటి కంటే ఎక్కువ కీళ్లలో కనిపిస్తుంది. అయితే మొదట చేతివేళ్లు, కాలివేళ్ల వంటి చిన్న చిన్న కీళ్లలో మొదలై ఆ తర్వాత మోచేయి, మోకాలు, తుంటి వంటి పెద్ద కీళ్లలోకి పాకుతుంది.
కారణాలు: ∙శరీరంలోని జీవక్రియల్లో అసమతౌల్యత, రోగ నిరోధక వ్యవస్థలోని మార్పుల వల్ల ఈ జబ్బు వస్తుంది. ∙శారీరక, మానసిక ఒత్తిడి పొగతాగడం, మద్యం అలవాటు ఉటంన్నవారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. ∙ఆరోగ్య పరమైన జాగ్రత్తలు అస్సలు పాటించని వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
లక్షణాలు: ∙నిరాశ, అలసట, ఆకలితగ్గడం, బరువు తగ్గడం ∙మడమ చేతి ఎముకలపై చిన్న గడ్డలు రావడం ∙ఉదయం లేచిన వెంటనే కీళ్లు బిగపట్టినట్లుగా ఉండి, నొప్పి ఉండటం ∙ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం, ఊపిరితిత్తులు గట్టిపడటం ∙రక్తహీనత, జ్వరం వంటివి.
నిర్ధారణ పరీక్షలు: సీబీపీ, ఈఎస్‌ఆర్, ఎక్స్–రే, ఎమ్మారై, ఆర్.ఏ. ఫ్యాక్టర్, ఏఎన్‌ఏ, ఎల్‌ఎఫ్‌టీ.
చికిత్స: రోగి మానసిక, శారీరక లక్షణాలను అనుసరించి చికిత్స చేయాల్సి ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. బ్రయోనియా, రస్టాక్స్, కాల్చికమ్, ఆర్సినికమ్, లైకోపోడియమ్, నేట్రమ్‌మూర్ మొదలైన మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే వ్యాధి సమూలంగా నయమవుతుంది.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి,
ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్
వరుసగా గర్భస్రావాలు... సంతానభాగ్యం ఉందా?
నా వయసు 32 ఏళ్లు. పెళ్లయి ఎనిమిదేళ్లు అవుతోంది. మూడుసార్లు గర్భం వచ్చింది. కానీ గర్భస్రావం అయ్యింది. డాక్టర్‌ను సంప్రదిస్తే అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని అన్నారు. అయినా ఈ విధంగా ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదు. హోమియో ద్వారా నాకు సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉందా? – ఒక సోదరి, నెల్లూరు
గర్భధారణ జరిగి అది నిలవనప్పుడు, ముఖ్యంగా తరచూ గర్భస్రావాలు అవుతున్నప్పుడు అది వారిని మానసికంగానూ కుంగదీస్తుంది. మరోసారి గర్భం ధరించినా అది నిలుస్తుందో, నిలవదో అన్న ఆందోళనను కలగజేస్తుంది. ఇలా రెండు లేదా మూడుసార్లు గర్భస్రావం అయితే దాన్ని ‘రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్’గా పేర్కొంటారు.
కారణాలు: ఇలా గర్భస్రావాలు జరగడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో కొన్ని... ∙గర్భాశయం అసాధారణంగా నిర్మితమై ఉండటం (రెండు గదుల గర్భాశయం) ∙గర్భాశయంలో కణుతులు / పాలిప్స్ ఉండటం ∙గర్భాశయపు సర్విక్స్ బలహీనంగా ఉండటం ∙కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ వ్యాధులు ∙కొన్ని ఎండోక్రైన్ వ్యాధులు ∙వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం ∙రకరకాల ఇన్ఫెక్షన్లు రావడం వంటి ఎన్నో కారణాలు గర్భస్రావానికి దారితీస్తాయి. అయితే కొంతమందిలో ఎలాంటి కారణం లేకుండా కూడా గర్భస్రావాలు జరుగుతుండవచ్చు.
చికిత్స: రోగనిరోధకశక్తిని పెంపొందించడం, హార్మోన్ల అసమతౌల్యతను చక్కదిద్దడం వంటి చర్యల ద్వారా సంతాన లేమి సమస్యను పరిష్కరించవచ్చు. అలాగే గర్భస్రావానికి దారితీసే అనేక కరణాలు కనుగొని, వాటికి తగి చికిత్స అందించడంతో పాటు కాన్‌స్టిట్యూషన్ పద్ధతిలో మానసిక, శారీరక తత్వాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందిస్తే సంతాన సాఫల్యం కలుగుతుంది. అయితే అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో కారణాలతో పాటు వేర్వేరు అంశాలను పరిగణనలోకి తీసుకొని సరైన ఔషధాలను వాడితే సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది.
డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment