లామాలావుగాలూ... లండి... లండి! | family story in real life | Sakshi
Sakshi News home page

లామాలావుగాలూ... లండి... లండి!

Published Mon, Nov 20 2017 12:10 AM | Last Updated on Mon, Nov 20 2017 12:10 AM

family story in real life - Sakshi

‘20 రోజులే కదా బంగారం.. కళ్లు మూసి, తెరిచేలోపు అయిపోతాయ్‌. 21వ రోజు నీ ముందు వాలిపోతా’.. బుంగమూతి పెట్టిన భార్యామణికి సర్ది చెప్పే ప్రయత్నం చేశా. పెళ్లయిన ఆరేళ్లకు ఇంటిని వదిలి 20 రోజులు ఆఫీసు పని మీద వెళ్లడం ఇదే ఫస్ట్‌ టైమ్‌. అందుకే తెగ ఇదైపోతోంది. ‘సరేలెండి’ అని రమ్య తలాడిస్తుంటే.. మా ముద్దులకూతురు రింకూ నా కాళ్లను చుట్టేసింది. పాపకు మూడేళ్లు. బొద్దుగా, ముద్దుగా ఉంటుంది. ఒక్క ముద్దిచ్చి, రమ్యవైపు కొంటెగా చూసి, ప్రయాణం అయ్యాను.

రమ్యతో అలా అన్నాను కానీ, నాకు మాత్రం 20 రోజులు ఇంటికి దూరంగా ఉండటం అంటే కష్టమే. ఆఫీసర్‌ అప్పజెప్పిన పని చేయకపోతే ఉద్యోగానికి ముప్పు కదా. భారంగా గడిచాయి. అన్నట్లుగానే 21వ రోజు రమ్య ముందు వాలిపోయా. ఇంట్లోకి అడుగుపెడుతోన్న నన్ను చూసి, మా అమ్మగారు.. ‘లాలా... ఇదేనా లావడం’ అనడంతో ఆశ్చర్యపోయా. పొరపాటున వినపడిందేమో అనుకున్నా. ఈలోపు నాన్నగారు వచ్చారు. ‘ఏలా.. ఇదేనా లావడం... అమ్మాయి మీ ఆయన వచ్చాడు చూడు’ అనడంతో.. రివ్వుమంటూ రమ్య వచ్చింది. కళ్లల్లో ఆనందం స్పష్టంగా కనిపించింది. ‘వెళ్లి కాళ్లు కడుక్కోండి. కాఫీ తెస్తా’ అంటూ వచ్చినంత వేగంగా వెళ్లిపోయింది.

నా చిన్నారి రింకూ కోసం కళ్లు వెతికాయి. రూమ్‌లోంచి బుజ్జి బుజ్జి అడుగులు వేసుకుంటూ వచ్చిన రింకూని చూడగానే... ‘మై డియర్‌ రింకూ నాన్నా.. హౌ ఆర్యూ’ అంటూ ముద్దులు పెట్టా. అంతే.. నా చేతుల్లోంచి జారుకుని, బోర్లా పడి, ఏడవడం మొదలుపెట్టింది రింకూ. నాకేం అర్థం కాలేదు. పాపని గట్టిగా పట్టుకున్నామా? చొక్కా జేబులో ఉన్న పెన్ను గుచ్చుకుందా? అని గాబరాపడ్డా. ఈలోపు కాఫీ కప్పుతో ప్రత్యక్షమైన రమ్య నన్ను చూసి గయ్‌మంది. ‘ఎంత పని చేశారు’ అంది కోపంగా. నేనేం చేశానని..  ‘మై డియర్‌ రింకూ నాన్నా.. హౌ ఆర్యూ’ అంటూ ముద్దులు పెట్టా.. అంతే అన్నా.

ఈసారి మా రింకూ ఇంకా సౌండ్‌ పెంచింది. నాకేం పాలుపోలేదు. ముందు మాట మార్చండి. ‘మై డియల్‌ లింకూ నాన్నా.. హౌ ఆల్యూ’ అనండి అంది. అలా అంటే పాప ఏడుపు ఆపుతుందని అర్థమై, అన్నా. అంతే.. ‘డాడీ.. నాకోసం బొమ్మలు తెచ్చాలా?’ అంటూ ముద్దు ముద్దుగా అడిగింది. తెచ్చిన బొమ్మలు తీసిచ్చి సోఫాలో కూలబడి కాఫీ తాగా. ఆ తర్వాత అసలు విషయం అడిగా. పాపకు వినపడకుండా రమ్య చెప్పడం మొదలుపెట్టింది. ‘మీకు తెలిసిందే కదా.. రింకూకి ఇప్పుడిప్పుడే మాటలొస్తున్నాయి. తనకు ‘ర’ పలకడం రావడంలేదు. ‘ల’ అంటోంది. మనం కూడా అలానే అనాలని అనుకుంటోంది. లేకపోతే ఏడుస్తోంది’ అని అసలు విషయం చెప్పింది. ఓస్‌.. ఇంతేనా? ఇప్పుడు చూడు.. రింకూతో ఎలా గేమ్‌ ఆడతానో? అంటూ.. రింకూ.. రింకూ.. రారా... అన్నాను. చేతిలో ఉన్న బొమ్మ విసిరి కొట్టి, ఏడుపు అందుకుంది.

ఈలోపు మా అమ్మగారు ‘ఒలేయ్‌.. పిల్లలు కదా. కొన్నాళ్లు ‘ల’ పలికితే ఏమవుతుంది’ అని నిష్టూరంగా అంది. ఆ రోజు నుంచి నేను కూడా ‘ర’ మానేశాను. అయితే ఆఫీసులో నవ్వులపాలవుతాననుకోలేదు. ‘సులేశ్‌ కాఫీ తీసుకులా’ అంటూ ఫైళ్లల్లో తలదూర్చా. కళ్లింత చేసుకుని చూస్తున్న వాడితో.. ‘ఆ చూపేంట్లా? వెళ్లు వెళ్లు.. కాఫీ తీసుకులా’ అన్నా. బుర్ర. గోక్కుంటూ వెళ్లిపోయాడు. నావైపు అదోలా చూస్తూ.. కాఫీ కప్పు టేబుల్‌ మీద పెట్టాడు. ఈవెనింగ్‌ క్యాంటీన్‌లో మిల్చి బజ్జీ అనీ, లవ్వదోశ అనీ అడుగుతూ.. నా కొలీగ్స్‌కి దొరికిపోయాను.
ఇంట్లో అలవాటైన నాకు.. బయట కూడా ‘ర’ మానేశానన్న విషయం అప్పటికి అర్థమైంది.

అందరికీ అసలు విషయం చెబితే.. గట్టిగా నవ్వారు. ఆ రోజు నుంచి ‘మీ లింకూ బాగుందా. మీలు బాగున్నాలా’ అంటూ సరదాగా ఆటపట్టించడం, నేను నవ్వడం కామన్‌ అయిపోయింది.
వీకెండ్‌ వచ్చేసింది. సండే ప్లాన్‌ మొదలుపెట్టాను. ఎప్పటినుంచో రామారావు అండ్‌ ఫ్యామిలీని లంచ్‌కి పిలుద్దామనుకుంటున్నా. ఫోన్‌ చేసి, విషయం చెబితే, ‘అదెంత భాగ్యం రా’ అన్నాడు. పదకొండు గంటలకల్లా రామారావు తన భార్యాపిల్లలతో ఎంటర్‌ అయ్యారు. వాళ్లను ఆప్యాయంగా ఆహ్వానిస్తూ... ‘లండి.. లామాలావుగాలూ.. లండి.. లండి’ అంది రమ్య.
ఒక్కసారిగా ఆ ఫ్యామిలీ విస్తుపోయింది. మెల్లిగా ‘రమ్య ఆరోగ్యం ఏమైనా పాడైందారా’ అన్నాడు. చురుగ్గా చూశా. లంచ్‌ టైమ్‌ రానే వచ్చింది. అందరం భోజనం టేబుల్‌ దగ్గర కూర్చున్నాం.
రమ్య తెగ హడావుడి పడిపోయింది. కూల వేసుకోండి అన్నయ్యగాలూ.. సలిగ్గా తిను సుజాత (లామాలావు భార్య).. పిల్లలూ మొహమాటపడకండి అంటూ.. కొసరి కొసరి వడ్డించింది. రామారావుకి మా ఆవిడ వంటలంటే ఇష్టం. ఫుల్‌ లాగించాడు. ఇక పొగడటం మొదలుపెట్టాడు.

గోంగూర మటన్‌ భలే వండావమ్మా. రసం అదిరిపోయింది. ఫైనల్‌గా స్వీట్‌ ఇచ్చావే రవ్వ కేసరి అది కూడా అదుర్స్‌ అన్నాడు. అంతే.. మా రింకూ కింద బోర్లా పడింది. ఏడవడం మొదలుపెట్టింది. దాన్ని సముదాయించడానికి మేం నానా తంటాలూ పడ్డాం. ఫైనల్‌గా రామారావుకి అసలు విషయం చెబితే పొట్టచెక్కలయ్యేలా నవ్వాడు. వెళ్లొస్తాం లా. లమ్యా నెక్ట్స్‌ సండే మా ఇంటికి లావాలి. లింకూ బైలా నాన్నా.. అంటూ వెళ్లారు. మాకు నవ్వాగలేదు. మా పెళ్లై ఆరేళ్లు అన్నాను కదా. ముందు మేమిద్దరం. మా సరదాలూ, షికార్లతో మూడేళ్లు గిర్రున తిరిగాయి. తర్వాత మా రింకూ. తనొచ్చాక మా సంసారంలో ఇంకో ఫేజ్‌. ఇది ఇంకా బాగుంది. రోజులు సంతోషంగా గడుస్తున్నాయి. మా రింకూకి ఇప్పుడు ‘ర’ పలకడం వచ్చేసింది. ఎప్పుడైనా అలవాటులో పొరపాటుగా మేం మాత్రం ‘ల’ వాడేస్తున్నాం. అన్నట్లు.. మా సంసాలం బాగుందా అండీ...
 

ఏలేలి పాలు ఓలికమ్మా..!
బాలు (వరుణ్‌ సందేశ్‌), స్వప్న (శ్వేతా బసు ప్రసాద్‌) ఓ కాలేజీలో చదువుకుంటుంటారు. స్వప్నను ఇష్టపడతాడు బాలు. ఏ విధంగానైనా మాట్లాడాలని ట్రై చేస్తుంటాడు. అలా ఓ సందర్భంలో స్వప్నను కలిసి సరదాగా ఆటపట్టిస్తాడు బాలు.‘ఏదో అనుకుంటాం కానీ, అమ్మాయిలను దగ్గర్నుంచి చూడలేం రా బాబు, ఏం కళ్లు ఏంటి రా బాబు దెయ్యంలా?’ అని తన ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నట్లుగా కలరింగ్‌ ఇస్తూ స్వప్నను ఉద్దేశిస్తూ ఈ మాటలు అంటాడు బాలు.

అయితే అప్పటి వరకు కామ్‌గా ఉన్న స్వప్న వెళ్లిపోయే ముందు ‘ఏలేలి పాలు వోలికమ్మా..!’ అని బాలును ఎగతాళి చేస్తూ నవ్వుతూ పారిపోతుంది. అసలు మేటర్‌ ఏంటంటే... బాలుకు చిన్నతనంలో సరిగా మాటలు వచ్చేవి కావు. అప్పుడు ఓ సందర్భంలో వాళ్ల అమ్మతో ‘ఏలేలి పాలు వోలికమ్మా’ అని అంటాడు. ఆ విషయం ఓ లెటర్‌ ద్వారా స్వప్నకు తెలుస్తుంది. అప్పుడప్పుడే మాటలు వస్తున్న చిన్నారుల మాటలు భలే గమ్మత్తుగా ఉంటాయి కదండీ.

– డి.జి. భవాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement